కొత్త సిరా
కొత్త సిరా
కొలను ఒడ్డున కథలతోనే కలం ఇంకిపోతే ,
కడలి పోటుకి కూలుతున్న వ్యధలు తెలిసేదెప్పుడు?
పెరటితోటలో ముల్లు బాధకే మనసు ముక్కలైతే,
బ్రతుకుఆటలో మెరుపువేటుకు బదులిచ్చేదెప్పుడు?
దిగులు గంతలు కట్టుకుని శిశిరాన్ని ద్వేషిస్తే ,
ఎదురొచ్చే వసంతంలో కొత్త చిగురులు చూసేదెలా?
కనుల అంచున కొలిమి పెట్టి,కంటిపాపకు జోలపాడితే
విశ్రమించని తనువులో ఉత్తేజానికి స్థానమెలా?
ఒరుగుతున్న సౌధాలలో పాలరాళ్ళను పేర్చుకుంటూ,
జారుతున్న శకలాలలో నలిగిపోకు హృదయమా!
ముసురుకున్న మబ్బులలో గతమేదో వెతికేస్తూ,
రాలిపడని చినుకులకై తపనపడకు మిత్రమా!
సంధి కుదరని ఆలోచనలకు స్వస్తి మంత్రం చెప్పేసి,
ముందుకెళ్ళే కాలంతో మౌనంగా నడిచిపో!
ఆగిపోయిన చరితనే మరల తిరిగి రాసేందుకు
క్రొత్త సిరా నింపుకుని కావ్య కలమై కదిలిపో!
