ఇంద్రజాలం
ఇంద్రజాలం
పిసరంత బూడిదకు అంత విలువా
చిటికెడు పసుపు కుంకుమలకు అంత విలువా
పసుపు పూసిన దారానికి అంత మహిమా
పాల కొమ్మలకు అంత ప్రాధాన్యమా
ఓ
సంఘర్షణల బాటసారీ
ఇది ఇంద్రజాల మహేంద్రజాల
గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలా
శక్తి వాటిదేనా
అది నీ మనసులోని నమ్మకానిది కాదా
నీలోని దైవాన్ని దర్శించే ప్రయత్నం చేయవేమి
ఈ సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మకు
నీ హృదయ పీఠం ఇవ్వలేవా
అందులో చోటిస్తే
అజ్ఞానమనే చీకట్లను ఆయన తొలగించకుండా ఉంటాడా
నీ చిరునవ్వులో చిదానంద రూపుడై
నీ శ్వాసకు ఆప్తుడైన
ఆ శ్రీకాళహస్తీశ్వరుని స్మరించవే
మనసా
ఎంత కాలం మాయలో ఉంటావు
ఈ శరీరం మట్టి అవుతుంది అని
చావింట్లో వినిపించే భగవద్గీత చెప్పలేదా
నువ్వు శాశ్వతమా
ధర్మాధర్మాలు నీకు తెలియనివా
మరి నీ కర్తవ్యం ఏమిటి
నిన్ను నువ్వు సమాధానపరచుకునే దారేది
సిగరెట్టూ మందా
మాదక ద్రవ్యాలు
సురత క్రీడల వినోదాలు
ఆకాశ హర్మ్యాలా
ఇదేనా జీవిత గమ్యం?
ఆలోచించు
లేదా
నీలోని శివుణ్ణి అడుగు
