ఏమిటి వంత
ఏమిటి వంత
సప్త పదులు రాలిపోయాయి
సుప్తిలో ఒలికి పోయినట్టు
తప్త సన్నిభ కాంచనమే నా బ్రతుకు
బరువులు దించుకున్నా
బాధ్యతలు తేలిపోయాయి
శొంఠి పిక్కల్లా మేమిద్దరం
కారాలూ మిరియాలూ నూరుకుంటూ
గారాలూ మురిపాలూ చేదుకుంటూ
ఆనాడు ఆ మూల పల్లెల్లో
ఈనాడు ఈ మహానగరంలో
ఆనాడు ఆ పూరికొంపలో
ఈనాడు ఈ భూరి మేడలో
ఎంత వింతైనది జీవితం!
ఐనా
ఏదో చింత
ఎందుకో వంత
ఏదో దిగులు
ఎందుకో గుబులు
నిజం
ఏదో పొగొట్టుకున్నా
ఏమిటది అని
వెతుకుతున్నా నాలో నేను
నాలో ఆప్యాయతను కడుపునిండా
పోసిన నా మిత్రులా?
నన్ను కని
తన వొడిలో రెండు దశాబ్దాలు
జోలపాడి పెంచిన నా జన్మస్థలమా?
ఆ తనూజా?
చూడాలని ఉంది నాదైన పల్లె
ఆడాలని ఉంది ఆ చింతచెట్టు నీడన
ఊగాలని ఉంది ఉయ్యాలలో తనూజతో
నింబవృక్ష నీడన సేదతీరాలని వుంది
కబుర్లాడాలని ఉంది ఆమెతో
మనసారా మాట్లాడాలి
హాయిగా కొట్లాడాలి
ఆ శేషడు
ఆ చంద్రడు
ఆ గిద్దా
ఆ గంపాలతో
గుర్తించలేదు నన్ను
పలుకరించలేదు
ఎవరూ
ఎవరూ మిగిలి లేరు
నా తోటి వారు
వెళ్లిపోయారు అందరూ
తనువు చాలించిందట తనూజా
స్వార్ధం కాటుకనద్ధి
చెట్లపై కాటు వేశారు
పచ్చదనం పారిపోయింది
గుడిసెలు మేడ లైనాయి
అందరూ జ్యోతిలక్ష్మిలే
అందరూ జయమాలినిలే
చేతిలో చరవాణీ
గూటిలో మౌనవాణి
ఎవరికి వారే
యమునా తీరే
వెను దిరిగా
కనులు తుడుచు కుంటూ!
... సిరి ✍️❤️
