భూమి నుదిటిపై రక్తపు తిలకం
భూమి నుదిటిపై రక్తపు తిలకం
భయపడుతున్నాయి పంచభూతాలు
పంచేంద్రియాలు విస్ఫోటనం చెందుతుంటే
గుండె చప్పుళ్ళు గుర్రంలా పరిగెత్తుకుంటూ
మెదడు పాదరసం కరిగిపోతూ ద్రవిస్తోంది..
భూమి నుదుటిపై రక్తపు తిలకం
సమాంతరంగా తాకుతున్న అగ్ని గోళం
గడ్డ కట్టిన జలపాతం గంగా ప్రవాహమై
మట్టిని నీటిని ఏకం చేస్తూ సాగుతుందా..
అలుముకున్న ఆకాశపు యంత్ర పరిశ్రమ
శత్రు శిబిరాలు వాయిస్తున్న మృత్యు ఘోష
భయము గుప్పెట్లో బక్క చిక్కిన ప్రాణులు
భూదేహం నిండా గాయాలతో రణపు గుండు..
నింగిపై రాబందుల దండయాత్రలు
అణు బాంబులతో చెల్లాచెదురైన నేల ఖండాలు
విషవాయువులతో ఊపిరాడని జీవులు
ప్రకృతి అంటుకున్న నల్లని మేఘపు ఛాయలు...
భయానికి ఆరాటానికి నిత్య పోరాటం
చైతన్యానికి ప్రతీక శాంతి కపోతాల గీతం
భయం పుట్టించే మేఘాల సంఘర్షణ
యుద్ధాన్ని ఆవిష్కరించే సంధ్య వెలుగు నీడలు...
చివరికి ఏదైనా భూదేవికి శాపమే
లిప్త కాలపు సంధిలో రణ తంత్రం వచనాలే
మిగులుతున్నది దేహం విశ్రాంతి నివాసాలకు
కదులుతున్నది వినాశకర దారుల కూడలికి..
