అద్దం
అద్దం
ఏం ఆలోచిస్తూ అలా ఒంటరిగా కూర్చున్నావ్. ఏం కోల్పోయావ్ కొత్తగా ఈరోజు. ఎప్పటిలానే ఉంది కదా!! కొత్త వింత ఏం జరిగింది.
నిన్ను ఎప్పుడో నువ్వు వదిలేశావ్.
ఎవరికోసమో బ్రతుకుతున్నావ్..
ఎవరి మాటో వింటున్నావ్. నీ మనసు నీతో మాట్లాడటం
మానేసి ఎన్ని రోజులైంది, గుర్తించావా???
కోపం వస్తుందా?? ఎవరి మీద??
నా మాటల మీదనా??
నిజం నీకు నచ్చడం లేదా??
తప్పులు వేలెత్తి చూపిస్తున్నందుకు కోపమా??
నువ్వు మనస్పూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది.
రోజు ఒకర్ని నిందిస్తున్నావ్, నీకు ఏమైనా లాభం జరిగిందా??
పోనీ వాళ్లేమైన మారుతున్నారా??
బరువు బాధ్యతలు అని చెప్పాలి అనుకుంటున్నావా??
బరువు అనుకుంటే దించేయ్.
బాధ్యత అనుకుంటే మొయ్యి.
అంతే కానీ న
ీ ఆలోచనలతో బరువుని మోయకు.
ఏం చేతకాని వాడిలా రోజు నా ముందు నిల్చుంటావ్.
కన్నీలతో నా మొఖం తడిపేస్తావ్.
నీ బాధలన్ని నాతో చెప్పుకుంటావ్
కోపం వస్తే దొరికిన వస్తువుల్ని నా మీదికి విసిరి కొడతావ్.
నేను పగిలి నిన్నే నీకు కొత్తగా చూపిస్తున్న పలు విధాలా.
నీకు ఏం చెయ్యలేకపోతున్నా అన్న బాధ నాది.
వెళ్లి నీకు నచ్చింది చెయ్. సంతోషంగా నా దగ్గరకి రా తిరిగి.
తిరిగొచ్చినప్పుడు మొఖం పైన చిరునవ్వు కనిపించాలి.
బానిస సంకెళ్లు తెంచుకో.
నచ్చిన పనిలో కష్టమున్నా సంతృప్తి ఉంటుంది.
నచ్చని పని చేస్తూ నలిగిపోతూ నా దగ్గరకి రాకు.
నిన్ను నీలా చూడాలని వుంది. నీకోసం ఇక్కడే ఎదురు చూస్తు ఉంటా.
౼ కిషోర్ శమళ్ల