STORYMIRROR

Nagesh Pulletikurthi

Horror Tragedy Fantasy

4  

Nagesh Pulletikurthi

Horror Tragedy Fantasy

వంక మామిడి చెట్టు –4

వంక మామిడి చెట్టు –4

7 mins
46

నాలుగో అధ్యాయం (ఒక తండ్రిని రాక్షసునిగా చేసిన ఆవేదన) 

నా పేరు పరాంకుశ రావు.  

మా వూరు మండల హెడ్ క్వార్టర్. సుమారు రెండువేల గడప వుంటుంది. 

మావూరికి కరణం నేను. కొంచెం మోతుబరిననే చెప్పాలి.  

సుమారు 230 ఎకరాల ఆసామీని. పేరు, పలుకుబడి బాగా వున్న కుటుంబం మాది.   

శ్రీవల్లీ మాకు లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. 

మా తల్లిగారు పోయిన తరువాత అమ్మాయి పుడితే మా అమ్మే మళ్ళీ నా కూతురుగా, పుట్టిందని ఎంతో పొంగిపోయాను.  

ఎంతో ముచ్చటపడి ‘శ్రీవల్లీ’ అని అందమైన పేరు పెట్టుకున్నా.. 

ఎక్కువగా అమ్మా అనో, అమ్మలూ అనో పిలుచుకునేవాడిని.  

అమ్మాయి అందం, చదువుతో పాటు లలిత కళాలన్నా చాలా మక్కువ. 
చిన్నప్పటినుండే సంగీత జ్ఞానం కనిపించడం తో వీణ నేర్పించడం ప్రారంభించాం. 

మెల్ల మెల్లగా నేర్చుకోవడం ప్రారంభించింది.

వీణ పట్టుకునే విధానంతో మొదలుపెట్టి, స్వరానికి సరిపోయే శృతి సెట్ చేసుకోవడం, పంచమం, మంద్ర, మధ్య, తార స్థాయిలు స్పష్టంగా తెలుసుకోవడం.  

సరళి, వరసలు తెలుసుకోవడంతో బాటు, శంకరాభరణం, కీరవాణి, ఖరహరప్రియ, మోహనం లాంటి రాగాల్లో గీతాలు, వర్ణాలు అభ్యాసం చేస్తూ రాగ నిర్మాణం పై స్పష్టంగా అవగాహన వచ్చింది.

ఇప్పుడిప్పుడే త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి కృతులు కీర్తనలు నేర్చుకోవడం ప్రారంభించింది.

అప్పుడప్పుడు స్కూల్ ఫంక్షన్ లలో చిన్న చిన్న కచేరీలు ఇస్తుండేది. 
చిన్న వయసులోనే మంచి సంగీత జ్ఞానం తోపాటు చదువులో కూడా ఎప్పుడు ముందే వుండేది.

అమ్మాయిని బాగా చదివించి, మంచి వీణ కళాకారిణిగా తయారు చేసి, చాలా గొప్ప సంబందం తేవాలని మేం ఎన్నో కలలు కంటుండే వాళ్ళాము.

అందుకే అమ్మాయి ఫంక్షన్ లో కూడా బంధువులు పెళ్లి సంబందాలు మాట్లాడితే ఇప్పుడే కాదులే అని సున్నితంగా తిరస్కరించాను కూడా. 

ఎంతో సాత్వికంగా, సాఫీగా, ఎన్నో ఆశలతో సాగుతున్న మా జీవితంలోకి ఈ శేఖరం రూపంలో శని దాపురించి, మమ్మల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తాడని, మా జీవితాలు అతలాకుతలం చేస్తాడని, నేను కలలో నైనా ఊహించలేదు.

అమ్మాయిమీద పెట్టుకున్నా ప్రేమ, ఆశలు, సంఘంలో గౌరవం, కట్టుబాట్లు అన్నీ కలసి శేఖరాన్ని చంపించాలనే క్రూర నిర్ణయం తీసుకోవడానికి, నన్ను రక్తం త్రాగే రాక్షసునిగా చేశాయి.  

మా బంధువులు మెల్లగా నా చెవిలో వేశారు, అమ్మాయి స్కూల్ లో ఎవరో అబ్బాయితో సఖ్యంగా వుంటున్నాదని, ఇద్దరు రాసుకు పూసుకు తిరుగుతున్నారని,

ఇవన్నీ ఊరిలో తెలిస్తే మనకి, మన కులానికి, మన అంతస్తుకు ఎంత నామార్ధ అని ఇంకా ఏవేవో చెప్తున్నారు.

అప్పటికే అమాయి పేరు స్కూల్ గోడలపై చేరిపోయిందట.

ఇలాంటివన్నీ ఇంటిలో వాళ్ళకే ఆఖరున తెలుస్తాయేమో కదా.
 
అయినా వీళ్ళకి మా అగ్ర కులాల వాళ్ళే కావలసి వచ్చారా..

ఎలా రేపటి నుండి ఫలానా పరాంకుశం గారి అమ్మాయి ఇలా పొలాలంబడి, రోడ్ల వెంటబడి ఎవరో తక్కువ జాతి వాడితో తిరుగుతుందట అని అందరికీ తెలిస్తే,

నలుగురిలో నా పరువు ఏంగాను?

అమ్మాయికి పెళ్లి ఎలా చేయగలను?

దేవుడా ఎందుకు మాకు ఇలాంటి శిక్ష వేశావు అని కుమిలి పోయేవాడిని.

అమ్మాయిని నేను నేరుగా అడుగలేక వాళ్ళ అమ్మ తో అడిగిస్తే.. అలాంటిది ఏమి లేదు, మేం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది.

బయట చూస్తే పరిస్థితి ఇలా వుంది. ఇప్పుడేం చేయాలి. 

అప్పుడు జగ్గారావు కనిపించాడు. వీడు ఒక చిన్నపాటి రౌడీ మా వూరిలో.

వెంటనే వాడిని పిలిచి, వివరం చెప్పి ఒక్కసారి నువ్వు వాడికి వార్నింగ్ ఇవ్వు రా అని అడిగితే.

అప్పుడు జగ్గారావు కళ్ళులో ఒక్క క్షణం ఆశ్చర్యం మెరిసింది. తర్వాత నవ్వు వచ్చింది. చిన్నగా, కానీ పళ్ళు కనిపించేలా.

“అదేం పెద్ద విషయం లేదులే బాబూ… ఆ అబ్బాయి పేరు శేఖరం.. శేఖర్ అని పిలుస్తారు కదా?

నేను చూసుకుంటా బాబూ, రేపటి నుంచి మీ అమ్మాయి పేరు వాడి నోట్లో రాదు. గ్యారంటీ!”

నేను ఒక్క క్షణం ఆగాను. గ్యారంటీ అన్న మాట నా గుండెలో దడ పుట్టించింది.

కానీ ఆ దడని ఆపుకోలేకపోయాను.
“అది… వార్నింగ్ ఇస్తే చాలురా జగ్గా… ఎక్కువ కాకూడదు. భయపెట్టి దూరం చేయి. బాగా భయపెట్టు. అర్థమయ్యేలా.”

జగ్గారావు నవ్వు ఇంకా పెద్దదయ్యింది. “అర్థమవుతుంది బాబూ… మీరు ఆలోచించకండి. మీ అమ్మాయి పేరు వాడు కలలో కూడా జ్ఞాపకం పెట్టుకోడు.”

ఒరేయ్ జగ్గా మా పేరు, మా ఇంటి పేరు ఎక్కడా ఇందులో రాకూడదు. 

వాడికి వార్నింగ్ ఇస్తే వాడు ఎవరికైనా చెప్తే అలా ఊరందరికి తెలిసిపోతే ఇలా నా మనసు మనసులో లేదు. 

అయితే వాడ్ని వేసెద్దామా ? 

వేసేయడం అంటే చంపేయడమా ?

అవును బాబు.. మన ఉరివాళ్ళతో కాదు .. ఒరిస్సా నుండి తెప్పి స్తాను.

అప్పుడైతే మన పేరు బయటకి రాదు.

నేను ఏదీ ఇదిమిద్దాం తేల్చుకోలేక అలా నడుచుకుంటూ స్కూల్ గ్రౌండ్ దగ్గరకి వెళ్తున్నాను.  

ఒక్కసారి ఆ దృశ్యం నా రక్తం మారిగేలా చేసింది.

వాడు మా అమ్మాయికి సైకిల్ నేర్పిస్తున్నాడు. ఎక్కడెక్కడో పట్టుకుని.

అమ్మాయి ఏమి పట్టించుకోవడం లేదు. సైకిల్ త్రొక్కడం పైనే ధ్యాస అంతా..

వీడు.. వీడు. ఎక్కడెక్కడో చేతులతో తడుముతున్నాడు.. ఆ దృశ్యం నిజంగా చాలా బాధకి గురిచేసింది.

ఎందుకు ఈ కాలం అమ్మాయిలు తల్లి తండ్రుల ప్రేమను, ఇంటి గౌరవాన్ని, సంఘంలో వున్న కట్టుబాట్లను అర్ధం చేసుకోరు.

ఇవన్నీ ఊరిలో తెలిస్తే తల్లి తండ్రులకి ఎంత నామర్ధయో గదా. ఎందుకు అర్ధం చేసుకోరు. 

ఇలా షాక్ తో మెల్ల మెల్ల గా నడుస్తున్నాను..

పరాంకుశం గారు ఏంటి నడుస్తున్నారు.. ఎవరో అడుగుతున్నారు.

మనసు పరి పరి విధాలా పోతుంది. అందరికీ ఈ విషయం తెలిసిపోతే ఎలా.

నన్ను ఎలా చూస్తారు. అందరికీ సుద్దులు చెప్తాడుగాని ఇంటిని సరి చూసుకోలేదు అని నవ్వు కుంటారు కదా.. 

సైకిల్ పాడయిందా ? నడుచుకుంటూ పోతున్నారు? 

వీడికి తెలిసిపోయిందా మా అమాయి సైకిల్ విషయం.. అందుకే అలా అంటున్నాడా? 

కరణం గారు చూసుకుని నడవండి, ఆ సైకిల్ మిమ్మల్ని గుద్ద వలసింది. ఎవరో హెచ్చరిస్తున్నారు.

ఇక్కడా సైకిలేనా? 

ఒరేయ్ ఎందుకురా ఏడుస్తున్నావు. పండగకి సైకిల్ కొంటానన్నాను కదా.. సైకిలా.. 

ఏంటిది అందరు సైకిల్ గురించే మాట్లాడుతున్నారు..

అప్పుడే మా అమాయి వాడితో సైకిల్ పై తిరగడం అందరికీ తెలిసిపోయింద..

అందుకే సైకిల్ సైకిల్ అని నన్ను ఎగతాళి చేస్తున్నారా.. 

సైకిల్.. సైకిల్.. సైకిల్.. సైకిల్..

నాలుగు దిక్కులూ సైకిలేనా.. 

ఒక్కసారి నా మనసులో నిర్ణయం అయిపోయింది. వేసేయాలి .. వీడ్ని వేసేయాలి.. 

అన్నట్లు గానే ఎక్కడో రంపా కోడు బండ ఉరినుండి నలుగురిని తీసుకొచ్చాడు.

మాట్లాడుకున్నట్లే యాభై వేలు ఇచ్చేశాను. అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి నలుగురి కళ్ళల్లో పైశాచికానందం.

గమ్మనకుండా తీసుకుని రాత్రికి పని అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారు.

రాత్రి 8 గంటలకి జగ్గారావు మా ఇంటికి వచ్చినప్పుడు, 

ఒరేయ్ జగ్గు పని పక్కగా జరుగుతుందంటావా? వాడని వేసేస్తారు కదా..... 

మా కుటుంబం పేరు బయటికి రాదు కదా. మా కుటుంబ గౌరవం రోడ్డు కెక్కదు కదా.. గొంతులో ఆదుర్దా...

మీరూరుకోండి పంతులు గారు. మీలాంటోలు ఇలాంటి ఘోరాలు ఎన్ని చేసిన, చేయించారని చెప్పినా ఎవరు నమ్ముతారు చెప్పండి. 

అయినా ఎవరికి అనుమానం రాకూడదనే కదా బయట నుండి తెప్పించా. మూడో కంటికి తెలియకుండా వాడ్ని ఫినిష్ చేసేస్తారు. 

వారం తిరక్కుండా మీరు ఈ మీ మేనల్లుడిక్కిచి పెళ్లి చేసేయొచ్చు.

ఈ పాటికి వాడిని వేసేసుంటారా?
ఎందుకు అనుమానం పదండి .. స్పాట్ కి పోయి వద్దాం. 
 

ఇలా మర్డర్ లు చేయడం, చేయించడం సినిమాల్లోనే గాని, నిజ జీవితంలో జరుగుతాయని అదికూడా నేనే చేయిస్తానీ, నా కూతురు నాతోనే ఇలా చేయించే పరిస్థితి కల్పిస్తుందని కలలో కూడా ఊహించలేదు.. 

ముగ్గురం మామిడి చెట్టు దగ్గరకి చేరుకునేందరికి అక్కడ పరిస్థితి నిజానికి చాలా దారుణంగానే ఉంది.

నలుగురు శేఖరాన్ని చుట్టుముట్టి విపరీతంగా కొట్టినట్లున్నారు. వంటి నిండా గాయాలు, రక్తం తో పడి వున్నాడు. కాళ్ళు చేతులతో ఇష్టం వచ్చినట్లు ఎక్కడ బడితే అక్కడ కొడుతున్నారు. 

ఎలా వచ్చిందో మా అమ్మాయి అక్కడ వుంది. వాళ్ళని ఆపమని అరుస్తుంది. 

ఎవరు మీరు నన్నెందుకు ఇలా కొడుతున్నారు అని అడుగుతూనే ఉన్నాడు వాడు.  

అమ్మాయి ఆపించమని కాళ్ళ వెళ్ళా పడుతున్నా... 

నా మనసు కరగలేదు. నాకు సైకిల్ నేర్పిస్తూ వాడు చేసిన పనే గుర్తుకు వస్తుంది.  

ఆపమని చెప్ప లేదు.... చెప్పను కూడా..

ఆ వెధవ చేసిన పని తలచుకుంటే .. ఛీ.. ఛీ.. 

నీకు మా ఇంటి పిల్లే కావలసి వచ్చిందిరా కులం తక్కువ వెధవా...అని ఖండ్రించి ఉశాను గాని ఆపమని చెప్ప లేదు. 

“ఏహి పర్యంత దేఖుచ్ఛంతి కాహింకి? కౌణసి ముహూరత్ అచ్చికి? అని జగ్గారావు అరిచేసరికి,

వాళ్లలో ఒకడు వెనుక నుండి కత్తి బయటకి తీశాడు. 

ఇద్దరు శేఖరం రెండు చేతులు, మిగిలిన వాడు శేఖరం కాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. 

కత్తితో వాడు నిదానంగా, క్రూరంగా, ఏమాత్రం ముఖంలో ఏ ఫీలింగ్ లేకుండా, శేఖరం పీకని అందరం చూస్తుండగానే కోసి పడేసాడు. 

రక్తం చివ్వున బయటకి చిమ్మి శేఖరం గిలగిల కొట్టుకుంటున్నాడు. 

ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమేనా.. అని అమ్మాయి ఏదేదో అంటుంది..

ఎవరో ఏంటి నేనే చూశాను కదా.. అమ్మాయిని ముట్టు కోవడం.. 

ఇంతలో అమ్మాయి ఒక్క వుదుటున కత్తి అమాంతం వాడి చేతి నుండి లాక్కుంది ....

నేనే శేఖర్ చావుకి కారణమైతే, నా చావే శేఖర్ చావుకు సమాధానం అవ్వాలి. 

అమ్మా అమ్మలు వద్దు వద్దు కత్తి క్రింద పడేయీ .. ఈ వెధవ కోసం నువ్వెందుకు చావాలి. వద్దమ్మా వద్దు 

మీ పిల్లల కోసం ఇతరుల పిల్లల్ని చంపేసినా ఫర్వాలేదనుకునే నీలాంటి వాళ్ళ పైశాచిక మనస్సులకి నా చావే అంతిమ శిక్ష కావాలి నాన్నా" -

మీ అందరికి బుద్ధి రావాలంటే ఒకే ఒక శిక్ష...

అవును అదే సరైంది... 

అమ్మా శ్రీవల్లీ వద్దు తల్లి. కత్తి కింద పడేయ్ 

అమ్మాయి తల అడ్డంగా ఊపుతూ.. నా ముఖం లోకి చూస్తూ .. 

ఒక్కసారి గొంతు కసుక్కున కోసే సుకుంది .... 

రక్తం ... వొళ్ళంతా రక్తం...

చుట్టు రక్తం...

అమ్మాయి రక్తం...

శేఖర్ రక్తం... 

అమ్మాయిలో ఒక్కసారిగా చలనం ఆగిపోయింది. 

ఒక్కసారి కళ్ల ముందు పెద్ద మెరుపు. అంతా చీకటి వెంటనే పెద్ద వెలుతురు..  

కళ్ళు మూసి తెరిచే సరికి అమ్మాయి శవం నా చేతుల్లో.... నాకు ఏడుపు కూడా రావడం లేదు..

నేను ఎవర్ని చంపాను.

శేఖరాన్నా???.. నా ముద్దుల కూతురునా???..

అయ్యో ఎంతో అల్లారు ముద్దుగా పెంచు కున్నానే.. ఎన్నో కలలు కన్నానే .. ఎంతో ఉన్నత శిఖరాలకి వెళ్తుందను కున్నానె ..

ఇలా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోతుందా..

కాదు కాదు.. నేనే పంపించేశాను..

 అవును నేనే చంపేశాను...

ఇదేం పట్టనట్లు ప్రక్క పొలం గట్టు మీద ఆ నలుగురు కూర్చొని బీడీలు త్రాగుతూ మాట్లాడు కుంటున్నారు.  
 
అంత దుఖం లోనూ ఎందుకో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారినట్లు అనిపించింది.

అప్పటివరకు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వున్నది .. ఒక్కసారిగా ఎదురుగాలులు. మెరుపులు. 
 ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది. 

 మామిడి చెట్టు కొమ్మలు జుత్తు విరబోసుకున్న దెయ్యాలలా గాలికి విపరీతంగా ఊగుతున్నాయి.  

ఒక్కసారిగా పెద్ద మెరుపు. భయంకరమైన నిశ్శబ్ధం. గాలి ఒక్కసారి ఆగిపోయింది. 
చెట్టు కొమ్మ పై ఎవరో కూర్చున్నట్లు క్రిందకి పైకి ఊగుతుంది. 

మధ్యలో వీణ మీటు తున్న శబ్ధం.... ఇక్కడ వీణ ఏంటి.

ఇంత రాత్రి సమయంలో వీణ .. అదీ ఇక్కడా.. 

కీయ్... కీయ్... కీయ్... ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.. 

రెండూ కలసిన శబ్ధం చాలా భయంకరంగా వుంది.. 

ఆ శబ్దం మొదట గాలిలో సన్నగా ప్రారంభం అయింది. 

కీయ్.. ... కీయ్.. ... ట్రింగ్.. ట్రింగ్..

మెల్లగా ప్రారంభమైన, అలా పెరుగుతూ, ఎవరో పిల్లలు ఊగుతున్నట్లు చెట్టు కొమ్మ వేగంగా వూగుతుంది.

దానికి తోడు గజ్జెల చప్పుడు తో భయంకరంగా వుంది.  

 మామిడి చెట్టు కొమ్మ మీద... ఎవరో కూర్చున్నారు. శ్రీవల్లీ లా వుందే . 

చీకట్లో కళ్లు రెప్పలు లేకుండా తెల్లగా మెరిసిపోతున్నాయి. 

జుత్తు గాలికి ఎగిరి ఎగిరి మొహం మీద పడుతుంది. మొహం స్పష్టంగా కనిపించడం లేదు. 

 అమ్మలూ.. నా పిలుపులో ముందులా ప్రేమ లేదు, భయం స్పష్టంగా తెలుస్తుంది.

 ఘల్లు మని గజ్జెల శబ్దం. నేల మీద అంతా ఎత్తు నుండి దుమికినా, ఆ శరీరం నిటారుగా నిలబడింది.  

అది... మా అమ్మాయి. 
అవును మా అమ్మాయే.. 

 మెడ మీద గాయం లేదు. రక్తం లేదు.
కానీ ఆమె నవ్వుతోంది.

 నవ్వు, ఏడుపు కలగలిపిన నవ్వు. చాలా భయంకరంగా వుంది. 
 
ఆ నలుగురిని చూస్తూ “మీరు నన్ను చంపారు కదా... ఇప్పుడు నా వంతు.”

వాళ్ళు పరుగెడుతున్నారు..

అమ్మాయి కూడా వెంట బడి వెళ్తుంది.  

కానీ గాలిలో ఎగురుతూ నెలపైకి దిగుతూ... 

పైకి లేచి కిందికి దిగుతోంది.

ఒకడి కాళ్లు నేలలోకి కూరుకుపోయాయి. రక్తం లాగా ఏదో నల్లటి ద్రవం అతని కాళ్ల చుట్టూ పాకుతోంది. 

బాధతో వాడు అరుస్తున్నాడు. నన్ను వదులు, వదులు అని. 
ఆ నల్లటి ద్రవం అలా వంటి మీద నుండి, మెల్లగా, ఛాతిపైకి అలా నోరు, ముక్కు, కళ్ళు , చెవులు అంతా అలముకుంది.  

అమ్మాయి అదే నవ్వు,,  

చాలు చాలు ఈ బాధ భరించలేక పోతున్నాను.. నన్ను చంపే ప్లీజ్ ప్లీజ్..... త్వరగా చంపేయి .. 

తెరలు తెరలు గా నవ్వు.. మీకు చావు తప్పదు రా అంటోంది. .. 

చావు... చావు రా.. వాడి గొంతు కసక్కున కోసి.. కాళ్లతో ఆ ద్రవం లో అదిమిపెట్టి తోసేసింది. మళ్ళీ నిశ్శబ్ధం. 

మిగతా ముగ్గురు పరిగెడుతున్నారు.

ఆయసంతో భయంతో వగరుస్తున్నారు. 

వెనకాలే  అమ్మాయి నవ్వు, ఆ ముగ్గురి అరుపులు... అన్నీ కలిసి ఒకే శబ్దం అయ్యాయి.

 “సాహూ... నాకు ఆ అమ్మాయి కనిపిస్తోంది... నా ముందరే నిలబడి నవ్వుతోంది...” వాడు అంటున్నాడు  
 
వాడు తన కత్తిని తన గొంతుకి ఆనించాడు.
“ఇక చాలు... నేను ఇక్కడే చస్తాను...”
 వాడు గొంతు కోసుకున్నాడు.
రక్తం చిమ్మింది.

కానీ వాడు క్రింద పడలేదు.
నిలబడి... నవ్వుతున్నాడు. 
అదే నవ్వు. అమ్మాయి నవ్వులా..  

ఇంకోకడు భయంతో పిచ్చివాడిలా అరవడం మొదలుపెట్టాడు. వద్దు వద్దు నన్ను చంపే ప్లీజ్ ప్లీజ్ చంపే.. 
అదీ అలా రా దారికి.. అయితే చావు.. 

ఒక్కసారి గాల్లోకి లేచి అడ్డంగా పడిపోయాడు.. పొట్ట చీల్చబడి నేలంతా రక్తం ప్రేగులు   
మిగిలిన వాడు చెట్టు చుట్టూ పిచ్చి పట్టినవాడిలా పరిగెడుతున్నాడు. 

కానీ ఎటు పరిగెత్తినా... ఆ మామిడి చెట్టు ముందరే వచ్చి మళ్ళీ నిలబడుతున్నాడు.

నన్ను చంపే చంపేయ్ అని అరుస్తున్నాడు.. ఇంతలో 

“ఇప్పుడు నీ వంతు, సాహూ...”

అవును ఇప్పుడు నావంతు.. ప్లీజ్ నన్ను త్వరగా చంపు.....

కత్తిని నా గొంతుకి ఆనించు కున్నాడు..... 

ఒక్కసారిగా కోసుకుని క్రింద పడిపోయాడు.. 

మా దుఖాన్ని గుర్తించినట్లు వాతావరణం ఒక్కసారిగా స్తబ్దం అయింది.
శ్మశాన నిశ్శబ్ధం. 

ఇదంతా చెట్టుపై నుండి అమ్మాయి చూస్తుంది..

నవ్వు అంతా ఒక్కసారిగా ఏడుపుగా మారిపోయింది.. చెవులు చిల్లులు పడే ఏడుపు.. గుండెలు ఆవిసిపోయే ఏడుపు.. 

ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది.. 

కళ్ళు ఎర్రగా .. నన్నే సూటిగా చూస్తూ.. 

నిన్ను కూడా క్షమించను..

క్షమించను..

నీకు శిక్ష తప్పదు..

ఎవ్వరిని వదలను.. 

***$$$***

నాపేరు శ్రీను. 

నేను, శేఖరం, శ్రీవల్లీ ముగ్గురం ఒకే క్లాస్ చదివే వాళ్ళం. 

వీళ్లిద్దరి చావుకు నేనేనా కారణం?

 నేను చేసన చిన్న పని ఇంత ఉపద్రవాన్ని తెచ్చిందా?

ఏదో తెలిసి తెలియని తనం తో వాళ్ళిద్దరి పేర్లు గోడమీద రాస్తే.

అది నిజం అనుకుని శ్రీవల్లీ వాళ్ళ నాన్న ఈ హత్యలు చేయించాడా?

 ఇప్పుడు శ్రీవల్లీ నామీద పగ బట్టి నన్ను చంపడానికి నా సైకిల్ పై మా ఇంటికే వచ్చిందా?

నన్ను ఎలా చంపుతుంది?

ఆ ఒరిస్సా వాళ్ళని ఎంత దారుణంగా చంపిందో నా కళ్ళారా నేను చూశాను కదా?

అయినా ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది?

అన్నీ ప్రశ్నలే?

సమాధానం ఎలా.. ఎవర్ని అడగాలి..

శ్రీవల్లినే అడగాలా?

అడిగితే చెపుతుందా ?

చంపే ముందైనా చెపుతుందా? 

(సమాధానం మీకు తెలుసా? చూద్దాం శ్రీవల్లీ ఏం చెపుతుందో )


Rate this content
Log in

Similar telugu story from Horror