వంక మామిడి చెట్టు–2
వంక మామిడి చెట్టు–2
రెండో అధ్యాయం (నేను రక్తం త్రాగే పిశాచాన్నా???)
వంక మామిడి చెట్టు..
అవును ఇప్పుడు ఈ చెట్టే నా పెర్మనెంట్ అడ్రెస్స్ అయిపోయింది.
చాలా ఏళ్లుగా నేను ఈ చెట్టుని పట్టుకునే ఉంటున్నాను.
ఏ జన్మలో చేసిన పాపమో గానీ నాకు ముక్తి దొరకక ఒక భయంకర పిశాచాన్నై ఈ చెట్టు కొమ్మల్లో ..
ఎప్పుడు ఎవరు దొరుకుతారా?
ఎవరిని భయపెట్టి ఆనందం పొందుదామా ?
ఎవరిని బలి తీసుకుందామా?
ఎవరి రక్తం త్రాగుదామా?
ఇదే ధ్యాస.
కుటుంబాలు బాధతో విలవిల లాడిపోతుంటే అదేంటో నాకు చెప్పలేని ఆనందాన్ని తృప్తిని కలుగజేస్తుంది.
ఎందుకలా మారిపోయానో కదా...
దానికి కారణం వీళ్ళ దుర్మార్గం కదూ....
నా అందమైన పేరు, రూపం, మనస్సు, ప్రేమ, అన్నీ పోయాయి.
బలవంతపు చావు ఇలా మనిషిని పిశాచిగా చేస్తుందా? అదీ ఇంత భయంకరంగా???
శ్రీవల్లి, నా పేరంటే నాకు ఎంతో ఇష్టం.
నాపేరు తగ్గ రూపం అని అందరూ ఎంతో మెచ్చుకునే వారు.
నా అందానికి తగ్గట్టు ఇంట్లో వారు నాకు చిన్నప్పటి నుండే వీణ కూడా నేర్పించడం ప్రారంభించారు.
మా అమ్మా నాన్నలకి నేనంటే అమితమైన ప్రేమ.
నాన్నగారికైతే మరీను.
మా నాన్నమ్మ చనిపోయిన తరువాత పుట్టానట, ఎప్పుడూ అమ్మా, అమ్మలు అనే పిలుస్తుండేవారు.
అంత ముద్దుగా, అందంగా, ఆనందంగా ఉన్న నాజీవితం ఒక పెద్ద మలుపు తిరిగే రోజు అదనీ నాకు తెలియదు.
టెన్త్ హాఫ్ యర్లీ పరీక్షల ముందు జాయిన్ అయ్యాడు. క్లాస్ లోకి న్యూ జాయినింగ్ అని సోషల్ మాస్టారు పరిచయం చేస్తున్నప్పుడు చెప్పాడు, పేరు చంద్ర శేఖర్ అజాద్ అని.
అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారో కదా అని మాలో మేం గుసగుస లాడుకుంటుంటే, అదే మా సోషల్ సార్ కూడా నీకు ఒకపేరు చాలదా రా, మూడు పేర్లు కలిపి పెట్టారు అంటే అందరం పెద్దగా నవ్వాం.
చూడాలి పాపం ఆ అబ్బాయి మొహం సిగ్గుతో సూర్యకాంతికి నల్లబడిన చంద్రబింబంలా తయారయింది. కొంచెం చామన ఛాయ, నలుపే అనొచ్చు.
ఒక వారం సరికి అందరికీ అర్థం అయింది. అబ్బాయి చాలా తెలివైన వాడని. బయటకి కనబడినంత లో ప్రొఫైల్ కాదని.
మాస్టర్లు ఏమడిగినా ఠక్కున చెప్పేవాడు. లెక్కల్లోనైతే అబ్బో రామానుజనుడే. నోట్స్ కూడా చాలా చక్కగా రాసేవాడు.
నేను ఒక పదిహెను రోజులు స్కూల్ కి నామం పెట్టవలసి వచ్చింది. నాకే ఫంక్షన్ జరిగింది.
ఫంక్షన్ ఒక పెళ్లి కన్నా ఎక్కువ హడావిడిగా, ఘనంగా జరిపించారు. బంధువులు అప్పుడే నాన్నతో సంబంధాల గురించి మాట్లాడుతుంటే, మా నాన్నగారు మా ఆస్తి అంతస్తుకు తగిన సంబంధం చూద్దామం అన్నారు.
పదిహేను రోజుల హడావిడి తరువాత స్కూల్ కి వస్తె సిలబస్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది.
మళ్ళీ రివిజన్ చెయ్యాలని మ్యాథ్స్ అయితే ఇంకా ఫాస్ట్ గా చెప్పేశారు. అదీ అలజేబ్ర .. అది వింటేనే మాకు ఆరోజుల్లో ‘గుండె గాబరా’ అనే వాళ్ళాము.
శేఖర్... నీ మ్యాథ్స్ నోట్స్ ఒకసారి ఇస్తావా?
నేను సడన్ గా అలా అడిగే సరికి, బహుశా నేను మాట్లాడతానని ఊహించి వుండడు, ఒక్కసారి బిత్తర పోయాడు.
ఆ మొహం చూస్తే నాకైతే నవ్వాగలేదు.
ఓయ్ అబ్బాయ్, ఏంటి అలా చూస్తున్నావ్?
నీకు వినిపిస్తుంది కదా...
అని చూపుడు వేలు చెవి దగ్గర పెట్టుకుని వస్తున్న నవ్వు బలవంతంగా ఆపుకుంటూ అడిగా...
నోట మాటలేదు, సైలంట్ గా బ్యాగ్ లోనుండి తీసి ఇచ్చాడు. వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఒకటే పరుగు. పాపం అనిపించింది, అలానే పెదాలపై చిన్న చిరునవ్వు కూడా. ఈ అబ్బాయి పట్ల ఏమైనా ఆకర్షణకు లోనవుతున్నానా అనే అనుమానం కూడా అప్పుడే ప్రారంభం అయింది.
శేఖర్ పరుగు చూసి నాకు నవ్వొచ్చినా, ఆ నోట్స్ చూసి మాత్రం ఆశ్చర్యమేసింది.
అక్షరాలు అంత నీట్ గా లేకపోయినా పక్కనే వేసిన డయాగ్రమ్స్, ఫార్ములాల పట్టికలు చాలా నీట్‌గా, అర్థమయ్యేలా ఉన్నాయి. ఫార్ములా డెరైవ్ చెయ్యడం చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్, నిజంగానే అతను లెక్కల్లో రామానుజుడే.
తరువాతి రోజు నేను నోట్స్ తిరిగి ఇచ్చేటప్పుడు, "థాంక్స్ శేఖర్. నీ నోట్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు చాలా నీట్‌గా కాకపోయినా బ్రహ్మాండం గా రాసావు, చాలా చక్కగా అర్థం అవుతుంది. మన లెక్కల మాస్టరు చెప్పిన దానికన్నా నీ నోట్స్ చదివితేనే బాగా వస్తున్నాయి " అని కొంచెం గట్టిగా చెప్పాను.
ఎందుకో , అందరికీ వినపడేలా చెప్పాలనిపించింది. బహుశా నా వెనుకబడి నన్ను ఇంప్రెస్స్ చేయాలనుకునే వాళ్లకి వినబడాలనేమో?
ఎప్పటిలానే కళ్ళు పైకెత్తకుండా, నోట్స్ తీసుకుని, మెల్లగా "పరవాలేదు శ్రీవల్లి" అన్నాడు.
అబ్బా... మొదటిసారి తను నా పేరు పలకడం. తాను నోటివెంట విన్న నాకు, ఎందుకో నా పేరే నాకు చాలా అందంగా అనిపించింది.
అది మొదలు మా స్నేహం పెరగడం ప్రారంభం అయింది.
రివిజన్ టైంలో, మాస్టర్లు చెప్పే ప్రతి విషయం తరువాత, మా ఇద్దరి మధ్య చిన్న చర్చలు జరిగేవి. ముఖ్యంగా, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ (చరిత్ర) గురించి.
ఎంత కష్టం అనిపించే లెక్క అయినా సునాయాసంగా సాల్వ్ చేసే వాడు. తన పేరు అజాద్ ఎలా వచ్చిందో చెప్పే వాడు, చరిత్ర అంటే చాలా ఇష్టం.
భారతదేశ స్వాతంత్ర్యం, వీరుల గురించి అతను చెప్పేటప్పుడు, అతని కళ్ళు మెరుస్తుండేవి.
నేను వీణ వాయించేటప్పుడు కలిగే ఆనందం, అతనికి చరిత్ర చెప్పేటప్పుడు కలుగుతుందని నాకు అనిపించేది.
ఒకరోజు, గ్రౌండ్‌లో క్లాస్ అయిపోయిన తరువాత, నేను మెల్లగా అడిగా, "శేఖర్, నువ్వు అంత చక్కగా నోట్స్ ఎలా రాయగలుగుతున్నావు?"
అతను కొంచెం నవ్వి, "చాలా సింపుల్, నువ్వు వీణ వాయించేటప్పుడు ప్రతి స్వరానికీ ఎంత విలువ ఇస్తావో, నేను ప్రతి పదానికీ, అక్షరానికీ అంత విలువ ఇస్తాను. అప్పుడు నోట్స్ అందంగా ఉంటుంది" అని చెప్పాడు.
ఆ పోలిక నన్ను అప్పటికప్పుడు కట్టిపడేసింది.
అదొక అద్భుతమైన స్నేహంగా అనిపించేది.
క్రమంగా, మేము ఇద్దరం తోటి విద్యార్థులం అనే స్టేజ్ దాటి, మంచి స్నేహితులం అయ్యాం.
మా స్కూల్ లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా నా వీణ ప్రోగ్రామ్ అవుతుండేవి. తన మొహంలో అప్పుడు కనిపించే తృప్తి, సంతోషం నాకు ఇంకొక కొత్త శక్తిని ఇచ్చేది.
మా స్నేహంలో ఎప్పుడూ ఒక నిర్మలమైన ఆకర్షణ ఉండేది అనుకునేవాళ్లం.
కానీ అది స్నేహం సరిహద్దులను దాటుతుందని మా కన్నా ముందు మా క్లాస్మేట్ లకే తెలిసినట్టుంది.
వెనుక నుండి సెటైర్లు వెయ్యడం, బాత్రూమ్ లలో మా పేర్లు వ్రాయడం నుండి బ్లాక్ బోర్డ్ లపైకి చేరుకుంది. ఆరోజు చాలా బాధ, ఉక్రోషం కలిగాయి. ఉదయం స్కూల్ కి వచ్చే సరికి నాపేరు శేఖరం పేరు ఎవరో బ్లాక్ బోర్డు పై రాశారు. S+S=S అని ఏంటో దానర్ధం మరి.
అందరూ మమ్మల్ని ఏదో తప్పు చేసిన వాళ్ళ మాదిరి చూడడం నాకైతే సుతారాము నచ్చలేదు. మరి శేఖర్ పరిస్థితి ఎలా వుందో?
నావైపు కన్నెత్తి చూడడం లేదు.
నాకైతే పదే పదే ఒకరినొకరు చూడాలనిపించడం, ఎప్పుడూ ఒకరి పక్కన కూర్చోవాలనిపించడం, కొంచెం దూరంగా ఉంటే ఏదో తెలియని లోటుగా అనిపించడం...
ఈ అనుభూతులన్నీ, అద్భుతమైన స్నేహం నుంచి అందమైన ప్రేమ వైపు మాకు తెలియకుండానే మమ్మల్ని నడిపించాయేమో , మాకు తెలియకుండానే, మా హృదయాలు ఒక లయలో స్పందించడం మొదలుపెట్టాయి అనుకుంటా. ఏదీ తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి అది.
నాకు ఎప్పటినుండో సైకిల్ త్రొక్కాలని కోరిక బలంగా ఉండేది. అమ్మని అడిగితే పెద్దమనిషైన పిల్లలు ఎక్కడైనా సైకిల్ నేర్చుకుంటారా అని నామాట కొట్టిపడేసేది.
శేఖర్ నిన్నో మాట అడగనా? ఏం అనుకోవు కదా...
కొంచెం సిగ్గు పడుతూ అడిగే సరికి గురుడు ఓక్కసారి ఖంగు తిన్నాడు.
నేను నవ్వాపుకుంటూ.. నాకు సైకిల్ నేర్పించ కూడదూ ?
ఓస్... సైకిలేనా?
మరి ఇంకేమనుకున్నావ్?
ఏం లేదులే పద...
అని సైకిల్ మెల్లగా ఎక్కడం, త్రొక్కడం ఒక వారంలో కొంచెం బాగానే నేర్పించాడు.
అయితే శేఖర్ సైకిల్ వెనుక క్యారేజ్ పై శేఖర్ణి మెల్లగా ఆనుకుని కూర్చొని మా స్కూల్ గ్రౌండ్ లో తిరగడం నాకు చాలా ఇష్టం.
ఏంటి శేఖర్ నేను వెనుక కూర్చుంటే నీ చేతులు హాండిల్ బార్ పై వణుకుతాయి? ఎందుకు?
అని నేను నవ్వుతూ శేఖర్ణి ఆటపట్టిస్తుండేదాన్ని.
శేఖర్ కూడా చాలా బిడియంగా నవ్వేవాడు గాని ఏమి సమాధానం చెప్పేవాడు కాదు.
అలా మా మధ్య ఇది అని చెప్పలేని ఏదో జరుగుతుండేది.
అప్పుడప్పుడూ కొంచెం పొయిటిక్ గా కూడా మాట్లాడేవాడు.
నిన్ననేమన్నాడూ....
నా పట్టీలు, ముంగురులు రెండు ఒకేలా కనిపిస్తాయట.
పట్టీలకి మాటలొచ్చుట, ముంగురులకి మాటలు రావట.
ఎంత బాగా చెప్పాడు. బహుశా కవి అయిపోదామని అనుకుంటున్నాడు కాబోలు.
నేను అదే శ్రీనివాస రామానుజన్ గారు కాళిదాసు అవుతున్నారే అంటే,
చిన్నగా నవ్వి, అబ్బో ఎంత సిగ్గో...
క్లాస్ పుస్తకాల్లో ఉన్న శకుంతల క్లాస్ రూంలోకి వస్తె కవిత్వం రాదా మరి!!!
బిడియంగా అంటూ ఉంటే చూడాలి అబ్బాయిగారి ముఖం... నల్ల కలువలా...
శేఖరం ఎప్పుడు తన ప్రేమను డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ అమ్మాయిలకి వెంటనే అర్ధం అయిపోతుంది.
నేను క్లాసులోకి వస్తున్నప్పుడు శేఖర్ నావైపు చూసే చూపుల బట్టే ఎవరైనా చెప్పొచ్చు నేనంటే ఎంత ఇష్టమో....
నా వెనుక బెంచీల్లో కుర్చీని ఎప్పుడూ నన్నే తదేకంగా చూస్తుండేవాడు...
ఆ చూపులు నా వీపుపై మల్లెలతో కొట్టినట్లు చురుక్కు మని గుచ్చుకునేవి.
నేను వెనక్కి తిరిగి చూడగానే ఠక్కున చూపులు తిప్పుకునే వాడు.
నోట్స్ ఇస్తున్నప్పుడు చెయ్యి సన్నగా వణకడం నాకు స్పష్టంగా తెలుస్తుంది.
నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను శ్రీవల్లి అని పిలిస్తే నాకన్న ముందు ఠక్కున అటు చూడడం నేను చాలా సార్లు గమనించాను.
ఇలా మామధ్య దాగుడు మూతలు జరుగుతుందేవి.
నా ఫ్రెండ్స్ శేఖర్ వస్తుంటే కళ్ళ తోనే నన్ను ఆట పట్టిస్తుండే వారు. మేము సరదాగా నవ్వుకునే వాళ్ళము.
అయితే ఈ విషయాలు మెల్లగా స్కూల్ నుండి వీధికి,
వీధి నుండి బంధువులకు,
బంధువులనుండి మా ఇంట్లోకి చేరడం ప్రారంభమైంది.
అమ్మ మందలింపులతో ప్రారంభమైన హెచ్చరికలు నాన్నగారి బెదిరింపుల వరకు చేరుకుంది.
పరీక్షలు అయిపోయిన వెంటనే పెళ్లి చేసేయాలని మా ఇంట్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు.
అయితే నాకు ఇంకా బాగా చదువుకొని, వీణ లో ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలని చాలా కోరికగా ఉండేది.
నిజానికి మా మధ్యన జరుగుతున్నది ప్రేమ అనికూడా ఖచ్చితంగా చెప్పలేను.
అయితే మా మధ్య ఏదో ఉందనే ఈ అనుమానపు కుదుపు, నా జీవితంలో చాలా క్రూరమైన మలుపు తిరుగుతుందని నాకు అప్పుడు తెలియదు.
ఇప్పుడెందుకండి కొత్త పనివాళ్లని తీసుకొచ్చారు. మన తోటలో అంత అవసరం ఏమొచ్చింది?
అది కూడా ఎక్కడా దొరకనట్లు అదెక్కడో ఒరిస్సా నుండి "రంపా కోడు బండ" వాడికి వాడి ఊరు పేరుకూడా పలకడం రావడం లేదు, అక్కడ నుండి రప్పించారు
అని అమ్మ అడుగుతుంటే చూసా... నలుగురు.. కష్టపడి పనిచేసే మొహాల్లా లేవు.
అందరి నోట్లో ఏదో నములుతున్నారు ... కారా కిళ్లీ లేదా ఖైనీ అనుకుంటా నములుతున్నారు.
నాకెందుకో పనివాళ్ళ లా అనిపించడం లేదు. ఎవరిమోహం లో మాపై గౌరవం కానీ భయం కానీ అస్సలు కనిపించడం లేదు.
నేను అంతగా పట్టించుకోక పోవడం నేను చేసిన ఘోరమైన తప్పని తర్వాత తెలిసింది. అదే ఆ నిర్లక్ష్యం నన్ను ఇలా రక్తపిశాచిగా మారుస్తుంది తెలిస్తే అప్పుడే ఇంకొంచెం లోతుగా పరిశీలించే దాన్ని.
అప్పటికే మొత్తం నాశనం అయిపోయింది.
పట్టించుకుంటే బాగున్నేమో?
మా కుటుంబమ్ సర్వనాశనం అయ్యుండేది కాదు.
నా పరిస్థితి ఇలా అయ్యిండేది కాదు.
క్రూరంగా అందరినీ భయపెడుతూ, హింసిస్తూ, రక్తం కళ్ళ జుస్తూ, రక్తం త్రాగే పిశాచి అని అందరితోటి భయంతో అసహ్యించుకునే దౌర్భాగ్యం నాకు పట్టేది కాదేమో?
రాత్రి పడుకునే ముందు బాత్రూమ్ కి పోయి వస్తున్నప్పుడు ప్రక్క రూం నుండి నాన్నగారు, మామయ్య, మావూరిలో చాలా దుర్మార్గుడు రౌడీ అని అందరూ చెప్పుకునే జగ్గా రావు కూడా వుండడం నాకెందుకో అక్కడి వాళ్ళ మీటింగ్ చాలా అసహజంగా, భయంకరంగా అనిపించింది.
ఏదో జరగబోతోంది అని నా అంతరాత్మ హెచ్చరిస్తుంది.
ముగ్గురు మెల్లగా గుసగుసగా ఏదో మాట్లాడు కుంటున్నారు. వాడని ఎలాగైనా “చంపాలి” అని వినిపించగానే నా చెవులు ఒక్కసారిగా రిక్కించుకుని వినడం ప్రారంభించాను.
ఒరేయ్ జగ్గు పని పక్కగా జరుగుతుందంటావా?
మానాళ్లు వాడని వేసేస్తారు కదా.....
మా కుటుంబం పేరు బయటికి రాదు కదా.
మా కుటుంబ గౌరవం రోడ్డు కెక్కదు కదా.. మా నాన్న గొంతులో ఆదుర్దా...
మీరూరుకోండి పంతులు గారు. మీలాంటోలు ఇలాంటి ఘోరాలు ఎన్ని చేసిన, చేయించారని చెప్పినా ఎవరు నమ్ముతారు చెప్పండి.
అయినా ఎవరికి అనుమానం రాకూడదనే కదా బయట నుండి తెప్పించా. మూడో కంటికి తెలియకుండా వాడ్ని ఫినిష్ చేసేస్తారు.
వారం తిరక్కుండా మీరు ఈ మీ మేనల్లుడిక్కిచి పెళ్లి చేసేయొచ్చు.
ఈ పాటికి వాడిని వేసేసుంటారా?
నాకు ఒక్క సారి కాళ్ళ కింద భూమి కంపించి నట్లయింది.
వంట్లో వణుకు ప్రారంభం అయింది. కాళ్ళు చేతులు వణుకు, గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. కళ్ళ నుండి నీళ్లు జారడం ప్రారంభ అయింది.
ఏం చేయాలి, శేఖర్ని ఎలా హెచ్చరించాలి.
ఎలా??? ఎలా ???
మెల్లగా శబ్దం రాకుండా బయటపడి ఒక్క ఉదుటున పరిగెత్తడం ప్రారంభించాను. కాళ్ళకి చెప్పులు వేసుకోవాలని స్పృహ కూడా లేదు.
చీకట్లో పరుగెడుతున్నా..
ఎలాగైనా శేఖర్ని కాపాడాలి. నావలన ఒక నిండు ప్రాణం పోవడం ఎంత దారుణం.
ఇలా మర్డర్ లు చేయడం, చేయించడం సినిమాల్లోనే గాని, నిజ జీవితంలో జరుగుతాయని కలలో కూడా ఊహించని దాన్ని.
అలాంటిది మా ఇంట్లోనే, అదీ నేను ఎంతగానో ప్రేమించే మా నాన్నగారు చేయిస్తుండడం...
అయ్యో దేవుడా...
శేఖర్ని రక్షించూ....
పరుగెడుతున్నా....
పొలాలకి అడ్డంబడి...
అరికాళ్ళు అడ్డదిడ్డంగా రాళ్ళ పై పడి రక్తం చిమ్ముతున్నాయి.
అయినా పట్టించుకునే టైమ్ లేదు. పాదాల నొప్పిని శరీరం గుర్తించే స్థితిలో లేదు.
ఏంటమ్మా ఇంత రాత్రప్పుడు...
ఎవరు నువ్వు...
ఏం లేదండి..
నాపేరు శ్రీవల్లి..
నేను శేఖర్ ఒకే క్లాస్.
మీ అబ్బాయి శేఖర్ ఎక్కడా?
ఇప్పుడే అరగంట క్రితం శ్రీను తో కలసి అలా మీ స్కూల్ వెనుకకి వెళ్ళి వస్తామని వెళ్ళారూ.
ఏమైంది తల్లి ఎందుకు అంత గాభరా పడుతున్నావ్?
ఆ ఏడుపెంటి, కాళ్ళకి ఆ రక్తం ఏంటి?
ఏమైంది చెప్పమ్మా....
మొత్తం రెండు ముక్కల్లో చెప్పా...
పద నేను వస్త అని చాలా గాభరాతో నాతో బయలు దేరారు..
ఇద్దరం పరిగెత్తడం ప్రారంభించాం.
సీను ఎదురొచ్చాడు.
ఒరేయ్ శేఖరం ఎక్కడరా?
పెద్దాయన ఆయాసంతో వగరుస్తూ అడిగారు.
బాబాయ్ అక్కడే మామిడి చెట్టు కింద ఆగాడు.
ముగ్గురం పరుగు....
ఎలా అయినా...
శేఖరాన్ని కాపాడుకోవాలి.....
ముగ్గురం మామిడి చెట్టు దగ్గరకి చేరుకునేందరికి అక్కడ పరిస్థితి హృదయ విదారకం గా ఉంది.
నలుగురు శేఖరాన్ని చుట్టుముట్టి విపరీతంగా కొట్టినట్లున్నారు. వంటి నిండా గాయాలు, రక్తం తో పడి వున్నాడు. కాళ్ళు చేతులతో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు.
ఎవరు మీరు నన్నెందుకు ఇలా కొడుతున్నారు అని అడుగుతూనే ఉన్నాడు పాపం శేఖర్.
ఇంతలో నాన్న మామయ్య జగ్గారావు అక్కడికి వచ్చారు.
నేను ఆపమని మానాన్న కాళ్ళ వెళ్ళా పడుతున్నా...
అయినా అలా చూస్తున్నాడు గాని ఆపమని చెప్పడం లేదు....
నీకు మా ఇంటి పిల్లే కావలసి వచ్చిందిరా కులం తక్కువ వెధవా...అని ఖండ్రించి ఉసాడు గాని ఆపమని చెప్ప లేదు.
“ఏహి పర్యంత దేఖుచ్ఛంతి కాహింకి? కౌణసి ముహూరత్ అచ్చికి?
అని జగ్గారావు అరిచేసరికి,
వాళ్లలో ఒకడు వెనుక నుండి కత్తి బయటకి తీశాడు.
ఇద్దరు శేఖరం రెండు చేతులు, మిగిలిన వాడు శేఖరం కాళ్ళు కదలకుండా పట్టుకున్నారు.
అందరం వద్దని వదిలేయమని ఎంత బ్రతిమాలుతున్నా కత్తితో వాడు నిదానంగా, క్రూరంగా, ఏమాత్రం ముఖంలో పాపభీతి లేకుండా, శేఖరం పీకని అందరం చూస్తుండగానే కోసి పడేసాడు.
రక్తం చివ్వున బయటకి చిమ్మి శేఖరం గిలగిల కొట్టుకుంటున్నాడు.
అయ్యో శేఖర్,
అయ్యో...
ఎంత ఘోరం జరిగిపోతుంది....
నాన్న ఎందుకు నాన్నా ఇలా చేసావ్.
అసలు మేం ప్రేమించుకున్నామని మాకైనా పూర్తిగా అర్ధం అవలేదు.
నువ్వెలా అపార్థం చేసుకున్నావ్.
ఎక్కడో స్కూల్ గోడలమీదో, బంధువుల నాలుకలమీదో ఉన్నంత మాత్రానా నమ్మేయడమేనా...
అడిగి నిర్ధారించు కోవాలి కదా...
అయినా ప్రేమించినంత మాత్రానా ఇలా...
ఇంత క్రూరంగా...
ఇంత నిర్దాక్షణ్యంగా చంపేయడమేనా...
శేఖర్ రక్తం నేలపై వరదలుగా పారి మట్టిలో ఇంకిపోతోంది.
నాన్న, మామయ్య మొహాల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు.
ఆ క్షణంలో, ఈ ప్రపంచంలో స్నేహం, ప్రేమ కంటే పరువే గొప్పదైతే, ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో నేను ఉండాల్సిన అవసరం లేదు.
నేనే శేఖర్ చావుకి కారణమైతే,
నా చావే శేఖర్ చావుకు సమాధానం అవ్వాలి.
మన పిల్లల కోసం ఇతరుల పిల్లల్ని చంపేసినా ఫర్వాలేదనుకునే వీళ్ల పైశాచిక మనస్సులకి నా చావే అంతిమ శిక్ష కావాలి" -
మీ అందరికి బుద్ధి రావాలంటే ఒకే ఒక శిక్ష...
అవును అదే సరైంది...
వెంటనే ఆ కత్తి అమాంతం చెత్తబుచ్చుకున్నా....
నాన్న ఒక్కసారి గతుక్కు మన్నారు.. ఇది ఏమాత్రం ఊహించి వుండరు. అమ్మా శ్రీవల్లీ వద్దు తల్లి. కత్తి కింద పడేయ్
నేను తల అడ్డంగా ఊపుతూ.. మానాన్న ముఖం లోకి చూస్తూ ..
ఒక్కసారి నా గొంతు నేనే కసుక్కున కోసుకున్నా....
రక్తం ...
వొళ్ళంతా రక్తం...
చుట్టు రక్తం...
నా రక్తం...
నా శేఖర్ రక్తం...
అవును నా శేఖర్ రక్తం..
నేను ప్రేమించవలసిన నా శేఖర్ రక్తం...
ఒక్కసారిగా ముందుకు తూలి, పడిపోయాను.
ఒక్కసారి కళ్ళ ముందు పెద్ద మెరుపు. అంతా చీకటి వెంటనే పెద్ద వెలుతురు..
బహుశా ప్రాణం పోతున్నప్పుడు ఇలానే వుంటుందేమో?
ఒక్క క్షణం లో ....
నేను చెట్టుపై కూర్చొని చూస్తున్నా...
క్రింద రక్తపు మడుగుల్లో రెండు శవాలు.
నాన్న ఒక ప్రక్క, నన్ను వొళ్ళో పెట్టుకుని,
శేఖర్ వాళ్ళ నాన్న ఒక ప్రక్క,
శ్రీను ఒక ప్రక్క నిలబడి ఏడుస్తున్నారు.
నాన్న ఇది అసలు ఊహించినట్టు లేదు...
గట్టిగా అమ్మా... అమ్మలూ అని ఏడుస్తున్నారు....
నాకు నాన్నమీద అసహ్యం వేసింది.
ఇంకో ప్రక్క పొలం గట్టు మీద ఆ నలుగురు బీడీలు త్రాగుతూ మాట్లాడు కుంటున్నారు. బహుశా వాళ్ళు కూడా ఇది ఊహించి ఉండరు.
అలా నేను పిశాచంగా మారాను...
చుట్టు రక్తపు మాడుగుల మధ్య చావడం వల్లనేమో...
నన్ను అప్పుడు భయపెట్టిన రక్తం అంటే నాకు ఇప్పుడు చాలా ఇష్టం....
నా శేఖరాన్ని చంపిన ఆ నలుగురిని ఎంత క్రూరంగా చంపానో మీకు తెలుసా....
దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా...
అందులో ఒక్కడు కూడా నన్ను చంపొద్దు అని అడగలేదంటే నమ్మండి...
నన్ను త్వరగా చంపూ...
త్వరగా చంపూ...
అని అడుకున్నవాళ్లే....
అంత క్రూరంగా చంపాను...
**** $$$****
మూడో అధ్యాయం (చావు ఇంత భయంకరంగా వుంటుందా?)
మో నామ్ బిశ్ను నారాయణ సాహు. సమస్తే మోతే సాహు బోళి కుహంతి.
నా పేరు బిష్ణు నారాయణ సాహు. అందరు సాహు అంటారు.
మాది “రంపా కోడు బండ” అనే గ్రామం.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో వున్నా చాలా మారు మూల గ్రామం.
మాకు పనులు పెద్దగా చేతకావు. పొట్టపోసుకోవడానికి తెలిసిన పని ఒక్క చంపడం మాత్రమే,
డబ్బులిస్తే మనుషులని,
లేకపోతే అడవిలో జంతువులని.
మేం నలుగురం ఒక జట్టుగా కలసి చేసిన ఆఖరి హత్య అదే.
అదే మా ఆఖరి సుపరి అని తెలియక ఒప్పుకున్నాం.
ఒప్పుకున్న తరువాత మూడు సార్లు తప్పు చేశాం అనుకున్నాం.
మొదటి సారి ఆ అబ్బాయిని చూసినప్పుడు,
రెండో సారు మెడ కొస్తున్నప్పుడు,
చివరగా మూడోసారి ఆ అమ్మాయి దెయ్యమై మమ్మల్ని అంత్యంత కిరాతకంగా చంపుతున్నప్పుడు.
మేం అందరం ప్రాదేయపడింది వదిలేయమని కాదు..
దయచేసి త్వరగా చంపేయమని...
(ఇంకా వుంది.....మరణ యాతన)


