STORYMIRROR

Nagesh Pulletikurthi

Horror Fantasy Thriller

4  

Nagesh Pulletikurthi

Horror Fantasy Thriller

వంక మామిడి చెట్టు

వంక మామిడి చెట్టు

5 mins
115

మామిడి చెట్టు!

ఆ పేరు వింటేనే మాకు చిన్నప్పటి నుండి వెన్నులో వణుకు వచ్చేది.

అప్పట్లో దాని గురించి విన్న కధలు అలాంటివి.

మా వీధి కి అల్లంతదూరంలో వీధి మలుపు దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు గుబురుగా భయంకరంగా వుండేది. దానికి ఎప్పుడు కాయలు కాసినట్లు ఎవరు చూడలేదట.

చెట్టు నిటారుగా కాకుండా కొంచెం ఎడమ ప్రక్కకి వరిగినట్లు వుండేది. బహుశా అందుకే దానికి వంక మామిడి చెట్టు అని పేరు వచ్చినట్లుంది అని చిన్నప్పుడి అనుకునే వాళ్ళం.

 అది కారణం కాదని తరువాత తెలిసింది.

ఇప్పుడంటే ప్రత్యేక శ్మశానవాటికలు వున్నాయి గాని, మా చిన్నప్పుడు నదీ తీరంలోనే అంత్యక్రియలు అన్నీ కానిచ్చేసేవారు. ఈ వంక మామిడి చెట్టు దాటుకునే శ్మశానాలు వుండేవి. అందుకే ఈ చెట్టును కొంచెం భయం భయం గానే అందరు చూస్తుండేవారు.

ఎప్పుడో మేం చిన్నపుడు అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం, ఉరిపెద్ద ఇంటి ప్రేమ వ్యవహారంలో గొడవల్లో అమ్మాయి ఇంటి వాళ్లు ఆ అబ్బాయిని వెంటబెట్టి మరీ ఈ చెట్టుదగ్గరే కొట్టి చంపేశారట. ఇక్కడే పెట్రోలు పోసి తగుల బెట్టేసారట.

ఆ అమ్మాయి అందరికీ బుద్ధి చెప్పాలని ఇదే ప్రదేశంలో ఈ చెట్టుకే ఉరి వేసుకొని చనిపోయిందట. ఆ ఉరివేసుకున్న వైపు చెట్టు వరిగిందట..

ఆ వంపు వల్ల అప్పటి నుండి “వంకమామిడి చెట్టు” అంటున్నారట.

 అప్పటి నుండి దెయ్యమై ఈ చెట్టు మీదే వుంటుందని అంటుంటారు.

 రాత్రి ఒంటరిగా చెట్టు దాటుతుంటే కనిపించిందని చెప్పుకుంటుంటారు. వాళ్ళతోపాటు కొంత దూరం వస్తుందని కూడా అనుకుంటుంటారు.

 పగలు వరకు ఏ ఇబ్బంది వుండేదికాదు గాని, చీకటి పడేసరికి దాని చుట్టూ చాలా నిశ్శబ్ధంగా వుంది ఆ చీకట్లో ఈ చెట్టే పెద్ద భూతం లా కనిపించేది. రాత్రుళ్లు ఈ చెట్టును ఒంటరిగా దాటి వెళ్ళడానికి ఎవరు సాహసించేవారు కాదు.

 ముఖ్యంగా మాలాంటి యువకులు, పిల్లలు. ముసలివాళ్ళు పెద్దగా జడిసేవారు కారు.

 తాతా మీకు భయం వెయ్యదా ? అంటే అది మమ్మల్ని ఏమీ చేయదురా.. కుర్రాళ్ళు, మధ్య వయసు వాళ్ళనే వెంటాడుతుంది అని నవ్వేసాడు.

 అయితే మా ప్రాబ్లం అంతా మేం సెకండ్ షో సినెమా కి వెళ్ళి వచ్చినప్పుడే వుండేది. రాత్రి సుమారు పన్నెండు ఒంటిగంట అయ్యేది సినిమ వదిలేసరికి.

 అప్పుడు అందరం కలసి గుంపుగా, ఆ చెట్టు వైపు చూడకుండా దాన్ని దాటే వారం. ఎప్పుడైనా ఒక్కరమే దాటవలసి వస్తే ముందే ఆగిపోయి ఎవరైనా వచ్చి మాతో కలసినంతవరకు వెయిట్ చేసేవాళ్ళాము.

 అయితే ఒకసారి మేం అందరం సైకిళ్ల మీద రెండో ఆటకి వెళ్ళాము. నేను సైకిల్ స్టాండ్ నుండి తీయడం కొంచెం లేట్ అయింది.

 వచ్చి చూద్దును కదా అందరు వెళ్లిపోయారు. ఫర్వాలేదులే మెల్లగా జనంతో అందరితో కలసి వెళ్లిపోదాములే అనుకున్నా.

 కానీ నాతో వున్న జనం మెల్ల మెల్ల గా పల్చబడుతుంది. వారందరూ మెల్ల మెల్లగా తగ్గి పోతున్నారు. నాలో కొంచెం భయం స్టార్ట్ అయింది.

 ఫర్వాలేదులే ఈ పెద్దాయన అయినా వున్నాడు అనుకునే లోగా, ఆయన కూడా ఆగిపోయాడు. బహుశా వాళ్ళ ఇల్లు వచ్చిందనుకుంటాను.

 “చచ్చానరా బాబూ ” అనుకున్నా. ఎలా.. ఇప్పుడెలా ఈ గండం దాటాలి. మెల్ల మెల్లగా నాలో భయం ఆవహించడం మొదలైంది.

 అయినా నేను వస్తున్నానో లేదో అని కూడా చూడకుండా వీళ్లందరూ ఎందుకు వెళ్లిపోయారు. అందరం కలసి వచ్చినప్పుడు అందరం కలసి వెళ్ళాలి కదా. ఏం చేయాలి దేవుడా..

 ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ స్పీడ్ గా సైకిల్ త్రొక్కుకుంటూ వెళ్ళి పోదామా???

 అమ్మో వద్దు వద్దు. పట్టుకొని గొంతు నొక్కి చంపేయదూ.. గొంతు కొరికైనా చంపేస్తుంది.

 ఎలా తప్పించుకోవాలి ఈ గండం. అయినా ఇంట్లో చెప్తూనే వున్నారు వద్దని. ఆ వెళ్ళేదేదో మాటినీకో ఫస్ట్ షో కొ పోవచ్చు గదా. సెకండ్ షో కి ఎందుకు వెళ్ళాలి. పెద్దోళ్లు చెప్పిన మాట వినకపోతే ఇలాగే వుంటుంది మరి.

 ఇప్పుడు ఈ సినిమా నా చావుకు వచ్చింది.

 చావు మామూలుగా వస్తే ఫర్వాలేదు. కానీ దెయ్యం చేతిలో చావు చాలా భయంకరంగా వుంటుందేమో.

 మెడ విరిచేస్తుందో లేక గొంతు కొరకి రక్తం త్రాగుతుందో?

 భయం తో కాళ్ళు చేతులు వణకడం స్పస్టంగా తెలుస్తుంది. వీలైనత మెల్లగా పెడలింగ చేస్తున్నా.. ఎవరియినా రాక పోతారా అనే ఆశ తో. ఎవరూ రారే!

 అయినా చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు దెయ్యాలుగా మారుతారో కదా..

 కోరికలు తీరాకుండా చనిపోతే దెయ్యాలు అవుతారట.

 అలా అయితే చనిపోయిన అందరు దెయ్యాలవ్వాలి కదా.. ఎవరి కోర్కెలు మాత్రం పూర్తిగా తీరుతాయి. అది కాదనుకుంటాను.

 ద్వేషంతో పుట్టిన బలమైన కోర్కెలేమో?

 ఆ తెల్ల బట్టలు, విరబోసుకున్న జుత్తు, ఎర్రని కనుగుడ్లు, చిన్న కోరలు అమ్మో తలచుకుంటేనే చమటలు పడుతున్నాయి.

 దెయ్యాలు ఎందుకు అంత భయంకరముగా వుంటాయో కదా.

 ఇదంతా నా చావుకు వచ్చినట్లున్నాది. ఇంకా ఎవరు రారని నిశ్చయించుకున్నాక, నాకు నేనే తెగించి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ వంకమామిడి చెట్టుని దాటాలని ఒక నిర్ణయానికి వచ్చాను.

 ఇంక స్లో పె డలింగ్ మానేసి స్పీడ్ పెంచాను.

 శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. ప్రభ దివ్య కాయం.. భజే వాయు పుత్రం.. ఇలా చదువుకుంటూ చెట్టు దాటుతుంటే..

ఒక్కసారిగా శబ్ధం ..

 చెట్టుపైనుంది ఎవరో క్రిందకి దుమికినట్లు..

 గాజుల శబ్ధం కూడా అయినట్లుంది... భయపడినంతా జరిగినది..

 ఎందుకో సైకిల్ స్పీడ్ తగ్గింది.. బహుశా ఎదురుగాలి బలంగా వుండదమేమో?

 సైకిల్ త్రొక్కడం కష్టం గా మారుతుంది. పెడలింగ్ కష్టం అవుతుంది. బలంగా త్రొక్కడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా అవడం లేదు.

సైకిల్ బరువెక్కుతున్నట్లు అనిపిస్తుంది. కరెక్ట్ గా చెట్టు క్రాస్ చేసినప్పుడు ఒక్కసారిగా ఎవరో వెనుక సైకిల్ కారేజ్ మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది.

 వెనక్కి తిరిగి చూద్దాం అంటే.. భయం .. భయం.

 శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. ప్రభ దివ్య కాయం.. భజే వాయు పుత్రం..

 సైకిల్ బరువు ఏ మాత్రం తగ్గడం లేదు...

ముందుకు కదలడం చాలా కష్టం గా వుంది.

 ఎవరో వెనుక కదులుతున్నట్లు వుంది. వీపుకి చల్లగా తగులుతుంది. ఎవరో అమ్మాయి భుజం వీపుకి తగులుతున్నట్లు వుంది.
 నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఏదో దుర్వాసన కూడా వస్తున్నట్లు వుంది.

 సడన్ గా గాలి ఒక్కసారిగా ఆగిపోయింది.

 అప్పటివరకు జుత్తులు విరబోసుకున్నట్లున్న వూగుతున్న చెట్టు ఆకులు ఒక్కసారి ఆగిపోయాయి.

 వీధి లైట్ వెలుగుతూ ఆరుతుంది.

 చెట్టు దగ్గరనుండి ఏదో తెల్లగా.. ఎంత చూడకూడదనుకున్నా ఏదో కనబడింది. ..

గుండెలు అవిసిపోయే నిశ్శబ్దం.

అంత చలిలోనూ చమటలు పట్టడం మొదలెట్టింది. తలలోనుంది చమట ధారగా కారుతుంది. షర్ట్ తడిసిపోయి చాలా సేపు అయి వుంటాడి.

 అరిచేతులకు చమటలు పట్టి హ్యాండిల్ బార్ పట్టుకోవడానికి గ్రిప్ దొరకడం లేదు.

 లేని ధైర్యం తెచ్చుకొని దండకం చదువుతున్నాను.

 శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. ప్రభ దివ్య కాయం.. భజే వాయు పుత్రం..

నా వల్ల కావడం లేదు. చిన్నగా నవ్వు !

 ఎవరో ఖచ్చితంగా నా కారేజ్ మీద కూర్చున్నారు. సైకిల్ వెనుక చక్రం దగ్గర క్లచ్.. క్లచ్.. శబ్దం.. భయంకరంగా..

 నాకు స్పస్టంగా తెలుస్తుంది.

 అయిన తల తిప్పి చూడడానికి ధైర్యం చాలడం లేదు.

 ఇంతలో నా వీపు మీద ఒక చేయి మెడమీద ఒక చేయి పడినట్లయింది.

 ఆంజనేయ స్వామి దండకం చదవడం ఆగిపోయింది.

శ్రీ శ్రీ శ్రీ ఆ ఆ ..

నోట మత రావడంలేదు.

 అంతే ఒక్కసారి సైకిల్ పట్టుతప్పి పోయింది నేను ఎక్కడికో జారిపోయాను..

 కళ్ళు విప్పి చూడలేక పోతున్నాను. నా గొంతు ఎవరో పట్టుకున్నారు. గట్టిగా నొక్కుతున్నారు. భయంతో కళ్ళు, కాళ్ళు, చేతులు బిగుసుకుపోయాయి.

 గట్టిగా నొక్కి పట్టుకుంది దెయ్యం. గట్టిగా అరవాలనుకుంటున్నాను కానీ గొంతు రావడం లేదు.

 అమ్మా!!! అరవాలని నోరు తెరుస్తున్నా..

కానీ మాట భయంతో గొంతు బిగుసుకుపోయింది.

 దానికి తోడు ఈ దెయ్యం గొంతు బలంగా.. చాలా బలంగా నొక్కుతుంది నా గొంతు.

 రెయ్ ! లెగు లెగు ..

 తెలివి తెచ్చుకో.. లెగు ..

 ఏం కాలేదు..

అందరం ఇక్కడే వున్నాము..

 అంత భయం అయినవాడివి మేం వచ్చినంతవరకు ఆగాలి కదా..

 కళ్ళు విప్పి చూసేసరికి అందరు నా ముఖంలోకి ఆదుర్దాగా చూస్తున్నారు.

 ఇదిగో వీడి సైకిల్ స్టాండ్ లో లోపల ఎక్కడో వుండి తీయడానికి లేట్ అయ్యే సరికి మాకోసం చూడకుండా నువ్వు వచ్చేసావు. మేం వచ్చినంతవరకు ఆగాలి కదా.

 మరి దెయ్యం???

దెయ్యం ఏమి లేదులేరా బాబూ.. నువ్వు దెయ్యం దెయ్యం అనకు రా...

మెల్లగా అందరం ఇంటికి చేరం....

అందరు నిశ్శబ్ధంగా వున్నారు.

దెయ్యం లేదంటున్నారు గాని ఎవరి మాటలో కాన్ఫిడెన్స్ లేదు.

 అయితే రెయ్.. మరి నా సైకిల్ వెనుక ఎవరో కూర్చున్నారు. సైకిల్ బరువు అయింది కూడా..

 నీ సైకిల్ పంక్చర్ అయివుంటుంది లేరా.నువ్వు చూసుకోకుండా గాబరా పడ్డావు.. అందుకే నీకు బరువుగా అనిపించింది వుండవచ్చు.

మరి నావీపు మీద వేసిన చేయి ఎవరిది. నా మెడ నొక్కినది ఎవరు. అన్నీ అనుమాలే.

పరుగెత్తుకుని సైకిల్ దగ్గరకి వెళ్ళి చూశాను. ..

నేను అనుకున్నట్టే వుంది ..

సైకిల్ రెండు టైర్లు బాగున్నాయి.

ఏదో నిద్రలో వున్నమాదిరిగా నాదాచుకుంటూ ముఖ్యం కడుక్కోవడానికి బాత్రూమ్ కి వెళ్ళా, కడుక్కుంటూ అద్దంలో చూసుకున్నా..

ఇప్పుడు నా భయాన్ని నిజం చేస్తూ .. సన్నని వణుకు....

 అద్దంలో మెడ మీద నాలుగు సన్నని గోళ్ల గీతలు

వెనకాల ఎక్కడినుండో.. అదే సన్నని నవ్వు మళ్ళీ ... మళ్ళీ...

నా ప్రక్కన ఎవరో శ్వాస వదు లుతున్నట్లు.....

అద్దంలో నా ముఖ్యం ప్రక్కన మసక మసకగా..

 మళ్ళీ అదే నవ్వు.... కానీ ఈసారి నా వెనుక నుండి కాదు..

 నా మెడ మీదే ఎవరో ఊపిరి వదులుతున్నట్లు వెచ్చగా అనిపించింది.

 దెయ్యం నాతోపాటు నావెనుకే వచ్చిందా???

నా ప్రక్కనే వుందా???


Rate this content
Log in

Similar telugu story from Horror