STORYMIRROR

Nagesh Pulletikurthi

Horror Crime Thriller

3.4  

Nagesh Pulletikurthi

Horror Crime Thriller

వంక మామిడి చెట్టు – 3

వంక మామిడి చెట్టు – 3

7 mins
59

మూడో అధ్యాయం (చావు ఇంత భయంకరంగా వుంటుందా?)

మో నామ్ బిశ్ను నారాయణ సాహు. సమస్తే మోతే సాహు బోళి కుహంతి.

నా పేరు బిష్ణు నారాయణ సాహు.

అందరు సాహు అంటారు.

మాది “రంపా కోడు బండ” అనే గ్రామం.

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో వున్నా చాలా మారు మూల గ్రామం.

మాకు పనులు పెద్దగా చేతకావు. పొట్టపోసుకోవడానికి తెలిసిన పని ఒక్క చంపడం మాత్రమే, డబ్బులిస్తే మనుషులని, లేకపోతే అడవిలో జంతువులని.

మేం నలుగురం ఒక జట్టుగా కలసి చేసిన ఆఖరి హత్య అదే.

అదే మా ఆఖరి సుపారి అని తెలియక ఒప్పుకున్నాం.

ఒప్పుకున్న తరువాత మూడు సార్లు తప్పు చేశాం అనుకున్నాం.

మొదటి సారి ఆ అబ్బాయిని చూసినప్పుడు,
రెండో సారు మెడ కొస్తున్నప్పుడు, చివరగా మూడోసారి ఆ అమ్మాయి దెయ్యమై మమ్మల్ని అంత్యంత కిరాతకంగా చంపుతున్నప్పుడు.

 మేం అందరం ప్రాదేయపడింది వదిలేయమని కాదు.. దయచేసి త్వరగా చంపేయమని...

 నేను, హిడ్మ, మదీయా, సుక్కు మేం నలుగురం చిన్నప్పటి నుండి ఒక జట్టు గా పనికి వెళ్తుంటాం.

 పని అంటే పొలం పనులకో, చెట్లు నరకడానికో, కూలి పనులకో కాదు. ముందే చెప్పాగా డబ్బులిస్తే మనుషులని, లేకపోతే అడవిలో జంతువులని, అదీ మా జీవనాధారం.

 మొదట్లో దగ్గరలో వున్న అడవికి వెళ్ళి, పందులను, అప్పుడప్పుడు లేళ్లను వేటాడి అందరం పంచుకుని తినేవాళ్ళం.

మెల్ల మెల్ల గా అడవులు తగ్గుతూ ఇళ్ల సంఖ్య పెరిగి పోతుండడం తో జంతువుల వేట తగ్గిపోయింది.

మా ప్రాంతంలో సవర, కొంద, బొండా, గడబ, డోoగరియా, పరోజా ఇలా ఒక ఏడెనిమిది తెగలకు ఈ అడవి పందుల వేటే ప్రధాన జీవనాధారం.

 అడవి తెగల జీవితం అంటే… బయటి ప్రపంచం అంతా అనుకుంటున్నట్లు ప్రకృతి, ప్రేమ కాదు. అది రక్తంతో నిండి, ఆకలితో కూడి, ఎప్పుడూ మరణంతో మాట్లాడుతూ, బ్రతకడం కోసం నిత్య పోరాట జీవితం.

 దిన దిన గండం.. నూరేళ్ళు ఆయుష్ .. అంటే మా జీవితమే!

మాకు ఇక్కడ పంది వేటే ఆధారం ఒక్కో తెగకి ఒక్కో పేరుతో ఒక ప్రత్యేకమైన పంది వేట ఆచారం ఉంటుంది.

కొండలు “పొడి తుపాకి”తో కాలుస్తారు. బొండాలు బాణాలు ఇనుము మొనలతో.

పరోజాలు కుక్కలతో పరిగెత్తించి, చిన్న కత్తులతో పొడుస్తారు (మా వేట విధానం)

 ఇలా ఒకొక్క తెగకి ఒక్కొక్క విధానం వుంటుంది. ఏదైనా చివరాకరికి ఆకలి తీర్చుకోవడమే.

 ఒక పంది దొరికితే… ఆ రోజు పండగ. లేకపోతే రెండు రోజులు ఉపవాసం. మాంసం తినడం మా ఆచారం.

పంది మాంసం తినేముందు ఒక చిన్న పూజ. రక్తాన్ని నేలమీద పోసి “దేవుడు దయచేసాడు” అనుకుంటాం.

ఆడవాళ్ళు కూడా వేటకి వస్తారు. కానీ వాళ్ళు కత్తి పట్టరు… కుక్కల్ని నడపడం, పంది దారి చూడడం వాళ్ళ పని.

ఆకలి భయం కంటే ఘోరం.

ఒకసారి నాలుగైదు వారాలుగా వేట లేదు. ముగ్గురు పిల్లలు… తిండి లేదు ఆ రోజు నాకు జీవితంలో మొదటిసారి ఏడుపు ఆపుకోలేకపోయాను.

అడవి తగ్గాక… జీవితం మారిపోయింది. పోలీసులు “వేట నిషేధం” అని కేసులు పెట్టడం మొదలుపెట్టారు. అడవి కాంట్రాక్టర్లు చెట్లు నరికేసి డబ్బు చేసుకుని పోతున్నారు.

 నేను ముందు చెప్పినట్లు మేం పరోజాలం, ఎక్కువగా నలుగురం కలసి పందిని అలసిపోయినంతవరకు పరిగెత్తించి తరువాత చిన్న చిన్న కత్తులతో దాడి చేసేవాళ్ళాము.

వేట ని అలసిపోయేవారకు పరిగెత్తించి చంపడం మా ప్రత్యేకత.

తరువాత తరువాత మనుషులని కూడా అదే పద్ధతి లో చంపడం ప్రారంభించాం.

 మా తట్టుకోలేని ఆకలి మమ్మల్ని మెల్ల మెల్ల గా నేరాల వైపు త్రిప్పడం ప్రారంభించింది. ఆకలి అంత భయంకర మైనది మరి. తిండి కోసం ఎపనైనా చేయావలసి వస్తూంది.

అలా తప్పని పరిస్థితులతో పెళ్ళాం పిల్లల ఆకలి తీర్చడానికి హత్య కి ఒప్పుకోవడం జరిగింది .

ఆకలి తీర్చలేనప్పుడు… ఎవరో ఒకడు వచ్చి “ఒక్క మనిషి చంపితే వెయ్యి రూపాయలు” అంటే… ఆలోచించే శక్తి కూడా ఉండదు.

మొదట భయం ఉంటుంది. రెండోసారి సందేహం. మూడోసారి అలవాటు.

4000 ఇప్పించండి దొరా.. ఒకొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున..

అంత డబ్బు మీరెప్పుడైనా కళ్ల చూశారురా?

హత్య కదా సారూ..

అయితే మాత్రం.. అంత కాదు.

పోనీ మూడు వేలైనా????

చివరకి 1600 కి ఒప్పందం కుదిరింది.

ఒక ప్రాణం విలువ 1600 ???

అలా ప్రారంభమైన మా నేర జీవితం ఒక తప్పుడు నిర్ణయంతో ముగుస్తుందని, అదీ అంతా భయంకరంగా వుంటుందని ఏమాత్రం తెలిసినా, ఈ సుపారి కి ఒప్పుకునేవాళ్ళాము కాదు.

రేయ్! సాహు!

ఈ సార్ జగ్గా రావు రా..

మీతో పనిబడి వచ్చారు.

 చెప్పండి సారు.. ఎవరిని ఎయ్యాలి. ఎంత కూలి?

యాభై వేలు..

ఎందుకు? ఏమిటి? వివరాలు వద్దు..

అంతా పెద్ద మొత్తం వినేసరికి మేం మరేం అడగలేదు. అడిగుంటే బాగుండెదేమో?

అంత చిన్న కుర్రాడిని అంతమొందించడానికి ఒప్పుకునే వాళ్ళం కాదేమో?

బ్రతికి వుండే వాళ్ళ మేమో?

దూరం నుండి వేట ని చూసాము..

 అంత మొత్తం కళ్ళ చూసేసరికి పిల్లాడి వయసు గుర్తుకు రాలేదు.

మా పద్ధతిలో వాడ్ని ఆ చీకటిలో చుట్టుముట్టి, అలసిపోయినంతవరకు పరిగెత్తించి చంపే సమయానికి,

ఎక్కడినుండి వచ్చిందో ఆ అమ్మాయి వచ్చి మాకు అడ్డం బడడం ప్రారంభించింది.

ఇంతలో జగ్గా రావు చంపడానికి ముహూర్తం వుందిరా అని కేకలు వేసేసారికి మరేమీ ఆలోచించ కుండా..

ముగ్గురు కాళ్ళు చేతులు పట్టుకుంటే, నేను వాడి మెడని కసుక్కున కోసేశాను.

వాడు రక్తం మాడుగులో గిల గిలా కొట్టుకుంటుండగా..

ఇంతలో నేను ఊహించ నంత వేగంగా ఆ అమ్మాయి నా చేతిలో కత్తిని లాక్కొని వాళ్ళ నాన్న తో ఏదో చెప్తూ గొంతు కోసేసుకుంది.

ఇద్దరు చిన్న పిల్లలు మా చేతుల మీదుగా ..

ఇద్దరూ చనిపోయారు.

అంత నిశ్శబ్ధంలో వాళ్ళ వాళ్ళ ఏడుపులు ఎందుకో భయం కలిగించాయి.

అప్పటివరకు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వున్న వాతావరణం ఒక్క సారిగా ఒకటే ఎదురుగాలులు. మెరుపులు.

నాకెందుకో ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది.

వెన్నులోనుండి సన్నగా వణుకు వచ్చింది.

మిగతా ముగ్గురి పరిస్థితి కూడా అలానే వుంది.

ఎదురుగా మామిడి చెట్టు కొమ్మలు జుత్తు విరబోసుకున్న దెయ్యాలలా గాలికి విపరీతంగా ఊగుతున్నాయి.

ఒక్కసారిగా పెద్ద మెరుపు. భయంకరమైన నిశ్శబ్ధం. గాలి ఒక్కసారి ఆగిపోయింది.

చెట్టు కొమ్మ పై ఎవరో కూర్చున్నట్లు క్రిందకి పైకి ఊగుతుంది.

కీయ్.. ... కీయ్.. ... శబ్ధం

కీయ్... కీయ్... కీయ్...

ఆ శబ్దం మొదట గాలిలో సన్నగా ప్రారంభం అయింది. మెల్లగా పెరుగుతూ ఎవరో పిల్లలు ఊగుతున్నట్లు వేగంగా వూగుతుంది.

దానికి తోడు గజ్జెల చప్పుడు తో భయంకరంగా వుంది.

అలా మా చెవుల్లోకి నుండి మా గుండెల్లోకి దిగి వళ్ళు జలధరించింది.

నేను మెల్లిగా తల ఎత్తాను. మామిడి చెట్టు కొమ్మ మీద... ఎవరో కూర్చున్నారు.

చీకట్లో కళ్లు రెప్పలు లేకుండా తెల్లగా మెరిసిపోతున్నాయి.

జుత్తు గాలికి ఎగిరి ఎగిరి మొహం మీద పడుతుంది. మొహం స్పష్టంగా కనిపించడం లేదు.

హిడ్మ మొదట గట్టిగా అరిచాడు. “ఎవడ్రా అక్కడ?!”

అరుపులో భయం స్పష్టంగా తెలుస్తుంది.

ఆ ఆకారం కొమ్మ మీద నుంచి కిందికి దూకింది. ఘల్లు మనీ మువ్వల శబ్దం.

 నేల మీద అంతా ఎత్తునునది దుమికినా ఆ శరీరం నిటారుగా నిలబడింది.

అది... ఆ అమ్మాయి.

అవును ఆ అమ్మాయే..

ఇప్పుడే గొంతు కోసుకున్న అమ్మాయి.

మెడ మీద గాయం లేదు. రక్తం లేదు.

కానీ ఆమె నవ్వుతోంది.

పళ్లు తెల్లగా... చాలా పదునుగా...

నవ్వు, ఏడుపు కలగలిపిన నవ్వు. చాలా వికృతంగా వుంది.

సుక్కు వెనక్కి అడుగు వేశాడు. కాలు చిన్న రాయికి తగిలి వెల్లకిలా పడ్డాడు.

ఒక్కసారిగా ఆ అమ్మాయి చేయి సుక్కు కాలు పట్టుకుంది.

ఒక్క అడుగుకుడా ముందుకు కదలకుండా .. చేయి అంతా ముందుకు ఎలా వచ్చింది?

“అమ్మా...” అని సుక్కు మూలిగాడు. నొప్పిగా వుందా????

ఇప్పుడు గొంతు కోసిన గాయం నుంచి రక్తం ఇంకా కారుతోంది.

మదీయా కత్తి ఎత్తాడు. కానీ చేతులు వణుకుతున్నాయి. కత్తి కింద పడింది.

ఆ కత్తి నేల మీద పడగానే... ఆ అమ్మాయి అదే కత్తిని చేతిలోకి తీసుకుంది.

 ఒక చేతిలో సుక్కు కాలు.. ఇంకొక చేతిలో కత్తి..

ఇద్దరు ఒకేసారి దొరకికారనే ఆనందం.

 “మీరు నన్ను చంపారు కదా... ఇప్పుడు నా వంతు.”

ఆమె గొంతు... పిల్లల గొంతు లాగా ఉంది.

కానీ.. కానీ.. రంపంతో ఇనుప రాడ్డును కొస్తున్నట్లు..

 ప్రతి అక్షరం మా గుండెలలోనుండి వెన్నులోకి వస్తున్నట్లుంది.

హిడ్మ పరిగెత్తాడు. నేను కూడా.. మా వెనకాలే ఆ అమ్మాయి నడుస్తోంది.

నడుస్తుందా? లేదు... కాదు..

తేలుతోంది. పైకి లేచి కిందికి దిగుతోంది.

హిడ్మ అరవడం మొదలుపెట్టాడు. “సాహూ... రేయ్ సాహూ... ఇది ఏంట్రా...

నా కాళ్లు కదలడం లేదు!”

నేను తిరిగి చూశాను.

హిడ్మ కాళ్లు నేలలోకి కూరుకుపోయాయి. రక్తం లాగా ఏదో నల్లటి ద్రవం అతని కాళ్ల చుట్టూ పాకుతోంది. భరించలేని బాధతో హిడ్మ అరుస్తున్నాడు.

నన్ను వదులు, వదులు అని. ఆ నల్లటి ద్రవం అలా వంటి మీద నుండి, మెల్లగా, ఛాతిపైకి అలా నోరు, ముక్కు, కళ్ళు , చెవులు అంతా అలముకుంది.

 బాధతో భరించలేకపోతున్నాడులా వుంది. విల విల లాది పోతున్నాడు.

 అమ్మాయి అదే నవ్వు,, రంపంతో ఇనుప రాడ్డుని కొస్తున్నట్లు.

చాలు చాలు ఈ బాధ భరించలేక పోతున్నాను.. నన్ను చంపే ప్లీజ్ ప్లీజ్..... త్వరగా చంపేయి ..

 నవ్వు ఇప్పుడు ఆనందంగా మారినట్లు వుంది. తెరలు తెరలు గా నవ్వు.. ఇ హి హి హి .. చావు... చావు రా.. హిడ్మ గొంతు కసక్కున కోసి.. కాళ్లతో ఆ ద్రవలో అదిమిపెట్టి తోసేసింది.

ఒక్కసారిగా మొత్తం కూరుకుపోయాడు. మళ్ళీ నిశ్శబ్ధం.

 నేను, మదీయా, సుక్కు ముగ్గురం పరిగెడుతున్నాం. ఆయసంతో భయంతో వగరుస్తున్నాం.

 మా వెనకాలే ఆ అమ్మాయి నవ్వు, మా ముగ్గురి అరుపులు... అన్నీ కలిసి ఒకే శబ్దం అయ్యాయి.

అడవి మా చుట్టూ తిరిగింది. చెట్లు మా మీదకి వంగాయి. కొమ్మలు మా మెడలు చుట్టేసినట్టు అనిపించింది.

 సుక్కు ఒక్కసారిగా ఆగాడు. “సాహూ... నాకు ఆ అమ్మాయి కనిపిస్తోంది... నా ముందరే నిలబడి నవ్వుతోంది...”

నేను చూశాను. ఏమీ లేదు. కేవలం చీకటి మాత్రమే.

సుక్కు తన కత్తిని తన గొంతుకి ఆనించాడు. “ఇక చాలు... నేను ఇక్కడే చస్తాను...”

 “వద్దు సుక్కూ!” నేను అరిచాను. కానీ ఆలస్యం అయ్యింది. అతను గొంతు కోసుకున్నాడు. రక్తం చిమ్మింది.

కానీ అతను పడలేదు. నిలబడి... నవ్వాడు. అదే నవ్వు. ఆ అమ్మాయి నవ్వులా.. రంపంతో .........

మదీయా భయంతో పిచ్చివాడిలా అరవడం మొదలుపెట్టాడు. వద్దు వద్దు నన్ను చంపే ప్లీజ్ ప్లీజ్ చంపే..

 అదీ అలా రా దారికి.. అయితే చావు.. ఒక్కసారి గాల్లోకి లేచి అడ్డంగా పడిపోయాడు.. పొట్ట చీల్చబడి వుంది... నేలంతా రక్తం.. ప్రేగులు ..

 “ఇప్పుడు నాకు కూడా ఆ పిల్ల కనిపిస్తుంది ... నా చేతులు పట్టుకుని మరొక్కసారి చంపవా ప్లీజ్ ప్లీజ్ అంటుంది....”

శేఖర్ గొంతు కోసినట్లు నా గొంతు కూడా కసక్కున కొయ్యవా.. ప్లీజ్ ప్లీజ్.. నేను ఒంటరిగా మిగిలాను.

ఆ మావిడి చెట్టు ప్రతి కొమ్మలో ఆ అమ్మాయి కూర్చుని నన్ను చూస్తోంది. నేను పరిగెత్తాను.

కానీ ఎటు పరిగెత్తినా... ఆ మామిడి చెట్టు ముందరే వచ్చి నిలబడుతున్నాను.

ఆ చెట్టు కింద ఆ ఇద్దరు పిల్లల శవాలు లేవు. కేవలం ఒక్క కత్తి మాత్రమే వుంది.

నా కత్తి. రక్తంతో తడిసిన నా కత్తి. నేను దాన్ని ఎత్తాను. చేతులు వణుకుతున్నాయి. నాకు చావు తప్పదని తెలుస్తుంది.. కానీ దాని కన్నా ఈ భయం నన్ను ఎక్కువ చంపుతుంది.

త్వరగా చనిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది. ఎవరైనా బ్రతుకుదామనుకుంటారు నేనేంటి చచ్చిపోతే బాగున్నాను కుంటున్నాను. ఆ భయం అలాంటిది.

 ఆ అమ్మాయి గొంతు వినిపించింది. “ఇప్పుడు నీ వంతు, సాహూ...” అవును నా వంతు.. ఒకరి తరువాత ఒకరు పోవాలి కదా..

అవును ఇప్పుడు నావంతు.. ప్లీజ్ నన్ను త్వరగా చంపు..... నేను కత్తిని నా గొంతుకి ఆనించాను.....

 కోసుకున్నాను.. లేదు కోసుకున్నాను అని అనుకున్నాను ...... కానీ కోసుకోలేకపోయాను....

ఎందుకంటే ????

ఆ కత్తి ఇప్పటికే నా గొంతులో వుంది.

నేను ఇప్పటికే చనిపోయాను.

కీయ్... కీయ్...

ఆ శబ్దం ఇప్పుడు నా గుండెలోంచి వస్తోంది.

చనిపోయిన తరువాత కూడా నేను భయంతో పరుగెడుతున్నానా???

 చావు... ఇంత భయంకరంగా వుంటుందా???

***$$$***

నాలుగో అధ్యాయం నా పేరు పరాంకుశ రావు.

శ్రీవల్లీ మాకు లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ.

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము.

మా తల్లిగారు పోయిన తరువాత అమ్మాయి పుడితే మా అమ్మే మళ్ళీ నా కూతురుగా పుట్టిందని ఎంతో పొంగిపోయాను.

 ఎంతో ముచ్చటపడి ‘శ్రీవల్లీ’ అని అందమైన పేరు పెట్టుకున్నా.. ఎక్కువగా అమ్మా అనో, అమ్మలూ అనో పిలుచుకునేవాడిని.

 ఎంతో సాత్వికంగా సాఫీగా జీవనం సాగిస్తున్న మాకు ఈ శేఖరం రూపంలో శని దాపురించి, మమ్మల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తాడని, మా జీవితాలు అతలాకుతలం చేస్తాడని, నేను కలలో నైనా ఊహించలేదు.

 అమ్మాయిమీద పెట్టుకున్నా ప్రేమ, ఆశలు, సంఘంలో గౌరవం, కట్టుబాట్లు అన్నీ కలసి శేఖరాన్ని చంపించాలనే క్రూర నిర్ణయం తీసుకోవడానికి, నన్ను రక్తం త్రాగే రాక్షసునిగా చేశాయి.

(ఇంకా వుంది.... ఒక తండ్రిని రాక్షసునిగా చేసిన ఆవేదన)


Rate this content
Log in

Similar telugu story from Horror