వేంకటేశ్వర స్వామి అప్పు
వేంకటేశ్వర స్వామి అప్పు
*శ్రీవేంకటేశ్వర స్వామి అప్పు* చాన్నాళ్ల నుండి మనసంతా ఒక విధమైన ఆదుర్దాగా ఆందోళనగా వుంటుంది. ఇంత పెద్ద మొత్తం లో చేసిన అప్పు ఎలా తీరుతుందో.. ఎప్పటికీ తీరుతుందో కదా... ఒకటి కాదు రెండు కాదు, లక్ష కాదు కోటి కాదు, నెల కాదు సంవత్సరం కాదు... వందలు వేల సంవత్సరాలనుండి తీర్చిన అప్పు.. ఇంకా తీర్చవలసిన అప్పు... అదీ చక్ర వడ్డీ తో.... ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీర్చడం కోసం మన స్వామి ఎంత కష్ట పడున్నాడు! మనం ఐతే రోజుకు ఏడెనిమిది గంటలు పడుకుంటున్నామే, మరి స్వామికి కనీసం ఒకటి రెండు గంటలు కూడా విశ్రాంతి వుండడం లేదు కదా !! అప్పుడెప్పుడో చిన్న జీయర్ స్వామి, స్వామికి కనీసం 4–5 గంటలు విశ్రాంతి ఇవ్వాలని చిన్నసైజ్ ఆందోళన చేసి, ఎందుకో మరి వదిలేశారు. భగవంతునికైనా భక్తునికైనా అప్పులకి మూల కారణం పెళ్ళేనా ? తన పెళ్ళితోటే కదా స్వామి ఇలా అప్పుల పాలయ్యాడు. అవును మరి, ఇప్పుడైనా.. అప్పుడైనా..ఎప్పుడైనా.. పెళ్ళంటేనే ఆడంబరాలకి, అప్పులకి మూలం కదా.. ఈ మాయ నుండి భగవంతుడు కూడా తప్పించుకోలేడు కదా!!! తన పెళ్ళికి చేయవలసిన వచ్చిన అప్పు తీర్చడం కోసం స్వామి పగలనక, రేయనక, భక్తులందరికి దర్శనం ఇస్తూ వాళ్ళ గొంతెమ్మ కోర్కెలని తీరుస్తూ సతమత మవుతున్నాడు కదా !!! హరిద్వార్ మానసా దేవి నయం ఓన్లీ రీజనబుల్ కోర్కెలు మాత్రమే తీరుస్తుంది. ఈ స్వామిని ఎవరు చిన్న చిన్న కోర్కెలు ఆడగారు అన్నీ గొంతెమ్మ కోర్కెలే ! స్వామి కూడా అప్పు తీర్చాలనే తొందరలో మేం అడిగిన అడ్డమైన కోర్కెలన్నీ తీర్చేస్తున్నాడు. లేకపోతే మనకి తెలిసే ఇన్నిన్ని పాపాలు, దుర్మార్గాలు చేసిన వాళ్ళు, వీళ్ళు ఎంత దర్జాగా, ఎంతో దర్పంగా మన వ్యవస్థలో మన మధ్య ఎలా తిరగ గలుగుతున్నారు. అయినా మన “అయ్యవారిది” ప్రేమ వివాహం కదా!!! మరి ఎందుకు అప్పులపాలు అయ్యాడు? అయినా ఈ పెద్దాయన డాబుసారి పెళ్ళికి చేసిన అప్పు మనం ఎందుకు తీర్చాలి. తీర్చడం కోసం ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు తిరుమల వెళ్లి స్వామి నీ దర్శించి రావాలి. వెళ్ళిన ప్రతీ సారి అంతో ఇంతో మొక్కుబడుకు చెల్లించాలి. అలా కాదులే మా నాన్న అప్పు చేసి మమ్మల్ని చదివించి ఒక ఇంటివాడ్ని చేసి నన్ను నిలబెడితే ఆ అప్పు నాకు సంబంధం లేదు అని అనలేం కదా... మా అబ్బాయి అప్పు చేస్తే నాకు ఎందుకు అని అనుకోం కదా.. అలానే స్వామి అప్పు కూడా మనదే... అసలు దీనికంతకు వకుళమాత కారణం కదూ.. ఆమెననాలి.. ఈ సారి తిరుపతి వెళ్లినప్పుడు వకుళమాత టెంపుల్ కి వెళ్ళి మరీ అడుగుతా... స్వామి ప్రేమించానని చెప్తే, ఎలావోలా ఆకాశ రాజుతో మాట్లాడి పెళ్ళికి వప్పించాలి, బ్రతిమాలో బామాలో, బుజ్జగించో, బెదిరించో ఒప్పించాలి. అంతే గాని ఇంత పెద్ద మొత్తంలో ఎవరైనా అప్పు చేస్తారా. నాకెప్పటినుండో పీడిస్తున్న సందేహం…. ఎవరైనా మగ పిల్లాడి పెళ్ళికి అప్పుచేస్తారా??? ఆడపిల్ల పెళ్ళంటే అర్ధం చేసుకోవచ్చును, ఎందుకు అప్పు చేశారో? అంత అప్పు చేసి అంత ఆడంబరంగా ఎందుకు పెళ్లి చేయాలి? అది తీర్చడానికి స్వామి యుగయుగాలుగా ఎందుకు శ్రమ పడాలి? ఇప్పటికే చాలా తీర్చాను, ఇక చాలు అంటే కుబేరుని పరిస్థితి ఏంటి ? పోయి పెద్దాయన శివునికి చెప్తాడా? చెప్తే ఏంటట? ఈయన బావగారే కదా? ఈసారి కేదార్నాధ్ కి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్తా.. మా స్వామి కట్టింది ఇక చాలు. ఈ ఋణం మాఫీ చేయమని. కనీసం భార్య లక్ష్మీదేవి అయిన పట్టించుకోవాలి కదా.. ఆవిడని మనువాడడానికే కదా ఈ అప్పంతా.. అమ్మకి డబ్బుకి కొదవ ఏమిటి? ఒక్క దెబ్బకి తీర్చేవచ్చు కదా.. ఇంత అంతర్మదానం జరిగిన తర్వాత వుండబట్టలేక మా సుజాతతో అన్నా ఇదంతా.. ఒక చిన్న నవ్వు నవ్వింది.. నాకెందుకో వేంకటేశ్వర స్వామి నా అజ్ఞానాన్ని చూసి నవ్విన నవ్వులా అనిపించింది. చెప్పు చెప్పు నువ్వేమనుకుంటున్నావు అని అడిగా.. చాలా సింపుల్ గా చెప్పింది. ఒకవేళ ఎవరైనా స్వామి అప్పు తీర్చేస్తే .. స్వామి ఇక్కడ మనతో ఎందుకు వుంటాడు???? తన లోకానికి వెళ్లిపోతాడుగా.. స్వామి ఇక్కడే మనతోపాటే వుండాలంటే ఈ అప్పు తీరకూడదు.. ఈ మాత్రం తెలీదా??? అయినా ఇక్కడ అప్పు..... డబ్బు, ధనం కాదండీ.. మనకీ స్వామి కి వున్న బంధం.. అనుబంధ.. అది ఎప్పుడు తీరుతుంది? ఎందుకు తీరాలి? మనకి స్వామి పై వున్న అపరమితమైన భక్తి కి ముగింపు అని ఏమైనా వుంటుందా.. చెప్పండి ?
