బుల్లెట్ పై భగవంతుడు 1
బుల్లెట్ పై భగవంతుడు 1
బుల్లెట్ పై భగవంతుడు
నాకు చిన్నప్పటి నుండి బుల్లెట్ అంటే ఎందుకో అలవికాని అనురాగం ..
వల్లమాలిన అభిమానం..
అవును.. ఇది బాగుంది.. మనకి సరిగ్గా సూట్ అవుతుంది.
మరీ అంత కవితాత్మకం మనకి, మన లైఫ్ స్టైల్ కి సూట్ అవదు మరి.
నా చిన్నప్పుడు మా ఇంటి ప్రక్కన వుంటే పోలీస్ ఆఫీసర్ ని ఆఫీసుకు తీసుకు వెళ్ళడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటా, ఆయన బుల్లెట్ పై వచ్చే వాడు.
మంచి పర్సనాలిటీ తో, చాలా గంభీరంగా, హీరో లా వుండే వాడు.
చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్ అని అనుకునే వాళ్ళం.
అప్పటి నుండి ఆ సౌండ్ అంటే ఒక విధమైన ప్రేమ అభిమానం చెప్పాలంటే passion కూడా.
తరువాత రోజుల్లో ఉమెన్స్ కాలేజీ దగ్గర సైకిల్ పై అమ్మాయిల వెంట తిరిగే రోజులలో అదే బుల్లెట్ శబ్ధం ఒక భయం.
పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడేమో అని.
అక్కడి నుండి జీవితంలో ఎలాగైనా బుల్లెట్ కొనాలనేది ఒక గోల్.
కానీ చాన్నాళ్ళ వరకు కాదు కాదు చాన్నేళ్ల వరకు కొనుక్కో లేకపోయాను.
చదువు, నిరుద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, తరువాత ప్రభుత్వ ఉద్యోగం, పెళ్లి, సంసారం, పిల్లలు, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు .. ..
అలా జీవితం అంతా ఖర్చులే....
ఇదిగో ఇప్పుడు కొనగలిగాను,
అందరూ నీకు ఈ వయసులో అవసరమా అంటున్నా సరే..
అవును నౌ ఆర్ నెవర్ స్టేజ్ లో వున్నాం మరి.
అంతా బాగానే వుంది. ఇంతలో..
అన్నయ్య నుండి ఫోన్, నాన్నకి బాలేదు అని.
వున్నపాటుగా ఊరికి బయలదేరాను.
బయటకి వ్యక్తపరచలేక పోయిన నాన్న అంటే నాకు చాలా ఇష్టం.
అదేదో గొప్ప విషయం కాదు. అందరికీ ఎవరి అమ్మా, నాన్న అంటే వాళ్ళకి ఇష్టమే కదా.
వెళ్ళే సరికి నాన్న పరిస్థితి ఏమీ బాలేదు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కాశీ .. అ వును కాశీ అనే అంటున్నారు.
బహుశా కాశీ వెళ్లాలనే కోరీకేమో. కాశీ రెండు మూడు సార్లు వెళ్లారు కదా..
ఎన్ని సార్లు వెళితే మాత్రం అపేక్ష తీరుతుందా.
అయినా ఇప్పుడు ఈ స్థితిలో కాశీ ఎలా .. కష్టం.. బహుశా ఈ ఆఖరి క్షణాలు కాశీ లో గడపాలనే కోరికా?
ఆఖరి క్షణాలని నేనే డిసైడ్ చేసేస్తున్నానేమిటి? డాక్టర్ కదా చెప్పాలి.
వచ్చిన పని (?) అయిపోతే మళ్ళీ ఆఫీసు, ఇల్లు, డబ్బు మళ్ళీ ఉరుకులు పరుగులు .. అ దేనా జీవితం అంటే...
అంతా చాలా రొటీన్ గా జరిగిపోయింది. అందరు వచ్చారు.
నాన్న చాలా మంచి వాడు అన్నారు, బంధు ప్రియుడు అన్నారు, అందరినీ గుర్తుపెట్టుకుని పలకరించే వాడు అన్నారు. వున్నంతలో అందరికీ సహాయం చేసేవాడు అన్నారు.
అన్నీ కార్యక్రమాలు అయిపోయాయి. 12 వ రోజు కార్యక్రమం అయిన తరువాత వచ్చిన చూట్టాలేవరు మా ఇంటిలో వుండకూడదు అని చెప్పి అందరు వెళ్ళి పోయారు,
అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చిన్నన్నాలు, వాళ్ళ పిల్లలు, సాయంత్రం వరకు ఎంతో సందడిగా.. ఈ పదం కరెక్ట్ అయినా కాక పోయిన ఈ 12 రోజులు ఇల్లు చాలా సందడిగా వుంది..
చెప్పాలంటే పెళ్లి ఇల్లులా.. అదెప్పుడో ఆకలి రాజ్యం సినిమాలో రాజధాని నగరం లో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.. అన్నాడుగా మన కమల్ హాసన్.. అలా అన్న మాట.
ఇప్పుడు ఇల్లు చాలా నిశ్శబ్ధం అయిపోయింది.. శ్మశాన నిశ్శబ్దం లా..
ఇంకో మూడు రోజుల తరువాత అందరం ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నాము.
ఆ రాత్రి చీకట్లో ఇంటి బయట కూర్చుని బుల్లెట్‌ని చూస్తున్నాను.
ఒక్కసారిగా దుఖం కమ్ముకుంది. నాన్నని ఒక్కసారైనా ఎక్కించుకుని డ్రైవ్ చేసుంటే బాగుణ్ణు కదా.
స్టాండ్ తీసి, ఇంజన్ ఆన్ చేశాను.
థంప్ ... థంప్... ఏదో ఒత్తిడి తగ్గిన ఫీల్.
“ఒక్కసారి రైడ్ చేద్దాం అనిపించింది”.
రోడ్డు ఖాళీ.
మెల్లగా ఇంజిన్ శబ్ధం వింటూ వెళ్తున్నా. రాత్రి పన్నెండు దాటినదేమో రోడ్లన్నీ చాలా ఖాళీగా వున్నాయి.
జనసంచారం అస్సలు లేదు.
గాలి మీద సన్నగా విభూతి వాసన అనిపించింది.
ఒక్కసారి వెనక్కి చూశాను –
బ్యాక్ సీట్‌లో ఎవరో కూర్చున్నారు!
జీన్ ఫాంట్, జెర్కిన్, జటా, రుద్రాక్షలు, బ్లూటూథ్ హెడ్‌ఫోన్ అన్నిటికన్నా గొప్ప అలంకారం సన్నని నవ్వు.. చాలా బాగుంది ఆ నవ్వు, పుస్తకాలలో మనోహరంగా అంటారే అలా.
“ఎవరు మీరు?” అని అడిగాను.
అడిగాననుకున్నాను కానీ నిజానికి అరిచాను అని చెప్పాలి. అతను నవ్వాడు, అదే మనోహరంగా.
మీ నాన్న అన్న కాశీ గురించి ఆలోచించావా.. లేక మళ్ళీ రేపటి నుండి ఆఫీసు, పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, డబ్బు అంతేనా..
అవును మర్చి పోలేదు కానీ ఆఫీసు శలవులు డబ్బు అవీ చూసుకోవాలి కదా..
నువ్వేమైనా ఖండాలు దాటాలా, సముద్రాలు దాటాలా, రెండు మూడు రాష్ట్రాలు దాటితే సరి.
ఒక రోజులో చేరుకుంటావు. మరీ ఎక్కువ ఆలోచించకు, రెఢీ అవు అన్నాడు.
Ok ఇంతకీ మీరెవరు సారూ అంటూ కొంచెం వెనక్కి తిరిగా..
ఆశ్చర్యం ఎవరు లేరు.. నాలో నేనే మాట్లాడుకున్నానా..
ఠక్కున తెలివవచ్చింది.. చుట్టూ ఎవరు లేరు.. బుల్లెట్ కూడా లేదు..
టైమ్ రాత్రి ఒంటి గంట అవుతుంది.
ఇక నిద్ర పట్టక ఏమైతే అయింది కాశీ వెల్లవలసిందే అని నిశ్చయించుకని ప్లానింగ్ ప్రారంభించా..
ఎలాను నాన్నని నా బుల్లెట్ ఎక్కించలేక పోయాను. కాశీ ఘాట్ల దగ్గరైనా బుల్లెట్ పై తిరిగితే నాన్నని ఎక్కించుకున్న అనుభూతి వుంటుంది కదా అనిపించింది.
ఉదయం లేచి నా నిర్ణయం చెప్పా..
ముందు అందరు వ్యతిరేకించారు. ఈ వయసులో అంతా దూరం బుల్లెట్ పై వెళ్లలేవు. చాలా రిస్క్ అన్నారు. రాత్రి నిర్ణయం తీసుకున్నాను కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
ఇంతలో మా వాడు ఏం ఫర్వాలేదు నాన్నా, బండిని నీతో బాటు కాశీ కి అదే రైల్ లో లగేజ్ క్రింద బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు.
అవన్నీ నేను చేస్తాను గా అన్నాడు.
నాకు చాలా హ్యాపీ అయింది.
వాడికి కూడా బుల్లెట్ అంటే ఇష్టం.
ఇక ఇద్దరం కలసి పని ప్రారంభించాము.
ముందుగా <parcel.indianrail.gov.in > సైటు లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఫార్వర్డింగ్ నోట్ ఫిల్ చేసి, estimate చార్ట్ చూసకుని, అమౌంట్ పే చేసి, రిసీట్ ప్రింట్ తీసుకున్నాము.
బైక్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్ళి, పెట్రోల్ పూర్తిగా ఖాళీ చేసి, నీట్ గా ప్యాక్ చేసి, లగేజ్ లో ఇచ్చేయాలి.
ఇక ట్రైన్ టైమ్ కి ఒక నాలుగు గంటల ముందు స్టేషన్ కి వెళ్ళి బుల్లెట్ హాండోవర్ చేశాను.
స్టేషన్ లో వైట్ చేస్తుంటే ట్రైన్ టైమ్ కె వచ్చింది.
తత్కాల్ టికెట్ ఏమో సైడ్ లోవర్ వచ్చింది. సెకండ్ AC లో. కూర్చొని కళ్ళుమూసుకుని ఆలోచనలో పడ్డాను.
మొత్తానికి అనుకున్నది చేస్తున్నావే అంటూ భుజం మీద చేయి పడితే చూశాను.
అప్పుడు రాత్రి నా బుల్లెట్ వెనుక కూర్చున్న వ్యక్తే.
అయితే ఇప్పుడు కాస్ట్యూమ్స్ మారాయి. కాషాయి పంచే అదే రంగు లాల్చీ, జడలు, విభుద్ధి నామాలు, రుద్రాక్షలు సేమ్ టు సేమ్ అదే మనోహరమైన చిరునవ్వు.
అవును ఇంట్లో వాళ్ళని ఎంతో కష్టం మీద ఒప్పించాను.
ఇప్పుడు కాక పోతే ఇక ఎన్నటికీ కాదు అనిపించింది.
ఇంతకీ కాశీ ఎప్పుడైనా వెళ్ళావా అక్కడి పరిస్థితులు తెలుసా?
ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా అంత గుర్తు లేదు.
అయితే ఈయనని కలువు అన్నీ చూపిస్తాడు నీకు అని ఒక స్లీప్ మీద పేరు, ఫోన్ నెంబర్ రాసి నా జేబులో పెట్టాడు.
అలా మాట్లాడుతుంటే చిన్నగా నిద్ర పట్టింది,
చిన్న కుదుపుతో ట్రైన్ ఆగితే ఠక్కున తెలివి వచ్చి చూస్తే స్వామి లేడు.
పేరైనా అడగలేదే అనుకుంటూ. ప్రక్క వాళ్ళని అడిగా స్వామి ఎప్పుడు దిగిపోయారు సార్ అని.
ఏ స్వామి అని నా వైపు ప్రశ్నార్ధకంగా చూశారు.
అదే ఇందాక మాట్లాడానే, అతను.
ఎవరు లేరు సారూ. ఇది సెకండ్ AC ఇందులో స్వాములని సన్యాసులని ఎందుకు ఎక్కనిస్తారు సార్.
అవును కదా.. అయితే ఇది నా కల అన్న మాట.
(కాశి అనుభవాలు ఎన్నో..... స్వామి నాకు కాశి చూపించాడా? నేను చూపించానా ...మరిన్ని తరువాతి భాగంలో)
