murali sudha

Comedy

4  

murali sudha

Comedy

ఉద్యాపన

ఉద్యాపన

3 mins
361



'అయినా ఏంటి వరపతీ, ఏంటి నువ్వు చేసిన పని'


'అట్టా కాదండీ అడగాల్సింది, కాస్త గట్టిగా జాడించండి'


'అయినా ఆ సాద్వీమణి ఏం చేసిందని నువ్వీ ఘోరానికి పూనుకున్నావయ్యా'


'ఏం మాకంతా పెళ్ళాలు లేరా!? మేమూ నీలాగే చేస్తే ఇక ఈ భూ పపంచకం ఏమైపోతుంది'


'ఇది మగ అహంకారానికి పరాకాష్ట, దీన్ని ఇలాగే కొనసాగించామా! మనకంటూ ఏమీ మిగలదు'


ఈ మాటలన్నీ వింటూ వస్తున్న వరపతి నడుస్తున్నాడో, తూలుతున్నాడో, పడుతున్నాడో, పరిగెత్తుతున్నాడో అర్థంకాక అంగల మీద అంగలు వేస్తూ ఇంటికొచ్చి పడ్డాడు. 

ఇంకా వీధిలోనే ఉంటే ఎవరొచ్చి మీదపడి ఏ అఘాయిత్యం చేస్తారో అర్థం కాక సగం, అసలు తాను చేసిన తప్పేమిటో!? అసలు వరాన్ని తాను ఎదిరించడం ఏమిటో, పైగా వరాన్ని తాను కంట్రోల్ పెట్టాడట, కలలో కూడా జరుగుతుందా అని ఆలోచిస్తూ....


'వరం, వరం'


'ఆ....ఏమిటండీ, ఏమయ్యింది. ఏమిటా పిచ్చుక కేకలూ మీరూనూ'


'పిచ్చుక కేకలా! నిజమేలే నాకు గావు కేకలు పెట్టే స్వతంత్రం ఎక్కడ ఏడిచింది కానీ, ఏమిటి వీధిలో వాళ్ళందరూ వాళ్లకు అలవాటు లేకున్నా నన్ను ఆమ్లెట్ లా వేసుకుని తినేసేటట్టు, పెసరట్టు లోకి ఉప్మా లా నన్ను నంజుకు తినేసేటట్టు, చితకొట్టిన చింత తుట్టెల్లా నన్ను నా డొప్పను అదేలే నా చర్మాన్ని వేరు చేయాలి అనేటట్టు అలా కరుస్తున్నారు'


'వాళ్ళెందుకు కరుస్తున్నారో నాకేం తెలుసు కానీ, ముందు నేను చెప్పిన సామాన్లు తెచ్చారా లేదా'


'ఆ కొన్ని తెచ్చాను. అయినా ఇరవై సెల్లుఫోన్లు రాశావు ఎందుకు వరం. అవి సెల్లుఫోన్లు అయ్యివుండవు కదూ, జల్లు గరిటెలు అయ్యి ఉంటాయి. కనుక్కుందామని నీకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తక పోయేసరికి వాటిని మాత్రం తేలేదు'


'ఓరి దేవుడో! ఓరి దేవతో! అసలు వ్రతానికి ముఖ్యమైన వస్తువే తీసుకురాకుండా వచ్చాడే, ఈ పెద్దమనిషి. ఇంక నేనేం చేసేది సెల్లో'


'ఒసే, ఒసే అలా గగ్గోలు పెట్టమాకే, అసలే వీధిలో వాళ్ళు ఇస్త్రీ పెట్టెలా కాక మీదున్నారు. ఇప్పుడు కానీ ఈ ఏడుపు విన్నారా? వచ్చి నన్ను ఫ్రెష్ గా సాపు చేసి పోతారు. అవునూ ఇంతకీ సెల్లులు ఎందుకు, నువ్వు చేయబోయే వ్రతం ఏమిటి?'


'సెల్లు సొల్లు ఉద్యాపన వ్రతమని , కొత్త వ్రతం అండీ. మీరేమో నన్ను నలభై ఎనిమిది గంటలూ ఈ సెల్లులో సొల్లులు చెప్పుకుంటున్నానని విసుకుంటున్నారనిన్నూ, నాకూ కొద్దో గొప్పో బోర్ కొట్టిన కారణము చేతననిన్నూ ఈ వ్రతాన్ని కనిపెట్టాను'


'హేమిటీ సెల్లు సొల్లు ఉద్యాపన వ్రతమా!? ఎక్కడా వినలేదు, కనలేదు కదే'


'హా! అవునండీ నేనే కనిపెట్టాను. నేను ఉన్న వాట్సప్ గ్రూప్ లు తొక్కలో వంట, రుబ్బేద్దాం రండి(మొగుడినీ - పచ్చడినీ), ఏడిపిస్తే ఏమిస్తావ్!?, చాడీల సుబ్బమ్మా-ఎత్తిపోతల ఎంకమ్మా ఇత్యాది ఓ 400 గ్రూపులను, ఇంకా ముఖపుస్తకంలో నా కాళ్ళు, వేళ్ళు ఇరికించుకున్న ఓ 500 గ్రూప్ లను త్యజిస్తూ, వాటి పోషణ, పాలన చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని ఇలా ఉద్యాపన చేస్తున్నాను'


'మరి ఇరవై సెల్లులు ఎందుకు!?'


*********


'నిన్నేనే'


'రీలు తిరుగుతోంది కనిపించడం లేదా!?'


'రీలా!!!'


'ఆ ఫ్లాష్ బ్యాక్, ఉదయం పిలుపులకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే......'


'చామంతి వదినా, చామంతి వదినా! నేను సెల్లుసొల్లు ఉద్యాపన వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఏ గ్రూప్ ఇవ్వమంటావు'


'ఇదేం వ్రతం వరమొదిన విననేలేదు'


'ఏం చెప్పమంటావ్ చామంతొదినా. అష్టకష్టాలు పడి ఓ 400 వాట్సప్ గ్రూప్ లు, ఓ 500 ల ఫేస్బుక్ గ్రూప్ లు స్థాపించి, స్థాపించినోళ్ళని ఆ మాటా ఈ మాటాతో కాకాపట్టి అట్టా కుదురుకున్నానో లేదో, ఇట్టా లాక్డౌన్ వచ్చె. ఈయన కాళ్లు బయటపెడితే ఎవరు విరగొడతారా అన్నట్టు ఇల్లు కదలక పోయే. అప్పటికీ వంటిల్లు తనకే రాసిచ్చేశా, పోనీలే పిచ్చి మారాజు నచ్చింది చేసుకు తింటాడని. ఇక ఇల్లూ, వాకిలి అంటావా వాటినెప్పుడో పనిపిల్లకు ధారాదత్తం చేస్తిని. ఇంతకన్నా త్యాగం ఏ ఇల్లాలు చేస్తుంది చెప్పూ!?'


'అయ్యో వదినా, అట్టా ఏడవమాక'


'హా...హా...ఏడుపు కాక ఏమి మిగిలింది వదినా! ఇన్నీ అందరికీ అప్పచెప్పేసాక నాకూ తోచుబాటు కాక కష్టమో, నష్టమో ఆ సెల్లుతోనే కాలం వెళ్లతీద్దాం అనుకుంటూ, కళ్ళు నొప్పెట్టినా, ముఖం పీక్కుపోయినా, నిద్రను తలగడ కింద దాచిపెట్టి సెల్లు స్క్రీన్ తో గడుపుతూ ఉన్నానా!?'


'అవును వదినా మామూలు త్యాగమా అది, కార్తీకదీపాన్ని కూడా చూడవాయే నువ్వు'


'అంత త్యాగశీలిని నన్ను పట్టుకుని మీ అన్నయ్య అదే మా వరపతి ఎప్పుడూ ఏమి చేస్తుంటావే ఆ సెల్లుతో అని ఎంత పేద్ద మాట అన్నాడో తెలుసా!'


'ఏమిటీ అంత పెద్ద మాట అనేశాడా!? హమ్మా!హమ్మా! ఎంత దారుణం, ఎంత దారుణం. కనపడడు కానీ మా అన్నయ్యకూ నోటి దురుసు ఎక్కువే. ఇంతటి మహా సెల్లురాణిని అంత మాట అనడానికి అసలు ఆ ముప్పై రెండు పళ్ళూ ఎక్కడి నుంచీ వచ్చాయో'


'అయ్యో ఆ నోటిలో ముప్పై రెండు పళ్ళు ఎక్కుడున్నాయీ!? ఓ పదో, పదహయిదో ఉంటాయి'


'ఓహో ! ఆ మాత్రానికే అంత టెక్కా, ఆ నోటికి'


'మరే, మరే. అందుకే ఈ ఉద్యాపన చేసేద్దామని నిర్ణయించుకున్నాను. నీతో పాటు మన వీధిలోని అమ్మలక్కలు, అత్తమ్మలూ, ముత్తమ్మలూ అందరినీ పిలిచి తలా ఓ పది గ్రూప్ లు వాయన దానం ఇచ్చేస్తాను. కాస్త పెద్ద మనసు చేసుకుని పుచ్చుకుందురూ'


'పుచ్చుకోవచ్చు కానీ, నా సెల్లు డొక్కుది అయిపోయింది వదినా. దానితో పాటే ఆ చిట్టెమ్మది, ఆ బానమ్మది ఇలా కొందరివి బాగోలేవు. పనిలో పనిగా ఓ ఇరవై సెల్లులు తెప్పించావా మాకూ ఏదో కాలక్షేపం అవుద్ది నీ పుణ్యాన'


'అదేం భాగ్యం చేమంతొదినా, ఇప్పుడే మీ అన్నయ్య గారితో చెప్పి తెప్పించేస్తాను'


********


'అయిపోయిందా నీ రీలు, ఇదన్నమాట సంగతి, ఇందుకన్న మాట వాళ్ళు నన్ను అన్నన్ని మాటలు అన్నది'


'మరి వరం అస్సలు మాటలు పడే రకం కాదు. వెళ్ళండి వెళ్లి సెల్లులు తెస్తే ఉద్యాపన చేసేసి హాయిగా కృష్ణా, రామా అంటూ కొత్త కాలక్షేపం ఎతుక్కుంటాను'


సుధామురళి


Rate this content
Log in

Similar telugu story from Comedy