murali sudha

Others

4  

murali sudha

Others

కారణం

కారణం

6 mins
344


శీర్షిక :: కారణం...!!


"సాకేత్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈరోజు నాన్నని డిశ్చార్జ్ చేసుకుని వచ్చేటప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. అది నీ సహాయం లేకుండా నేను చేయలేను. నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు కానీ చెప్పేందుకు నాకే ఇబ్బందిగా ఉంది "


"పిచ్చి ప్రియా! ఆ విషయం నాకు తెలుసు. డాక్టర్ నాకు ఫ్రెండ్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. వివేక్ నాకు అన్నీ చెప్పాడు. సో డోంట్ వర్రీ. అంతా నేను చూసుకుంటాను. అయినా మామయ్యను మన ఇంటికే తీసుకు వెళితే సరిపోతుందిగా. వున్నంతకాలం మనతోనే హాయిగా, సంతోషంగా ఉంటాడు " 


" నాకు తెలుసు సాకేత్ నీ మంచి మనసు. ఇంతమంచి వాడివనే కదా ఎందరు వద్దన్నా మా నాన్న ఏరికోరి నీకు ఇచ్చి చేసింది నన్ను. అయినా ఇక్కడికి వద్దులే. అత్తయ్యా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. నాన్న కూడా అక్కడ ఫ్రీగా వుండలేడు. అయినా ఊరేమి పెద్ద దూరం కాదుగా. అరగంట ప్రయాణం. నేను అటునుంచి అటే డ్యూటీ కి వెళ్లివస్తుంటాను. నువ్వు రెండు, మూడు రోజులకి ఒకసారి వస్తే సరిపోతుంది"


"నీ ఇష్టం ప్రియా. నీకూ , మామయ్యకూ ఎలా అనుకూలమో అదే చెయ్యి. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మరచిపోకు. ఇక ఆ వస్తువు నేను వచ్చేటప్పుడు తెచ్చి పెడతాను. నీకు ఏ ఇబ్బందీ ఉండదు. ఇక్కడ కూడా మన రమణమ్మకు , వీరయ్యకూ అన్నీ చెప్పి ఉంచాను. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు"


ఇలా మాట్లాడుకుంటున్న సాకేత్ , ప్రియలకు ఎవరో పెద్దగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మాటలు అక్కడితో ఆపేసి ఆ శబ్దం వచ్చిన వైపుగా పరిగెట్టారు.


ప్రియా నాన్నగారు రంగారావు గారు పక్కరూములో భోరున విలపిస్తున్నాడు. ఎందుకో ఏమిటో అర్థం కాని ప్రియా, సాకేత్ లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రంగారావు దగ్గరికి పరిగెత్తారు.


" మామయ్యా , మామయ్యా ఏమయ్యింది. ఎందుకు అలా ఏడుస్తున్నారు. మళ్లీ ఏదన్నా నొప్పి వచ్చిందా. వివేక్ కి ఫోన్ చేయమంటారా"


" నాన్నా ఏంటి, ఏమయ్యింది. ఎందుకు అలా ఉన్నఫళంగా ఏడుస్తున్నారు. ఏమయ్యింది నాన్నా? చెప్పండి. హాస్పిటల్ కి వెళదామా ? లేవండి నాన్నా లేవండి. రమ్య కు ఫోన్ చేయనా. తను ఇందాకే కదా ఇంటికి వెళ్ళింది. రేపు వస్తానని చెప్పే వెళ్ళింది. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఒక్కసారి వచ్చిపొమ్మన్నారని చెప్పింది. రమ్య మీద బెంగ గా ఉందా. ఏమయ్యిందో చెప్పండి నాన్నా ? ప్లీస్ "


" ఏమీ లేదమ్మా ? నీకూ , రమ్యకీ, సాకేత్ కీ, వరుణ్ కీ నా మీద వున్న ప్రేమకు, అభిమానానికి నాకే సిగ్గుగా ఉంది. మీకు మంచీ, చెడూ చెప్పి మీ బాగోగులు చూడాల్సిన నేను అక్కరలేని అలవాట్లకు బానిసనై ఇలా లివర్ ను పాడుచేసుకుని రోజులు లెక్కబెడుతూ ఉంటే నన్నింకా బతికించుకోవాలన్న మీ తపనకు, ప్రేమకు నేను తట్టుకోలేక పోతున్నాను. ఏ ఆడపిల్లా చేయకూడని పనికి నువ్వూ, రమ్యా పూనుకోవడం, అందుకు మీ , మీ భర్తలు సహకరించడం నన్ను నా మనసాక్షి ముందు క్షమించరాని వాడిగా నిలబెడుతోంది. మీ అమ్మ బతికి ఉన్నన్నాళ్ళూ సుఖ పెట్టలేక పోయాను. నా దురలవాట్లతో తనకి మనశ్శాంతి లేకుండా చేశాను. ఇప్పుడు ఈ అవసానదశలో మిమ్మల్ని నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాను. అది తలచుకుంటేనే నాకు దుఃఖం ఆగడం లేదు. నన్ను ఏదన్నా అనాధాశ్రమంలో చేర్పించేయండమ్మా. ఉన్నన్నాళ్లు ఉంటాను. మీకీ క్షోభ అన్నా తగ్గుతుంది"


" నాన్నా దయచేసి అలా మాట్లాడకు. నువ్వు అలా చెడు అలవాట్లకు బానిస కావడానికి ఒకరకంగా మేమూ, అమ్మా కూడా కారణం. చిన్నప్పటి నుంచీ నువ్వు మొండి వాడివని నిన్ను గారం చేస్తూ నీ చెడు అలవాట్లని , నీ చుట్టూ చేరిన స్నేహితులని గమనించి కూడా నీ మీద అపారమైన ప్రేమతో నిన్నేమీ అనని నానమ్మా, తాతయ్యలది కూడా తప్పు. నీకు భయపడి అమ్మా నిన్ను మార్చుకోలేక పోయింది. తాను దూరం అవుతూ, మమ్మల్నీ దూరం పెడుతూ నువ్వు మరింతగా దిగజారేలా చేసింది. అయినా మేము నీతో ఇంకొంచెం ప్రేమగా ఉండి ఉంటే నువ్వు మారక పొయ్యేవాడివా. నీకీనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా" అంటూ తానూ ఏడవడం మొదలుపెట్టింది ప్రియ.


మళ్లీ తనే

" అయినా నీ అలవాట్లు ఎన్ని ఉన్నా నువ్వు మాకు ఏ లోటు చేశావు నాన్నా. నీకున్న అతి తక్కువ సంపాదనతోనే నన్నూ, చెల్లిని యువరాణుల్లాగా చూసుకున్నావు. 'పెద్దోడా' అంటూ నన్నూ, 'చిన్నోడా' అంటూ చెల్లిని నీ భుజాలమీదే కదా నాన్నా ఆడించావు. 

'ఇద్దరూ కూతుళ్లు ఎట్టా సాకుతావో, ఎట్టా పెళ్లిళ్లు సేత్తావో' అనే ఊరి వాళ్ళ మాటలకు

' నా బిడ్డలు నా బంగారు తల్లులు. నా ఇంటికి మహాలక్ష్ములు. చూస్తూ వుండండి ఎంత బాగా చదువుకుని గొప్పోళ్ళు అవుతారో. ఈ ఊరికి ఎంత పేరు తీసుకువస్తారో' అని ఎంత మురుస్తూ సమాధానం చెప్పేవాడివో గుర్తుందా నాన్నా నీకు. నేనూ, చెల్లీ ఒక్కో క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటే ఊరంతా మమ్మల్ని ఇద్దరినీ ఎత్తుకు తిరుగుతూ అందరితో ఎంత ఆనందంగా చెప్పేవాడివి 

' నా బిడ్డలు ఫస్ట్ వచ్చారు.. నా బిడ్డలు ఫస్ట్ వచ్చారు ' అని ఎలా మర్చిపోగలం నాన్నా నీ ఆ ఆనందాలు. ఆరోజు నీకు ఇంకా పండగ కదా. నువ్వూ, నీ స్నేహితులూ కలిసి బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళు. అమ్మ ఎంత వద్దని అన్నా ఆ విషయంలో మాత్రం నువ్వు అమ్మమాట వినేవాడివి కాదు. ఒకరకంగా దానికీ మేమే కారణమేమో నిన్ను అంత సంతోషంలో ముంచేస్తూ. ఇక నాకు గానీ, చెల్లికి కానీ చిన్న దెబ్బ తగిలినా , ఒళ్ళు కొంచెం వెచ్చగా అనిపించినా నువ్వూ, అమ్మా ఎలా విలవిలలాడిపోయేవాళ్ళు. ఆ బాధలో మళ్లీ నీకు దిక్కు నీ స్నేహితులూ, వాళ్ళతోటి ఆ మీటింగూ. అప్పుడూ అమ్మ నీతో గొడవపడేది. 

'పిల్లలకి ఒంట్లో బాగోలేక పోతే నీకీ రోగం ఏంది' అని

దానికి నువ్వు బాధని తట్టుకోవడానికి అని సమాధానం ఇచ్చేవాడివి. ఇంకా రెట్టించిన అమ్మకు ఆ రోజు నీ చేతి విందుభోజనమే భోజనం" 


"ప్రియా! ఏంటి నువ్వు. అసలే మామయ్య బాధలో ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా"


" లేదు బాబూ చెప్పన్నీ, నా తల్లి ఇన్నిరోజులుగా ఎన్ని బాధలు, ఎన్ని ఆనందాలు లోపల దాచుకుందో చెప్పనీ. తనని ఆపొద్దు"


" నీకు తెలుసా సాకేత్ నేను టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చానని ఎంతమంది చెప్పినా వినకుండా నన్ను ఇంకా బాగా చదివించాలని తనకు అంత స్తోమత లేకపోయినా నన్ను విజయవాడలో చేర్చాడు. అప్పుడు కాలేజీలో చేర్చేందుకు వెళ్ళేటప్పుడు ట్రైన్ భోగీ భోగీ మొత్తం ఒకటే హంగామా ' మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది, మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది' అని ఎంత గొప్పగా చెప్పాడో. ఎలా మర్చిపోగలం నాన్నా నీ ఆ ప్రేమను. మేమే నీ అలవాట్లను పట్టించుకున్నంతగా నిన్ను పట్టించుకోలేదు, పట్టించుకోలేక పోయాము. రూపాయి సంపాదనలో తొంభై పైసలు మాకు ఖర్చుపెట్టి, పది పైసలు నీ సుఖానికి వాడుకుంటేనే నిన్నో విలన్ ని చూసినట్టు చూశాము. అమ్మ పోయిన తర్వాత ఆ అలవాట్లను కూడా వదిలేసి సర్వస్వమ్ మాకే కదా నాన్నా ధారపోశావు. ఇంకో పెళ్లి చేసుకోమన్నా వద్దంటూ మాకోసమే కదా బతికావు. ఇప్పుడు అన్నీ గుర్తుకు వస్తున్నా ఏమీ చేయలేని స్థితి నాన్నా. నీ కూతుళ్లు ఏ బాధా పడకూడదని నీ అల్లుళ్ళకి ఏ దురలవాట్లు ఉండకూడదని వెతికి, వెతికి మరీ బంగారం లాంటి వ్యక్తులను మాకు భర్తలుగా తెచ్చావు "


" అవును ప్రియా నన్ను చూడడానికి వచ్చినప్పుడు 'మా అమ్మాయి బంగారం , నా తల్లికి ఏ కష్టం కలగనీయకు. అసలే తల్లి లేని బిడ్డ బాగా చూసుకోవాలి బాబూ. నా అలవాట్లకు వాళ్ళని ఏమీ అనకూడదు ' అని మాట తీసుకుని నిన్నిచ్చి పెళ్ళి జరిపించాడు " అంటూ నవ్వేశాడు సాకేత్ వాతావరణాన్ని తెలికచేసేందుకు.


"నీకేనా అన్నయ్యా నాకూ అదే మాట చెప్పాడు, నా నుంచీ మాట తీసుకున్నాడు" అంటూ అన్నకు వంత పాడాడు వరుణ్.


" అదేంటి రమ్యా, వరుణ్ అప్పుడే వచ్చారు. రేపు కదా వస్తాను అన్నది" అన్న ప్రియా ప్రశ్నకి


" మీ చెల్లి ఇంటికి వచ్చినది మొదలూ ఒకటే బెంగతో ఏడుపు. ఇక చూడలేక తీసుకువచ్చేశా వదినా "


"అవును అక్కా నువ్వు చెప్పిన ప్రతీ మాటా నిజం. నాన్న ఈ పరిస్థితికి ఎక్కువశాతం అమ్మా, నువ్వూ, నేనూ , నానమ్మా, తాతయ్యా, ఇంకా ఆయన స్నేహితులు మనమే కారణం. అన్ని తెలివితేటలు ఉన్న ఆయనకి సరిగా అర్థం అయ్యేవిధంగా మనం చెప్పలేకపోయాము. అమ్మ పోయాక ఆయన ఎంత మారినా అర్థం చేసుకోకుండా అమ్మ చావుకు నాన్నే కారణం అంటూ ఇంకా, ఇంకా మానసిక క్షోభకు గురిచేసి ఇప్పుడిలా లివర్ చెడిపోయే స్థితికి తీసుకువచ్చాక ఇప్పుడు తండ్రి విలువ తెలుసుకుని, ఆయన మనకు అందించిన ప్రేమను తెలుసుకునే సరికి పరిస్థితి చేయిదాటి పోయింది" అంటూ రమ్య కూడా ఏడుపు మొదలుపెట్టింది.


"మీరేమీ దిగులు పడకండి. డాక్టర్ చెప్పినట్టు అన్ని మందులతోటి, ఆ మందును కూడా కొద్దిగా ఇస్తూ ఉంటే ఎక్కువకాలం మామయ్యను కాపాడుకోగలం ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను" అంటున్న సాకేత్ మాటలకు అందరూ కాస్త తేరుకున్నారు...


పిల్లలకు తాను అర్థం అయ్యానని , ఇక వాళ్ళని ఇబ్బంది పెడుతూ తాను ఉండటం కరెక్ట్ కాదు అని అనుకున్నాడేమో రంగారావు తన ముత్యాల్లాంటి ఇద్దరు కూతుళ్ళనూ, వాళ్ళని కంటికి రెప్పల్లే కనిపెట్టుకుని వుండే తన బంగారు అల్లుళ్ళను చూస్తూ ఆనందంగా, చిద్విలాసంగా అలా నవ్వుతూనే తన శ్రీమతికి కూడా క్షమాపణ చెప్పుకునే పనికి సమాయత్తమయ్యాడు మాట మాత్రం చెప్పకుండా....


*ఒక మనిషి చెడిపోవడానికి కారణాలు ఎన్నో. కానీ బాగుపడాలంటే కుటుంబం, కుటుంబ సభ్యుల ప్రేమ అత్యంత కీలకం.


ఈ కథ నా స్వీయ రచన. దేనికీ అనుకరణ కానీ , అనుసరణ కానీ కాదు...


సమాప్తం..


Rate this content
Log in