murali sudha

Comedy

4  

murali sudha

Comedy

బాబోయ్ సెగ

బాబోయ్ సెగ

4 mins
435


*బాబోయ్.....సెగ*


"ఏమండోయ్ ఎక్కడ తగలడ్డారు?" అంటూ ఆరునొక్క రాగంతో అరచుకుంటూ వచ్చింది మా కాంతం


"ఎక్కడైనా తగలబడనిస్తావా నువ్వు 


ఎప్పుడు చూసినా ఏవండీ... ఏవండీ అంటూ ఒకటే గావు కేకలేస్తావు" మనమేమన్నా తక్కువ తిన్నామా ఏంటి ఏడునొక్క రాగంతో అదరగొట్టేశామ్


"హా హా ఉద్దరించారు లెద్దూ....

మా వాడు , మహా బంగారం అంటూ ఆ సుబ్బారావుకు మా వేలు విడిచిన పెద తాతగారి కొడుకు కూతుర్నిచ్చి పెళ్లి చేశారా"


"అంత సాగదీయక పోతే మా అన్న కూతురిని అని ఏడవరాదూ... వేలు విరవడాలు, కాళ్ళు విరగొట్టడాలు ఎందుకో"


"ఆ అంటారు అంటారు మేము విరగొట్టే వాళ్ళమున్నూ, మీరు అతికించే వాళ్ళు. ఆ బడుద్దాయి మూడు నెలలు తిరక్కుండానే ఇంకో దాన్ని మరిగి మా చిట్టితల్లిని పుట్టింటికి తరిమేశాడు. ఇప్పుడెళ్లి అతికించండి ఆ అతికించేదేదో"


"ఏమిటే నువ్వూ నీ తింగరి మాటలున్నూ. అమ్మాయిలంటే ఆమడ దూరం పరిగెత్తే మా వాడు , 


ఏక పత్నీ వ్రతాన్ని నియమంగా పెట్టుకుని ఇంత నోరున్న నీతో ఏగే సత్తా ఉన్న ఈ బాబాయ్ కి స్వయానా తాత అన్నగారి కొడుక్కి కొడుకు అలా చేయడమే....


అసంభవం...."" ""ఖలుక్... ఖలుక్..." కొంచెం ఆవేశంలో అరిచానేమో వెధవ దగ్గు పొడుచుకొచ్చింది గొంతులోంచి.....


" అయ్యో రామా ఎందుకో అంత ఆవేశం. ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్లి ఆ ఏ.ప.వ్ర. ప్రబుద్ధుడిని దులిపి రండి ఎందుకు ఆ పాడు పని చేసి బంగారం లాంటి పెళ్ళాన్ని తరిమేశాడో గట్టిగా అడిగి తేల్చుకు రండి. మీవల్ల కాదంటే నేను దిగుతాను రంగంలోకి. అసలే నాది పెద్ద నోరు"


"ఆ మాకు తెలుసు లేవోయ్ నువ్వూ, నీ నోరు కథలు. అసలు ఏం జరిగిందో చెప్పి చావు"


"చావూ , గీవూ అన్నారో....

చెప్పేది విని ఏడవండి...."


"ఏడుపూ, గీడుపూ అన్నావో...

చెప్పి తగలడు...."


"తగలడూ, గిగ....

ఛీ...ఛీ వెధవ సంత అని మీ రోగం నాకూ వచ్చింది. 


చెప్పేది వినండి బుద్దిగా...


కొత్తగా పెళ్ళైన పిల్ల....


ఆశగా దగ్గరికొస్తే అటు తిరిగి పడుకుంటాడట....


బైక్ మీద షికార్లు అంటే బైక్ వదిలి ఆఫీస్ కూ ఆటోలో వెళ్లిపోతాదంట....


కూర్చుని కబుర్లూ లేవు, కాకరకాయలు లేవు.....


ఒకటే చిరాకు పరాకుగా ఉంటూ విసుక్కోవడం ఎక్కువ అయ్యిందట...."


"ఏమిటీ??


అమ్మాయి కాపురానికి వచ్చి నిండా పది రోజులు కాలేదు. వెధవకు అప్పుడే తెలిసిపోయిందీ....

ఆడవాళ్ళతో ఎలా ఉండాలో...."


"ఓహో ఇవన్నీ మీరు గానీ నేర్పించారా ఏమిటి...."


"రామ రామ....


సరే ఉండు నే వెళ్లి కనుక్కుని వస్తాను"


"అవసరం అంటే ఓ మిస్డ్ కాల్ కొట్టండి వాలిపోతాను. పిచ్చి పిల్ల నాతోనూ చెప్పుకోలేక ఊరికి వెళ్ళిపోయి అక్కడనుంచీ ఫోన్ కొట్టింది. అదే ఇక్కడుండి చేసుంటేనా...."


"వద్దు లేవోయ్....


నేను కనుకుంటాను అన్నానుగా ఇంకా ఆవేశం చాలించు"


      *  *  *


"సుబ్బారావు... సుబ్బారావు"

అన్న నా పిలుపులకు ఉలిక్కిపడి లుంగీ పైకి ఎగ్గట్టి పచార్లు చేస్తున్న మా సుబ్బారావు ఒక్క ఉదుటున వచ్చి 


" బాబాయ్.... చూశారా ఎంత ఘోరం జరిగిపోయిందో. 


ఆ సావిత్రి సతీ సావిత్రి కన్నా తక్కువ కాదని నాకు ఇచ్చి పెళ్లి చేశారా?


కాపురానికి వచ్చిన పది రోజుల్లోనే పుట్టింటికి టపా కట్టేసింది. నన్ను అన్యాయం చేసేసింది బాబాయ్...." అంటూ భుజాలపై పడి ఒకటే ఏడుపు


"అసలు ఏమి జరిగిందోయ్ సుబ్బారావు . నువ్వన్నా వివరంగా చెప్పు"


" మీరేల నాకు ఎండాకాలములో పెళ్లి చేయవలె...

చేసితిరి పో

నేనేల అత్తగారింట్లో మొహమాటానికి పోవలే...

పోయితిని పో...

ఏల అక్కడ వారు బలవంతము పెట్టితిరని డజన్లు డజన్లు మామిడి పండ్లు తినవలె...

తినితిని పో....

ఏల నాకా...." అంటూ నోట్లో టవలు ముక్క కుక్కుకుని కుళ్లి కుళ్లి ఏడవడం మొదలుపెట్టాడు


" ఏమిటి సుబ్బారావు ఈ గ్రాంధిక గోల. నీకేమయ్యింది ఇప్పుడు. సరిగ్గా చెప్పి ఏడువు"


"అదే బాబాయ్....


ఆ సెగ గడ్డ వచ్చి చచ్చింది.....


అదీ ఎవరికీ చెప్పుకోలేని విధంగా పీఠ స్థానాన తిష్ట వేసింది.....


కూర్చోలేక.... పడుకోలేక.... నానా అవస్థలూ పడుతూ కూడా పాపం కొత్తగా కాపురానికి వచ్చింది కదా ఎందుకు తనతో సేవలు చేయించుకోవడం అని నేను మంచికి పోతే....


నా గతి ఇలా తిరగబడింది బాబాయ్... తిరగబడింది"


నాకు ఓ పక్క సుబ్బారావు అవస్థతో నవ్వు వస్తోంది. 


నవ్వితే అసలే బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు ఉంటుందని ఆపుకుని వింటూ కూర్చున్నాను...


మళ్లీ మా సుబ్బారావు...


"బైక్ ఎక్కి తోలలేక ఆటో కి వెళితే వాడేమో అలివిమాలిన స్పీడుతో గడ్డ చితికేలాగ సందులు గొందులు తిప్పి పడేసి కుదేసి తీసుకుపొయ్యి వదిలాడు ఆఫీసు ముందు....


మండుతున్న గడ్డ నొప్పిని ఓర్చుకుంటూ పని చేస్తుంటే...

మా ఆఫీసర్ గాడు

'సుబ్బారావు ఏంటి సెగ...సెగ...సెగ... అంటూ రామకోటి రాసినట్టు సెగ కోటి రాసి మెయిల్ పెట్టావ్' అని భీకర అరుపులు....


అసలే పెళ్లికి వాడేసిన సెలవుల్లో మిగిలిన మూడో నాలుగో సెలవుల్లోంచి ఆ అర్థపూట అడుక్కుని, మా చండశాసనుడిని బతిమాలి , బామాలి మళ్లీ ఆటో ఎక్కితే ఎక్కడ ఆ మిగిలిన గడ్డనూ చితక్కొడతాడో అని భయపడి ఇరవై కిలోమీటర్లు నడచి సాయంత్రానికి ఇంటికి చేరగానే బయటే క్రికెట్టు ఆడుతున్న మా వీధి పిల్ల పిశాచాలు సరిగ్గా బాలుని అదేదో స్టంప్స్ కేసి కొట్టినట్టు నా గుడ్డకేసి కొట్టారు చూడు బాబాయ్" 

పాపం వాడి ముఖం ఇప్పుడూ ఆ బాధతో ఎర్రబడి పోయింది.


ఒక్కసారిగా నాకు నవ్వు స్థానంలో జాలి వచ్చేసింది


మళ్లీ మొదలెట్టాడు


"అప్పటికే పీలగా మారిన గొంతుతో వాళ్ళని అరచి ఇంట్లోకి దూరి సరాసరి బాత్రూమ్ లోకి అడుగెట్టి చల్లటి నీళ్లతో కాస్త నొప్పిని, మంటని ఆర్చుకుందామని మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుంటే అవి అప్పుడే సావిత్రి స్నానానికి తిప్పుకున్న వేడి నీళ్ళని తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఆఫీసునుంచీ నేనెప్పుడు వచ్చానో, సరాసరి బాత్రూమ్ లో ఎందుకు దూరానో, అంతలా గావుకేక ఎందుకు పెట్టానో అర్థం కాక బాత్రూమ్ బయట కంగారుగా చూస్తున్న సావిత్రిని ఏం తిట్టానో, ఎందుకు తిట్టానో కూడా అర్థం కాక బిక్క చూపులు చూస్తూ ఏడుపు లంఖించుకుంది"


"మా నాన్న తీసిచ్చిన బైక్ నచ్చలేదు....

ఆఫీస్ కు ఆటోలో వెళుతున్నారు....


నాతో సరదాగా మాట్లాడరు....

కలసి కూర్చుని భోజనం చెయ్యరు....


ఇంకా రాత్రి పూట మూడంకె వేసుకుని... అలా బోర్లా పడుకుని నేను ఉన్నా లేనట్టే మసలుతారు...


ఇప్పుడేమో ఉన్నట్టుండి ఆఫీస్ నుంచీ ఊడిపడి...

బాత్రూమ్ లో దూరి...అనుమాన పిశాచిలా వాసన చూసి పైగా నన్నే తిడుతారు....


ఇక మీతో నా వల్ల కాదు....." అంటూ సావిత్రి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది బాబాయ్..... అంటూ మళ్లీ భోరుమన్నాడు....


మంచికి పోతే చెడు ఎదురైనట్టు వుందే అనుకుంటూ...

సేవ చేయించుకోక పోతే పోయావ్ అమ్మాయికి విషయం అన్నా చెప్పి ఉండాల్సింది అన్నాను....


"సిగ్గేసింది బాబాయ్....


కొత్తగా పెళ్లి అయ్యే....

పైగా ఇంతకు మునుపు ఏ అమ్మాయితోనూ ఇంత చనువుగా ఉన్నది లేదాయే.....


అదీ ఆ మాయదారి సెగగడ్డ చెప్పుకోలేని చోట ఆ రెండు పిరుదుల మధ్యన పీఠస్థానాన లేచేసరికి సిగ్గుతో చెప్పలేక పోయాను" అంటూ తెగ మెలికలు తిరుగాడు మా సుబ్బిగాడు


"ఏడ్చినట్టే ఉంది నీ సిగ్గు....


ఇప్పుడు ఆ సిగ్గే చితికి నీ కాపురాన కుంపట్లు పెట్టింది.....


అగోరించింది చాలు కానీ.... నేనూ, మీ పిన్నీ అమ్మాయికి విషయం చెప్పి తీసుకు వస్తాము....


ఇక ఈ సిగ్గుల్ని, చింతకాయల్ని కట్టిపెట్టి....

బిడ్డనిచ్చే పని చూడు" అంటూ లేచాను కూర్చున్న చోటు నుంచీ....


పాపం మావాడి ముఖం లో ఇంకా దిగులూ, బాధ, నొప్పి, మంటా అన్నీ కలగలిసి కాపురం చేస్తుంటే....

రేపే అమ్మాయిని తీసుకువచ్చేయాలని గాఢంగా అనుకుని ఇల్లు చేరాను.....


నా రాక కోసం నిరీక్షిస్తున్న నా శ్రీమతిని చూస్తూ వికటాట్టహాసం లాంటి వెకిలి నవ్వు నవ్వుతూ...


"ఏమోయ్ మన సుబ్బారావు ఎవరినీ తగులుకోలేదు....

సుబ్బారావు నే ఒకటి తగులుకుంది..."అన్నాను


"చెప్పలేదు.... నే చెప్పలేదు....


అయినా ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకోవడానికి.....


అదెవరో చెప్పండి కాళ్ళు రెండూ విరగొట్టేసి వస్తాను..." అంటూ కొంగు దోపుకుంటున్న నా కాంతాన్ని చూస్తే ముచ్చటేస్తున్నా....

ఇంకా ఎక్కువ బీపీ పెంచడం ఎందుకని


"మన సుబ్బారావు పీఠస్థానాన్ని సెగగడ్డ తగులుకుందోయ్" అంటూ పట్టరాని నవ్వుని నవ్వుతూ సుబ్బారావు అవస్థ మొత్తం చెప్పేసరికి పాపం శ్రీమతికీ జాలి వేసినట్టుంది కాబోలు


" ఏంటీ సుబ్బారావు కు సెగగడ్డ లేచిందీ" అంటూ మళ్లీ ఆరునొక్క రాగాన్ని అందుకుంది......


సుధామురళి


Rate this content
Log in

Similar telugu story from Comedy