murali sudha

Comedy

4  

murali sudha

Comedy

ఆంగ్లార్చన

ఆంగ్లార్చన

3 mins
332



కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే


ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 


ఇలా ఉదయపు సమయం ఆహ్లాదంగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఈ రోజు...


కౌసల్, సుప్రజ్,రామ్ ఎర్లీ మార్నింగ్ గెట్ అప్పూ...


అంటూ పాడుతున్న అమ్మ గొంతుతో నిద్ర లేచింది సౌమ్య

" అమ్మా ఏంటిది? ఉదయాన్నే సుప్రభాతం పాడుకునే నువ్వు ఇలా ఏదో ఇంగ్లీష్ రైమ్ నేర్చుకుంటున్నావు"


"స్టాపు... స్టాపన్నానా.. డోంటు కాలు అమ్మా... కాలు మమ్మీ" 

"కాలూ లేదు చెయ్యీ లేదు కానీ ఏంటీ గోల అసలు"


"థిస్సు ఈజ్ నాట్ గోలా, ఇంగ్లీషు లెర్నింగూ"


"అర్థం అయ్యింది కానీ అంత అర్జంట్ గా ఇప్పుడు ఏమి అవసరం వచ్చిందా అని"


"U ఫస్టు గో టూ బాతూ, తర్వాత టెల్ తానూ"


అంటూ పక్క మీద వున్న సౌమ్యాని ఒక్కతోపు తోసింది సౌమ్య తల్లి అయిన అర్చన.


ఈ అమ్మకు ఈరోజు ఏ పిచ్చో పట్టినట్టుంది , అయినా అమావాస్య టైం కూడా కాదే అనుకుంటూ, అయోమయంగా అమ్మనే చూస్తూ బాత్రూమ్ లోకి దూరిపోయింది సౌమ్య.


ఈలోగా పనిమనిషి వచ్చిందా రాలేదా అని వాకిటిలోకి చూస్తూ, ఇంకా రాని పనిమనిషిని తిట్టుకుంటూ...


"వర్క్ పర్సన్ , నో కమ్ము... వెన్ కమ్మూ... టూ స్కోల్డ్ ఇంగు" అంటూ గొణుగుతున్న అమ్మ మాటలకు స్వప్నకు అక్కడే మూర్చవచ్చి పడిపోబోయింది..


ఈలోగా పనిమనిషి రాములమ్మను చూసిన అర్చన

" అరె రాము మథర్... వై యు లేటు కమింగ్.. సో వర్క్ స్టాప్పింగ్..ఐ విల్ కట్ యు మనీ" అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే పాపం రాములమ్మకు ఏమీ అర్థం కాక 

"ఈ అర్చనమ్మ రోజూ నోటారా రాములమ్మా! అని పిలిచేది. ఇయ్యాల ఈయమ్మకు ఏటైనాదబ్బా. ఏదన్నా పిచ్చి కుక్క గానీ కరవలేందు కదా" అని తేరిపారా అర్చనమ్మనే చూస్తూ ఉండి పోయింది.


ఇదేమీ పట్టని అర్చన మరలా

" గో, గోయి వాఁష్ వాకిల్స్. థెన్ కమ్మూ. ఐ గివ్వు టీ"

అనేసరికి అస్సలు అర్థం కాక తలగోక్కుంటూ ఏదో అయ్యింది అయ్యగారినో, సౌమ్యమ్మ గారినో అడగాలి అనుకుంటూ రాములమ్మ చీపురు తీసుకుని వాకిలి ఊడవడానికి వెళ్ళిపోయింది.


ఈలోగా నిద్ర లేచిన ప్రసాదరావు అర్చన మాటలను విచిత్రంగా వింటూ బ్రష్ తీసుకుని వంటిట్లోకి వచ్చేశాడు ఏమి జరుగుతుందో అర్థం కాక.

అది చూసిన అర్చన మళ్లీ ఉగ్ర అవతారం ఎత్తి

"వాటు ఈజ్ థిస్సు హస్బెండు. వై యు టేక్ బ్రష్ కమ్ము ఇన్ సైడింగ్ కిచెన్. గో ... గోయి వాఁష్ ఫేస్ థెన్ కమ్మూ" అనగానే అదే అయోమయంతో ఒకటే పరుగు తీసుకుని

 " అయ్య బాబోయ్ నా భార్యకు ఏదో అయిపోయింది. తిక్కతిక్కగా మాట్లాడుతోంది. వెంటనే డాక్టర్ దగ్గరికో లేకుంటే ఏ భూత వైద్యుడి దగ్గరికో తీసుకెళ్లాలి. లేదంటే నా అర్చన నాకు దక్కదు" అనుకుంటూ గబగబా ముఖంమీద ఇన్ని నీళ్లు పోసుకుని, నోటిని ఇన్ని నీళ్లతో పుక్కిలిచ్చి వాయు వేగంతో మళ్లీ ఇంట్లోకి వచ్చాడు.


పాపం ఇవేవీ పట్టని అర్చన

"డ్రీమింటి , డ్రీమింటి... నౌ సచ్ డ్రీమింటి" అని పాడుకుంటూ హుషారుగా టీ తయారుచేస్తోంది.


ప్రసాద్ రావు అర్చనను పట్టుకుని కుదిపేస్తూ

" అర్చనా! అర్చనా! ఏమయ్యింది నీకు. ఎందుకు ఇలా పిచ్చి, పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావ్. చెప్పు అర్చనా చెప్పు. లేదంటే పద డాక్టర్ దగ్గరికి వెళదాం" అంటూ ఆందోళన పడుతున్న తన భర్తను చూస్తూ అర్చన

"వాటు హజ్బండూ. ఐ గుడ్డూ. నొథింగ్ హాపెండూ. డ్రింక్ టీ ఫస్టు" అనగానే ప్రసాదరావు ఒక్కసారిగా ఏడుపు లంఖించుకున్నాడు.

" అయ్యో! దేవుడా ఏమయ్యింది నా అర్చనకు. ఉదయాన్నే శుభ్రంగా వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, అన్నమయ్య కీర్తనలు పాడుతూ వంట చేసుకుంటూ లక్షణంగా నన్నూ పిల్లల్నీ స్కూల్ కి పంపించి ఏ సీరియల్ నో చూస్తూ కాలం గడిపే నా సతికి ఈ రోజు ఏమయ్యింది" అంటూ బిగ్గరగా మాట్లాడుతున్న ప్రసాదరావు అరుపులకి భయపడి ఒక్క ఉదుటున సౌమ్య, రాములమ్మ కూడా ఇంట్లోకి వచ్చేశారు.

" అవును డాడీ ఉదయాన నుంచి అమ్మ ఎందుకో తేడాగా మాట్లాడుతోంది, సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లోనే చదువుతోంది"


"అవునయ్యగారూ అమ్మగారు నాతోకూడా అట్టాగే మాటాడారు... ఏటో రామూ మథర్... రామూ మథర్

అన్యారు, నాకైతే ఏమీ బోధ పడలా"


ఇలా ఈ చర్చ జరుగుతుండంగానే ఐదింటికే ట్యూషన్ కి వెళ్లిన మన బుజ్జిగాడు అలియాస్ శిశిర్

అర్చన, ప్రసాద్ రావు ల ముద్దుల సుపుత్రుడు వచ్చేశాడు.

వస్తూ వస్తూనే

"మమ్మీ, గివ్ మి మిల్క్. ఐ వాంట్ టు గో టు బాత్" అంటూ హడావుడి పెట్టేశాడు.


ప్రసాదరావు బుజ్జిగాడితో

" రేయ్ నాన్నా బుజ్జి అమ్మకు ఏమీ బాగోలేదురా. ఉదయం నుంచీ ఏదో తిక్కతిక్కగా మాట్లాడుతోంది"


"వ్వాట్ డాడీ.. వ్వాట్ హ్యాపెండ్...మార్నింగ్ షి ఈజ్ ఫైన్ నో"


సౌమ్యా వెంటనే


"ఓరి బుజ్జిగా కాస్త ఆ ఇంగ్లీష్ కట్టిపెట్టారా బాబూ, వినలేక చచ్చిపోతున్నాము. ముందు అమ్మకి ఏమయ్యిందో చూద్దాము"


" అవునా!! ఉదయం నేను వెళ్ళేటప్పుడు బాగానే వుందే. పైగా నేను చెప్పిన విషయాలు అన్నీ విని ఆచరిస్తానని చెప్పిందే? నేర్చుకుంటానని కూడా మాట ఇచ్చిందే"


"ఏమి నేర్చుకుంటానని, ఏమి ఆచరిస్తానని చెప్పిందిరా బుజ్జీ"


" అదే డాడీ నిన్న న్యూస్ లో చెప్పారు కదా స్కూల్స్ లో ఇక తెలుగు మీడియం ఉండదని అంతా ఇంగ్లీష్ మీడియం నేననీ"


" ఆ, అయితే"


" దానికని అమ్మను ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను. ఇక మీదట ఇంట్లో కూడా ఇంగ్లీష్ నే మాట్లాడాలి. లేదంటే నాకు స్కూల్ లో కష్టం అవుతుంది అన్నాను. అమ్మకూడా సరే నాన్నా నీకోసం నేర్చుకుంటానని మాట ఇచ్చిందే!!" 


"ఓరి, బడవాయ్ ఇదంతా నీ పుణ్యమేనటరా. ఆ ఇంగ్లీష్ గోలని అక్కడే కప్పిపెట్టు నాయనా. లక్షణంగా ఇంట్లో తెలుగులో ప్రేమగా మాట్లాడుకుందాం. మన ప్రేమ స్వచ్చంగా తెలియాలంటే మన అమ్మ భాషే మంచిదిరా. అతికిచ్చుకున్నట్టు ఉండకూడదు"


ఇదంతా చూస్తూ లోపల, లోపల నవ్వుకుంటున్న అర్చన ఇక వుండబట్టలేక

" బుజ్జీ ఇది నీకు ఉదయమే చెప్పేదాన్ని. కానీ అప్పుడు నేను చెప్తే నీకు పూర్తిగా అర్థం కాదు. అందుకే నేనూ ప్రయత్నించాను.

చూడు నాన్నా! మాతృభాషను గౌరవించుకుంటూ, ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇబ్బంది ఉండదు. అలా కాక తల్లిభాషను పక్కన పెడితే ఇంకే భాషా తలకు ఎక్కదు. అర్థమయ్యిందా"


"ఓ కె మమ్మీ... గాట్ ఇట్.."


" అదిగో బడవాయ్.. మళ్లీ ఇంట్లో ఇంగ్లీష్"


" తమాషాకు అన్నానులే... ఇంట్లో మాత్రం స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుకుందాం... ఓ కె... కాదు కాదు సరేనా"


" అదీ అల్లరి పిడుగా... రా! ఈ పాలు తాగు"


"ఒమ్మగారూ.. ఎంత అడావుడి పెట్టేసినారండీ... నాకూ తల నోప్పోచ్చేసినాది.. ఇన్ని టీ నీళ్లు పోయండీ"


"ok రామూ మథర్ వెయిట్..." అనగానే మళ్ళీ అందరూ అవ్వాక్కు అవ్వడం.. ఇంతలోనే కిలకిలా నవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.


సుధామురళి


Rate this content
Log in

Similar telugu story from Comedy