SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

"శ్రీ కృష్ణ మహా భారతం - 2"

"శ్రీ కృష్ణ మహా భారతం - 2"

5 mins
386


"శ్రీ కృష్ణ మహా భారతం - 1" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 2"

గంగా దేవి అలా శాంత మహారాజుని వదిలి వెళ్ళిపోయాక...

కొంతకాలానికి అతడు ఒక మత్స్యకారుని కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు సత్యవతి.

సత్యవతి ఎంతటి పట్టుదల గల మనిషంటే,

ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన...

సత్యవతి, శాంత మహారాజు ప్రేమలో మునిగి తేలుతూ ఒకరోజు నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు.

శాంత మహారాజు తన రాజ్యంలో తనకి ఎదురవుతున్న కష్టాల గురించి, పక్కనే ఉంటూ కుయుక్తులు పన్నుతున్న సన్నిహితులు గురించి, వాటి వల్ల తనకి కలుగుతున్న అనేకానేక ఒత్తిళ్ల గురించి ప్రస్తావిస్తూ...

వీటన్నింటికీ ఉపశమనం

ఆమె దగ్గర దొరుకుతున్న ప్రేమ మాత్రమేనని తనకి వివరిస్తూ ఆమె ప్రేమ పారవశ్యంలో మునిగితేలుతున్నాడు.

ఇంతలో ఒక పెద్ద భారీ మత్స్యం ఆమె కంట పడింది. దానిని ఎలా అయినా పొందాలని ఆ మత్స్యానికి గాలం వేసింది.

కానీ, అది చాలా బలంగా ఉండడం పైగా సత్యవతి బలం సరిపోక తిరిగి ఆ మత్స్యమే ఆమెను, ఆమెతో పాటు ఆ పడవను, శాంతను మహారాజుని నీళ్లలోకి లాగసాగింది. దీంతో ఒక్కసారిగా భీతిల్లిన మహారాజు ఆ మత్స్యాన్ని విడిచి పెట్టాల్సిందిగా ఆమెను హెచ్చరించాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆమె బలాన్ని మరింత ఉపయోగించి ఆ మత్స్యాన్ని లాగసాగింది. అయినా తన బలం సరిపోకపోవడంతో శాంతను మహారాజు ఆమెకు సాయం చేయదలచి ఆమెకు సహకరించబోతుంటే, అందుకూ ఆమె నిరాకరించింది. చివరికి ఆమె ఒక్కత్తిగా ఆ మత్స్యాన్ని చెరబట్టింది.

బయటకి వచ్చాకా...

మహారాజు, సత్యవతి కందిన చేతులను చూస్తూ "నీకెందుకు ఈ కష్టం సత్యవతి, మన సైనికులను పంపించి ఆ మత్స్యాన్ని పట్టించేవాల్లం కదా!" అని అంటుంటే,

"ఒకసారి ఆశపడిన దాన్ని ఎంతటి కష్టమైనా సాధించాలి మహారాజా! అది మీవంటి మహారాజుకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా" అంటూ బదులిస్తుంది.

అంతటి పట్టుదల గలది ఆ సత్యవతి.

(ఇక్కడే మనం కూడా ఒకటి గ్రహించాలి. లక్ష్యం ఏదైనా, ఆ లక్ష్యం చేరే దారిలో ఆటుపోట్లు ఎదురువుతున్నాయని మన ప్రయత్నం మధ్యలోనే వదిలేయకూడదు. కడవరకూ పోరాడితేనే కదా విజయం వరిస్తుందో లేదో తెలిసేది. అది జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యాలైనా లేక, లక్ష్యంగా మార్చుకున్న జీవితమైనా)

ఇది ఇలా ఉండగా...

ఒక రోజు హస్తినాపురం రాజ్యానికి చెందిన ఒక గ్రామంలో రాక్షస జాతికి చెందిన కొంతమంది దుండగులు చొరబడ్డారు.

ఆ రాక్షస జాతి హెళా. వారు అక్కడున్న ప్రజలను కొడుతూ, వారి ఇళ్ళను, పంటలను అకారణంగా తగులబెడుతున్నారు వారు.

మహారాణి లేకపోవడంతో రాజ్యంలో యాగాలు జరగక, దేవుళ్ళు ఈ రాజ్యాన్ని శపించారని. అందుకే,శాపగ్రస్తమైన ఈ రాజ్యం లో ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ప్రజలు శోకిస్తున్నారు. ఈ రాజ్యాన్ని రక్షించే వారు లేరా అంటూ వేడుకుటుంటే,

అప్పుడే ఆ రాక్షస జాతిని ఎదిరించడానికి ఒక బలశాలి, బుద్ధిశాలి అయిన చక్కటి శరీర సౌష్ఠవం కలిగిన ఒక యోధుడు (చూడడానికి అతడొక క్షత్రియ వంశానికి చెందిన వాడిగా ఉన్నాడు) ఎదురొడ్డి నిలిచి వాళ్ళని, వాళ్ల ఆకృత్యాలను అడ్డుకున్నాడు.

దానికి ఆ దుండగులు లొంగిపోయి, తాము పక్కనే ఉన్న ఒక అరణ్య జాతికి చెందిన వారమని, ఈ గ్రామ ప్రజలు ఆ అరణ్యంలోనున్న చెట్లను తరచూ కొట్టేయడం వల్ల, తమకు ఆవాసం కరువయ్యి, ఈ గ్రామం మీద పడ్డామని వాళ్ళు బదులిచ్చారు.

(ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ...

జంతువులకు నివాసయోగ్యమైన ఇప్పుడున్న అడవులను నరకడం వల్ల కూడా భవిష్యత్తులో అవి జనారణ్యంలో కి వచ్చి, అవి మన మీదే దాడి చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు గ్లోబల్ వార్మింగ్ కు మనమే పరోక్ష కారణం అవుతున్నాము. పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!)

వాళ్ల గోడును అర్థం చేసుకున్న ఆ క్షత్రియ యోధుడు వాళ్ళని క్షమించి వదిలేయబోతుంటే, అప్పుడే తన సైన్యంతో అక్కడికి చేరుకున్న ఆ హస్తినాపుర మహారాజు శాంతను ఆ దుండగులను దండించే ప్రయత్నం చేశాడు.

కానీ, దానికి ఆ యోధుడు అడ్డుగా నిలిచి ఆ దుండగులకు జరిగిన అన్యాయాన్ని వివరించి, వారు శరణు కోరారని, విడిచిపెట్టాలని వారిని ఆ రాజు నుండి రక్షించే ప్రయత్నం చేశాడు.

కానీ, శాంతను రాజు

"నాకు చెప్పేటంత యోధుడువా నువ్వు!

నువ్వెంత నీ శక్తి ఎంత?" అంటూ ఆ యోధుడు అభ్యర్థనకు తిరస్కరించడమే కాకుండా వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకోమంటూ ఆ యోధుడితో కయ్యానికి దిగాడు.

దీంతో ఆ యోధుడు తన శక్తితో పక్కనే ఉన్న నదిలోని నీటిని స్తంభింప చేసి, చీలిన గంగా నది మీదుగా వాళ్ళని రక్షిస్తాననీ చెప్పాడు. తను చెప్పినట్టుగానే తన బాణములను నదిలోకి వదిలి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాడు.

"గంగా నదిని ఆపడం ఎవరితరం కాదు కదా!

అలాంటిది ఇతనికెలా సాధ్యం" అని అనుకుంటూ ఆ యోధుడు సాహసాలకు ఆశ్చర్యపోయిన ఆ మహారాజు నీవెవరు అని అడిగే లోపు...

ఆ నది లో నుండి ఒకావిడ ప్రత్యక్షమయ్యింది. ఆవిడ ఎవరో కాదు...

శాంతాను మహారాజుని ఒకప్పుడు వదిలేసి వెళ్లిపోయిన

గంగా దేవి.

ఆమె రాజుతో ఇలా అంది.

"ఓ శాంతను మహారాజా!

ఈ యోధుడు ఎవరో కాదు దేవవ్రతుడు. మనిద్దరికీ పుట్టిన ఎనిమిదోవ సంతానం. ఆ రోజు నీ మాట ప్రకారం ఇతన్ని చంపకుండా నావెంట తీసుకెళ్ళి , పెంచి, పెద్ద చేసి ఇంతటి వీరున్ని చేసి, నీ వద్దకు ఇప్పుడు చేర్చాను. ఇతడు పరశురాముడు దగ్గర యుద్ద విద్యను, వశిష్టుడి దగ్గర చదువును అభ్యసించాడు." అంటూ ఆమె మాయమవుతుంది.

శాంతను మహారాజు ఆనందానికి అవధుల్లేవు. తనకు, తన రాజ్యానికి వారసుడు దొరికాడని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. దేవవృతడను తన కుమారుడిగా స్వీకరిస్తాడు.

అదే విషయం వెళ్లి చాలా సంతోషంగా సత్యవతికి చెప్తాడు. తన రాజ్యానికి యువరాజు దొరికాడనీ, తనకు ఒక వారసుడు దొరికాడనీ....

సత్యవతి మొహంలో మాత్రం అప్పటివరకూ ఉన్న ఆనందం మాయమై ఒకింత నిరాశ అలుముకుంది.

అది గమనించిన మహారాజు

ఏమైందని అడగగా...

మరేం లేదు మహారాజా!

"హస్తినా పురానికి ఎలాగో యువరాజు దొరికాడు కాబట్టి, ఆ రాజ్యాన్ని తనకి వదిలిపెట్టి, మీరు చేపలు పడుతుంటే నేను ఆ చేపలు అమ్ముకుంటూ ఇక్కడే జీవనం సాగిద్ధాం!" అంటూ అతనితో అంటుంది.

దానికి రాజు...

"ఏం మాట్లాడుతున్నావ్ సత్యవతి. నేనొక రాజుని. చేపలు పడుతూ ఇక్కడ నివసించడమా?

అది అసంభవం..!

నువ్వొక మహారాణిగా, నేనొక మహారాజుగా మన రాజ్యంలోనే హాయిగా ఉండొచ్చు." అంటాడు.

దానికి సత్యవతి

"మహారాణి అంటే పాలించే రాజు తల్లి కదా మహారాజా?

దేవవృతడుకు నేనొక సవతి తల్లిని, నాకు పుట్టబోయే బిడ్డలు, వాళ్ల వారసులు అంతా అక్కడ మేము ఒక దాసుల్లా జీవితాంతం బ్రతకాలి. అదే ఇక్కడైతే నేనొక మహారాణిలా బ్రతకొచ్చు" అంటూ తను ఎప్పటికీ ఆ రాజ్యానికి రాణిని కాలేనన్నన్న బాధను పరోక్షంగా బయట పెడుతుంది.

ఇక రాజు చేసేదేం లేక, ఆమె అభ్యర్థనను తిరస్కరించి, తన ప్రేమను మరిచిపోమనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

(ఒక చిన్న దురాశ ఎంతటి బందాన్నైన బలిచేస్తుంది.)

కొద్ది రోజుల్లోనే శాంతను మహారాజు, తన పుత్రుడైన దేవవృతుడకి పట్టాభిషేకం చేస్తాడు.

కానీ, రాజులో మాత్రం సత్యవతిని కోల్పోయాననే దిగులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

రోజులు గడుస్తున్నా...

తండ్రి మనోవేదన మాత్రం తగ్గడం లేదు. దానికి గల కారణం ఏమిటోనని దేవవృతుడు తెలుసుకునే ప్రయత్నం చేయగా...

అది చెప్పడానికి శాంతను మహారాజు నిరాకరించాడు.

చివరికి సత్యవతే తన తండ్రి మనోవేదనకు కారణమని తెలుసుకున్న దేవవృతుడు, తండ్రి కోరిక తీర్చడం తన ధర్మంగా భావించి సత్యవతి దగ్గరకు పయనమయ్యాడు.

తన తండ్రిని పెళ్లి చేసుకోమని సత్యవతిని దేవవృతుడు కోరగా...

దేవవృతడుకి కూడా తన తండ్రికి చెప్పిన సమాధానమే చెప్పింది సత్యవతి. సత్యవతి తండ్రిని కూడా కలిసి, ఈ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని తన తండ్రి సంతోషం కోసం త్యజించడానికి సిద్ధమంటూ, సత్యవతి కి పుట్టబోయే పిల్లలే ఈ రాజ్యానికి వారసులుగా ఉంటారని వాళ్ళకి మాటిస్తూ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయగా ..

దానికి సత్యవతి తండ్రి...

"ఇప్పుడు కాకపోయినా...

రేపు భవిష్యత్తులో నీ పిల్లలకు రాజ్య కాంక్ష పుట్టొచ్చు. అప్పుడు నా కుమార్తె, వారి సంతానం పరిస్థితి ఏంటి యువరాజ?" అంటూ దేవవృతడను ప్రశ్నించగానే

పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లిన దేవవృతుడు ...

తన తల్లి గంగా దేవి సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేశాడు.

ఆ ప్రతిజ్ఞ...

భూమి ఆకాశాలను కంపింప చేసింది.

ఆ ప్రతిజ్ఞ...

భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది.

ఆ ప్రతిజ్ఞ...

భూమి మీదకి దేవుళ్ళను దించింది.

ఆ ప్రతిజ్ఞ...

భూమ్మీద దేవుళ్ళు లేకుండా కూడా చేసింది.

ఆ ప్రతిజ్ఞ...

మహా భారతం అనే కావ్యం ఒక అద్భుత కావ్యమయ్యేలా చేసింది.

ఆ ప్రతిజ్ఞ...

కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది.

అదే,

"దేవవృతుడు అనే నేను ఈ ముల్లోకాల సాక్షిగా, ఆజన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని ప్రతిజ్ఞ చేశాడు.

అప్పుడే అక్కడికి చేరుకున్న దేవవృతుడి తండ్రి, శాంతను అతన్ని ఆ ప్రతిజ్ఞ చేయకుండా ఆపే ప్రయత్నం చేసినా అది విఫలమయ్యింది.

తన సంతోషం కోసం, ఆనందం కోసం కొడుకు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా శాంతను మహారాజు అతనికి ఒక వరం ప్రసాదించాడు.

అదే తను ఎప్పుడు, ఎవరితో, ఎక్కడైతే మృత్యువును కోరుకుంటాడో అప్పుడే, వారితోనే, అక్కడే తనకి మృత్యువు సంభవిస్తుందని...

అప్పటివరకూ తను మృత్యుంజుడయ్యి, చిరంజీవిలా వర్ధిల్లేలా ఒక వరం ప్రసాదించాడు.

దానితో పాటు తను చేసిన భీష్మ ప్రతిజ్ఞతో తన కీర్తి ప్రతిష్టలు సదా నెలకొని అతన్ని భీష్ముడు గా ఇక లోకం సంబోధిస్తుందని అతనికి ఒక బిరుదును ఇచ్చాడు.

ఇక నుండి దేవవృతుడు భీష్ముడు గా పిలువబడతాడు.

దేవవృతుడు చేసిన ఆ భీష్మ ప్రతిజ్ఞ వల్ల ఎలాంటి అనర్థాలు జరగబోతున్నాయి.

సత్యవతి - శాంతను పుట్టిన సంతానమే రాజ్యం ఏలబోతున్నారా?

భవిష్యత్తులో భీష్ముడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనబోతున్నాడు ?

లాంటి విషయాలన్నీ తర్వాత భాగం...

"శ్రీ కృష్ణ మహాభారతం - 3"

లో చూద్దాం.

"శ్రీ కృష్ణ మహాభారతం" కొనసాగుతుంది.

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics