SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ప్రేమ లేఖ - 2"

"ప్రేమ లేఖ - 2"

6 mins
451


(పాఠకులకు గమనిక: సాఫీగా సాగిపోయే ఈ కథలో అక్కడక్కడ కొంచెం సాగదీతలు ఉంటాయి. అవి మీకు విసుగు పుట్టించవచ్చు. కానీ, అవి లేకపోతే ఈ కథకు అర్థం లేదు. దయచేసి గమనించగలరు. చెప్పడం నా ధర్మం.)

కథ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నెమ్మదిగా చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు.

"ప్రేమ లేఖ - 1" కి

కొనసాగింపు...

"ప్రేమ లేఖ - 2"

అలా ఆ తర్వాత గవర్న్మెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో నిమగ్నమైన కావ్య... ఆ లెటర్ గురించి, ఆ సినిమా క్లైమెక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

సరిగా మూడు రోజుల తర్వాత,

"అమ్మా..!

పోస్ట్..!" అంటూ మళ్ళీ ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి, ఇంటివయట నుండి అరుస్తున్నాడు.

హాల్లో కూర్చుని చదువుకుంటున్న కావ్య చెవిన పడింది ఆ అరుపు. వెంటనే, మూడు రోజుల క్రితం జరిగిందంతా తనకి గుర్తుకువచ్చింది. ఆ రోజు నుండి ఈ ప్రిపరేషన్ లో పడి దాని గురించే మర్చిపోయింది కావ్య.

కూతురు శ్రద్ధగా చదువుకుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ సారి తనకి చెప్పకుండా తానే ఆ లెటర్ తీసుకుందామని వంటిట్లో నుండి వస్తున్న నాగలక్ష్మి ( కావ్య తల్లి) ని ఆపి,

"నేను తీసుకుంటానులే అమ్మా..!" అంటూ బయటకి పరుగులు తీసింది కావ్య ఆతృతగా.

అప్పటికే బోలెడంత పనితో సతమవుతున్న నాగలక్ష్మి, ఇక తనని ఏం అనలేక తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.

ఆ లెటర్ ని పోస్ట్ మ్యాన్ దగ్గర నుండి తీసుకున్న కావ్య, అది వచ్చిన చిరునామా మరియు పంపిన చిరునామాను గమనించగా...

సేమ్ అంతకముందు వచ్చిన లెటర్ లో ఉన్నట్టే,

"టు అడ్రస్ లో

లేఖ పేరు,

ఫ్రమ్ అడ్రస్ లో

ప్రేమ్ పేరు" వాటిని అలానే చూస్తూ కొంచెం ఆశ్చర్యంగా ఉండిపోయింది కావ్య.

"ఇక్కడ సంతకం పెట్టండమ్మా..!" అంటున్న ఆ పోస్ట్ మ్యాన్ మాటలతో తేరుకున్న కావ్య.

తను ఆ లెటర్ రిసీవ్ చేసుకున్నట్టు సంతకం పెడుతూనే,

"అసలీ లేఖ ఎవరు..?" అంటూ ఆ పోస్ట్ మ్యాన్ ని అడిగింది కావ్య.

"ఇంతకుముందు ఇక్కడే వుండేవాళ్ళు, మీరు రాకముందే వాళ్లు కాలి చేసి వెళ్ళిపోయారు." అంటూ బదులిచ్చాడు ఆతను.

మరి వాళ్లు ఏమయ్యారు...?

ఎక్కడున్నారు ..?

నీకేమైనా తెలుసా..?" అని కావ్య అడుగుతుంటే,

"అది తెలిస్తే, ఈ లెటర్స్ నేరుగా అక్కడికే తీసుకుని వెల్లేవాడిని కదమ్మా..!

మీకెందుకు ఇక్కడికి తెచ్చిస్తాను..?" అంటూ అతను దానికి బదులివ్వడంతో...

"అసలీ లెటర్స్ నువ్విక్కడకు ఎన్నాళ్లుగా చేరవేస్తున్నావు..?" అంటూ మరొక ప్రశ్నను అడిగింది కావ్య అతన్ని.

"ఈ ఊరికి నేనొచ్చి సంవత్సరం అయ్యింది. అప్పటినుండి నేనే ఆ అమ్మాయికి క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ లెటర్స్ ఇస్తున్నాను.

ఒకవేళ ఆ అమ్మాయి ఎప్పుడైనా ఈ లెటర్స్ గురించి రావొచ్చనే ఉద్దేశ్యంతో మీరు జాగ్రత్త పెడతారని మీకు అందజేస్తున్నాను.

పొరపాటున కూడా ఇవి పక్కన పడేయకండి" అంటూ అతను బదులిచ్చాడు.

"మరి ఈ ప్రేమ్ ఎవరు..?" అని కావ్య అతన్ని అడగగా,

"అవన్నీ నాకెలా తెలుస్తుయమ్మా..?

సరే, సరే.. టైం అవుతొంది, నాకు కొంచెం పనుంది ఇక వెళ్ళొస్తానమ్మా!" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ పోస్ట్ మ్యాన్.

పూర్తిగా కాకపోయినా, కొన్ని వివరాలైనా తెలిసాయన్న ఉద్దేశ్యంతో కావ్య ఆ లెటర్ ఓపెన్ చేసి, దాన్ని పట్టుకుని తదేకంగా అలానే చూస్తూనే అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెనుతిరిగింది.

అలా వెనుతిరుగుతూ ఆ లెటర్ ఓపెన్ చేయగా...

అందులో...

                            ❤️@@@@@❤️

"ప్రియమైన లేఖ గారికి,

ఈ ప్రేమ్ ప్రేమతో లేఖ కి రాస్తున్న ఈ లేఖలు ...!

అదేనండి నా ఈ ప్రేమ లేఖలు

అందకో...!

లేక, ఈ ప్రేమ్ మీద ఆ లేఖ గారికి ప్రేమ లేకో మరి..!

కొన్ని రోజులుగా.... నా ఈ హృదయ స్పందనకి మీ మనసిచ్చే ఆ ప్రతిస్పందన కరువై నా మనసు నిరాశతో నిండుకుంది.

నా ఉత్తరానికి, మీ ప్రత్త్యుత్తరం కొరకై ఆ పిచ్చి మనసు పాపం పరి పరి విధముల పరితపిస్తుంది.

అక్షరాల అల్లికతో... పదాల పందిరితో.... నే నేసిన ఈ ప్రేమ్ కవితల తోటలో మీ లేఖ ద్వారా ఆ నవ్వుల పువ్వులు విచ్చుకునేదెన్నడో..?

అందుకే, అందుకో నీకై రచించిన ఈ కమ్మటి కావ్యంలో నా భావోద్వేగాలను పొందుపరిచి నాకందిస్తున్న నా ఈ ప్రేమ భావాన్ని" అంటూ ఆ లేఖను తన్మయత్వంగా కావ్య చదువుతుండగా...

"ఎక్కడి నుండి వచ్చిందే ఆ లెటర్?" అంటూ కిచెన్ లో నుండి కావ్య వాళ్ళమ్మ కావ్యను అడగడంతో...

"ఏదో రాంగ్ అడ్రస్ కి వచ్చిందమ్మా..!

ఇదిగో ఈ టేబుల్ పై పెడుతున్నా...

నాకిక్కడ చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. లోపలకీ వెళ్లి చదువుకుంటా ..!" అంటూ ఆ లెటర్ తాను తీసుకుని, పై కవర్ మాత్రం ఆ టేబుల్ పై పెట్టీ

(తన తల్లి గమనిస్తుందనే ఉద్దేశ్యంతో)

లోపలికి వెళ్ళి, ఏకాంతంగా కూర్చుని చదువు వంకతో, ఆ లెటర్ లో ఉన్న మిగిలిన భాగాన్ని చదవడం మొదలు పెట్టింది కావ్య.

"యడబాటనే కుంగుబాటు బాధిస్తున్నా..

పొరపాటనే భంగపాటు బంధిస్తున్నా..

కనుపాపకి కునుకు దూరమై కలవరపెడుతున్నా..

కంటికి కన్నీళ్లు కరువై కలచివేస్తున్నా..

ఎరుగని నీ రూపును క్షణక్షణం భ్రమిస్తూ..

వినపడని నీ పిలుపును అనుక్షణం జపిస్తూ..

దరిచేరని నీ తలపును తక్షణం తపిస్తూ..

చేరువవని నీ వలపులో ప్రతి క్షణం నిద్రిస్తూ..

ఆలపించనా చెలియా నా ఆవేదన!

ఆలకించవా సఖియా ఈ అభ్యర్థన!!

ఆదరించవా ప్రణయమా నా ఆలోచన!

ఆశించనా ప్రియతమ నీ ఆదరణ!!

మనసులో మాటువేసిన మధుర భావం!

వాక్యాలుగా పెనవేసిన ప్రతి పదం!!

నీ దరికి చేర్చనా ఈ కన్నీటి కావ్యం!

నా దరికి చేరదా ఆ చిరకాల స్నేహం!!

నీ యద లోగిళ్ళలో విశ్రాంతికై,

ఒంటరిగా సంచరిస్తున్న ఓ బాటసారిని!

నీ జత కౌగిళ్లలో బందీకై,

ఓపికతో పరితపిస్తున్న "నీ ప్రేమ్ పిపాసిని"!

నా ఈ ప్రతీ స్పందనకు మీ దగ్గర నుండి కనీసం ఒక్క ప్రతిస్పందనైనా పొందగలనే ఆశతో, నమ్మకంతో ...

నా లేఖకి ,

ప్రేమతో లేఖ రాస్తున్న

మీ ప్రేమ్...

యొక్క ఈ ప్రేమ లేఖ

ఇప్పటికైనా, ఎప్పటికైనా మీ దరికి చేరుతుందని ఆశిస్తూ...

                      ❤️@@@@@❤️

అంటూ సాగిన ఆ లెటర్... కావ్యని ఎంతగానో ఆకర్షించింది.

ఎంతలా అంటే,

ఆ ప్రేమ్, లేఖల మధ్య వారి ప్రేమ లేఖలతో పెనవేసుకుని, వాళ్ల మధ్య చిగురించిన ఆ ప్రేమ గురించి, ప్రేమ్ మరియు లేఖల గురించి మరింత విపులంగా తెలుసుకోవాలనిపించేంత.

అప్పుడే, తను... అంతకుముందు వచ్చిన ఆ లెటర్ గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది.

"ఆ లెటర్ ఆ రోజు అమ్మ తీసి ఎక్కడ పెట్టిందబ్బా ..!" అంటూ కావ్య తీవ్రంగా ఒకటే దాని గురించి ఆలోచిస్తుండగా...

సరిగ్గా అప్పుడే కావ్య వాళ్ళమ్మ ఆ తన రూంలోకి వచ్చి,

"కావ్య .!.

నేను స్నానానికి వెళ్తున్నాను,

స్టవ్ మీద రైస్ పెట్టాను, ఒకసారి చూడంటూ" తను స్నానం చేయడానికి వెళ్ళి పోయింది.

అలా వాళ్ళమ్మ వెళ్ళిపోగానే, అదే మంచి సమయమని భావించిన కావ్య...

వంటిట్లో అణువణువునా ఆ లెటర్ గురించి వెతికింది.

కారణం... నాగలక్ష్మి(కావ్య వాళ్ళమ్మ)కి ఏ వస్తువైనా ఆ వంటింట్లోనే జాగ్రత్తగా దాయడం అలవాటు.

ఆ రోజు తీసుకున్న లెటర్ కూడా... అక్కడే ఎక్కడో పెట్టుంటుందనే ఓ ఆశ తనకి.

ఆ ఆశ తోనే ఆ లెటర్ గురించి వెతికిన కావ్యకి, తన ఆశ అడియశ కాకుండానే అది దొరికింది.

ఆ లెటర్ కాస్తా తీసుకుని, తన రూం లోకి వచ్చేసి అదే చదువు వంకతో ఆ లెటర్ కూడా తెరిచి చూడగా...

అందులో కూడా ...

                                ❤️@@@@@❤️

"ప్రియమైన లేఖ గారికి,

మీరక్కడ క్షేమంగా ఉన్నారో.. లేదోనని.. నా మనసు ఆందోళన చెందుతున్నా, క్షేమంగానే ఉండాలని అది ఆకాంక్షిస్తుంది. 

గత రెండు వారములుగా నేను పంపిస్తున్న లేఖలు మీకు అందుతున్నాయా?

లేక బదులుగా మీరు పంపిస్తున్న లేఖలు నాకే చేరడం లేదా?

ఆ రోజు... నా మనసులో అభిప్రాయం మీ దగ్గర విన్న వించుకోగానే, తర్వాత దాని మీద మీ ప్రతిస్పందన కూడా తెలిసి, చాలా సంతోషించాను. కానీ, ఆ తర్వాత నుండి మీ దగ్గర నుండి మరెలాంటి స్పందన లేదు.

నా భావాలు మీ మనసుని నొప్పించి,

లేనిపోని తంట ఎందుకని మీ మనసుకి అనిపించి,

అలికిడి లేకుండా మీరు ఉండిపోయారా..?

లేక మీ ఇంట్లో ఇదంతా తెలిసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఏమైనా అన్నారా...?

లేదా మరింకేదైనా కారణం కావొచ్చా..? అని మనసెందుకో కీడుని శంకిస్తుంది.

అందుకే, ఉండబట్టలేక ఉప్పొంగుతున్న నా మది అలజడి రేగి అది సృష్టించి రాస్తున్న ఈ ప్రేమ కావ్యాన్ని అందుకొండి,

"నా కవితల తోటలో

విరబూసిన ఓ పారిజాత పుష్పమా

నా ఆశల లోకంలో

వికసించిన ఓ వేకువ కిరణమా

నా ఊహల పల్లకిలో

మోస్తుంది నీ ఊసుల జ్ఞాపకాలే

నా రాత్రుల కనులలో

కంటుంది నీ రూపపు కలలే

అందని ఓ అదృశ్య అందమా

అగుపించని ఓ అపురూప ఆకృతమా

వినిపించని ఓ నక్షత్ర శబ్దమా

కరుణించని ఓ వెన్నెల చంద్రమా

నీ రాక కోసం నా కనులు రెండూ ఎదురుచూసే,

నీ పిలుపు కోసం నా చెవులు రెండూ అలుముకునే,

నీ పేరును స్మరిస్తూ నా పెదవులు రెండూ అలసిపోయే,

నీ కౌగలికి పరితపిస్తూ నా కరములు రెండూ సాగిలపడే.

నదిలాంటి నా మనసు ప్రవాహంలో

రాయి లాంటి నీ జ్ఞాపకాలను విసిరేసి,

అది సృష్టించిన ప్రేమపు అలల అలజడిని

ఆస్వాదించనంటూ నువ్వలా వదిలేసి వెళితే ఎలా?

కోవెలలో హారతిలా వెలుగొందిన నా స్వచ్ఛ ప్రేమ భావం

ఆఖరి చితి మంటై నీ ఆశలను దహించివేసిందా...

నీకై నిరంతరం పరితపిస్తున్న నా పిచ్చి మనసు పాపం

వేదనల నీటి అలలై నీ ఆశయాలను హరించివేసిందా...

నిర్మలమైన నీ యద లోగిళ్ళలో...

సృష్టించిన నా అనుభూతుల ఆశలను,

హృదయ స్పందనలనే తీగలతో మ్రోగించనా ?

బంధమనే ఓ చక్కటి గానాన్ని నీకై ఆలపించనా ?

స్వచ్చమైన నీ మది పుస్తకంలో...

అమర్చిన నా ఆలోచనల అక్షరాలను,

మనసు భావమనే కలముతో లిఖించనా ? 

ప్రేమతో నా ఈ అద్బుత కావ్యాన్ని నీకందించనా ?

మీ ప్రతిస్పందన తో కూడిన నా లేఖ యొక్క లేఖ కోసమై, వెయ్యి కనులతో... కోటి ఆశలతో... ఎదురుచూస్తూ ప్రేమతో మీ ప్రేమ్!

                          ❤️@@@@@❤️

అంటూ ఆ లెటర్ చదివిన కావ్య..

ప్రేమ్ మనసంతా లేఖపై నిండుకున్న ఆ ప్రేమ భావానికి , వారి ప్రేమకు చిహ్నమైన ఆ ప్రేమ లేఖతో వారి ప్రేమను వర్ణించే విధానం చూసీ, ప్రేమ్ ప్రేమకి కావ్య మనసే దాసోహమైంది.

ఈ రోజుల్లో తను ఆశించే స్వచ్ఛమైన ప్రేమ దొరకదనుకున్న తనకి, ఈ కాలంలో కూడా ఇలాంటి ఒక ప్రేమ ఎదురవడంతో..

ఆ లెటర్స్ అన్ని ఒక చోట తను భద్రంగా దాచుకుని,

ఆ లేఖలో ఉన్న లేఖ కోసం అన్వేషించడం ప్రారంభించింది కావ్య.

అసలు లేఖ ఏమైనట్టు..?

అంతకుముందు వరకూ తన ఉత్తరాలకి స్పందించిన లేఖ, సడెన్ గా ఎందుకసలు తన అడ్రస్ కూడా ప్రేమ్ కి చెప్పకుండా వెళ్లిపోయింది...?

ప్రేమ్ ప్రేమను అంగీకరించినట్టే అంగీకరించి, అలా ఉన్నట్టుండి ప్రేమ్ కి లేఖ దూరంవడానికి కారణం ఏమిటి..?

ప్రేమ్ భావించినట్టు,

ఇంట్లో ఏమైనా ప్రేమ్, లేఖల ప్రేమలేఖ గురించి తెలిసి వాళ్ల ప్రేమకి అడ్డుకట్ట వేశారా..?

లేక ఇంకేదైనా కారణం అయ్యుండోచ్చా..?

అంటూ కావ్యతో పాటు మీకున్న సందేహాలు కూడా నివృత్తి కావాలంటే,

తర్వాతి బాగం

"ప్రేమ లేఖ - 3" లో చూద్దాం.

కావ్య సహాయంతో ప్రేమ్, లేఖల మధ్య ఈ "ప్రేమ లేఖ" మరిన్ని కమ్మటి కావ్యాలతో ఇంకా కొనసాగబోతుంది.

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract