వత్తి
వత్తి
దీపపు. వత్తి కాలినప్పుడు
అప్పుడు...
ఓకే సారి కనపడని ఏదో తావి..
కనబడే పొగ వ్యాపిస్తాయి.
ప్రకాశం .. స్వగతాల మాటల్లా...
నచ్చీ నచ్చని.మెచ్చీ మెచ్చని మాటల్లా...
చిక్కదనం కోల్పోయిన మజ్జిగలా
నలిపిన చివురులా...
అంతా...అన్నీ ...అన్నింటా
బయటకు వినబడని స్వగతంలా...
బయటకు వినిపించే. ప్రకాశంలా...
నాటకంలోని పాత్రలకే పరిమితమవాల్సిన
స్వగతం..ప్రకాశం
ఇపుడు అన్నింటా...
స్వగతానికి ప్రకాశముండదు
ప్రకాశానికి స్వగతముండదు
మబ్బు చూస్తోందని మాలతి
మాలతి పూస్తోందని మబ్బు
మానవ నైజాలకు ప్రతీకలౌతూ..
పతాకలౌతూ...
విచ్చీ విచ్చని మొగ్గల్లా
పూచి పూయని పూవుల్లా
పచ్చి పాలమీద విరిగిన మీగడలా
మాటలెన్ళో...మాటల ఆటలెన్నో
వాటి ముఖాలెన్నో..స్వగతం.. ప్రకాశాల్లా...
.త్వమహం అంటూ సోహం అంటూ ఏకం కాలేక
ఆహపు రంపపు పళ్ళ గుచ్చుతూనే...
నిదుర నీయని నిశిలా
ప్రేమ పంచని ఒడిలా
స్వగతం.. ప్రకాశాల్లా...
మనిషి ముఖంలో కనబడే రెండు పెదవులు..
రెండు కళ్ళలా..
అంతర్యపు అంతరాంతర ముఖాలు అంతే...
గుర్తించలేని స్వగతాల్లా...
ప్రకాశంలో మాట్లాడే మాటలకు
భిన్న ముఖాలున్నట్టే
స్వగతంలోను అగుపడని
మాటల ముఖాలెన్నో...
