నా ముని వేళ్ళతో
నా ముని వేళ్ళతో
అక్షరాలు ప్రియసఖులై..మీటే'నా ముని'వేళ్ళను..!
ప్రేమలేఖ వ్రాయమంటు..కోరే'నా ముని'వేళ్ళను..!
మదిని దోచుకునే తీరు..దాచుకున్న నెఱజాణలె..
విరహాగ్నిని చల్లార్చగ..అడిగే'నా ముని'వేళ్ళను..!
భావరాగ సోయగాల..వరదలయే తీరేదో..
ఒక వీడని తపస్సులో..ఉంచే'నా ముని'వేళ్ళను..!
చమత్కార క్షీరధార..సాక్షులుగా నిలిచేనవి..
పంచదగిన వెన్నకాచ..పట్టే'నా ముని'వేళ్ళను..!
గజలియతే ప్రాణముగా..తలపోసే తనమేదో..
పోషించే కుశలతలో..ముంచే'నా ముని'వేళ్ళను..!
నిజశ్వాసల లోగిలిలో..జన్మకథా వీధులలో..
విహరించే వేడుకలో..దించే'నా ముని'వేళ్ళను..!
