వసివాడిన పసి ప్రాయం
వసివాడిన పసి ప్రాయం
బడికి నోచుకోని బాల్యం
దౌర్భల్యపు బతుకు వెతుకులాటలో
గతికే కాసిన్ని మెతుకుల కోసం చితికిపోతుంది
పస్తులుండలేక పనికి కుదిరితే
సుస్తీ చేసినా తప్పని భారాన్ని మోస్తూ
చేయందుకునే దోస్తీ కోసం ఎదురు చూస్తుంది
ఐశ్వర్య స్వైర విహారంతో
నరక చెరకు స్వరం మూగదై
ధైర్యం కోల్పోయి దైన్యం చవి చూస్తుంది
డాక్కాముక్కీల తొక్కిసలాటలో
బక్కచిక్కిన బొందిపై లెక్కలేనన్ని గాయాలకు
మందు రాసే దిక్కుకై మొక్కుతుంది
గడిచిన రోజుకు దండం పెడుతూ
పొద్దుపొడిచే గండాలను తలచుకుంటూ
కన్నీళ్ళతోనే తలవాల్చుతుంది
వసివాడిన పసి ప్రాయం!
రచన : వెంకు సనాతని
