ప్రతిరోజూ పండగే!
ప్రతిరోజూ పండగే!
కోడి కూతకు
గాఢనిద్ర ఎటో ఎగిరిపోయింది
కాడి మోతకు
కోడెగిత్త వంత పాడింది
పచ్చని పొలాల మీదుగా
నునువెచ్చని ఉదయం వచ్చి వాలింది
హెచ్చుతగ్గుల్లేని మాటల దారిలో
స్వచ్ఛమైన పల్లె హృదయం పరిమళించింది
పొద్దుపొడుపుతో పని పాటా
పొద్దుగుమికితే ఆ మాట ఈ మాట
అరమరికల్లేని అవకాయ కబుర్లు
ఆరుబయట మంచపై అమ్మమ్మ కథలు
మనసును కట్టి పడేసే మట్టి వాసనలు
వయసును పట్టి వలేసే బెట్టు వాదనలు
అల్లిబిల్లి ఆటలాడే పిల్లలు
ఒడ్లు దంచుతూ జోలపాడే తల్లులు
పొలాలు వేరైనా, హలాలు వేరైనా
అందరం ఒక్కటేనన్న భావనతో
వసుదైక జీవన సౌందర్యంతో
పొలం గట్లతో, పచ్చని చెట్లతో
ముగ్గుల వాకిట్లతో, జాతర తప్పెట్లతో
పల్లె గడపకు ప్రతిరోజూ పండగే!
రచన : వెంకు సనాతని
