వృద్ధాప్యం బాల్యమై ఏడుస్తుంది
వృద్ధాప్యం బాల్యమై ఏడుస్తుంది
వృద్ధాప్యం బాల్యమై ఏడుస్తుంది
ముడతల ముసలితనం చూసుకుంటూ
వయసు పెరిగిన మనసుల్లో బాల్యాన్ని చూస్తూ
అలనాటి జ్ఞాపకాలను గోరుముద్దలో కోరుకుంటుంది..!!
బాల్యం దాటేసిన యవ్వనం రోషం పోస్తుంటే
కొండంత ఆత్మవిశ్వాసంతో కోర్కెలు పెంచుకుంటే
అయోమయంగా దారులు వెతుక్కుంటే
దాహం తీరని వయసు వంకర్లుగా తిరిగిపోయే..
మధ్యస్థం కుటుంబాన్ని భుజాలపై మోస్తూ
సంసారం నిత్యం తలపై నాట్యం చేస్తుంటే
రేయింబవళ్లు కనురెప్పలు నిదురకై ఎదురుచూస్తూ
ఆర్థిక వనరుల పెంచుటకు శ్రమను అంతా ధారపోసే..
తరుముకుంటూ వచ్చే వృద్ధాప్యం కాల ప్రవాహంలో
మూలనపడ్డ ముసలి ఎద్దులా ఏర్పడే పరిస్థితి
పంపకాలలో సతాయించే సంతానాలు గొడవలు
రాలిపడ్డ జీవిత ఫలం లో కనిపించని స్వప్నాలు..
ఇంట్లో శిలాఫలకములా వేలాడే అందమైన ఫోటోలు
ఆశ్రమాలకు ఆస్తులుగా పెరుగుతున్న వృద్ధాప్యం
కన్నబిడ్డల్లో కనికరం కారం లాగా తయారయ్యింది
ఆశల చూపుల్లో ఆకలి తగ్గి కన్నీళ్లలో కరిగి పోతుంది..
వయసు తనువును కరిగించి కురిపించిన శ్రమ
రక్త సంబంధం తనివితీరా స్నానం చేస్తుంది
ఎదిగిన సంతానం నిలువునా శరీరాన్ని చీలుస్తుంటే
రుణగ్రస్తుని జీవితం మూలన ఇంకా మూలుగుతుంది..
బాల్యం గుర్తుకు వచ్చి ఏకాకిలా ఏడుస్తుంది మనసు
అర్థ శరీరం విడిపోతే మనసు బావి ఇంకిపోయింది
ఈ బ్రతుకు ఎంత బాధ అంటూ నింగికి చూస్తుంది
ఈ జన్మలో ఈ నరకం మరొకరికి వద్దంటుంది వృద్ధాప్యం..
