అనుకోని అతిధి
అనుకోని అతిధి
కలలో ప్రేయసి కళ్ళ ముందుకొచ్చి
కన్నీళ్లు కొంగుతో తుడిచినట్లు
అనుకోని అతిథి వచ్చి తలుపు తడితే
ఉబ్బితబ్బిబవుతాం, ఆనందంలో తడిసి ముద్దవుతాం
ఇల్లు పావనమైనట్లు ఆహ్వానిస్తాం
కడుపు నింపి పంపడానికి తంటాలు
మబ్బు పట్టిన ఆలోచనలు
విసుగును పతాక స్థాయికి తీసుకెళ్తే
చలి చర్నాకోల దెబ్బలకు
చర్మం పగుళ్లు సతాయిస్తుంటే
చీల్చుకొని వచ్చిన సూర్యుడు
వెలుతురు ఆలింగనాలు చేస్తే
అనుకోని అతిధి కంటే మర్యాదగా ఆస్వాదిస్తాం
బాల్యాన్ని కమ్మగా ఆస్వాదిస్తున్నప్పుడు
అమ్మమ్మనో, నానమ్మనో అనుకోకుండా వచ్చి
నాలుక రుచులకు పండుగ చేస్తే
మనసు జాతరలో దేవున్ని ఎత్తుకున్నట్లుంటది
పిల్లల ముద్దు ముచ్చట్లతో పెద్దలు మురిపాలలో
అనుకోని అతిధులు ఎక్కడ కలిసినా
పాత స్నేహ పరిమళాలు పరిసరాలలో విస్తరిస్తాయి
గంగ వెర్రులెత్తినట్లు గతాన్ని తవ్వుకుంటాం
జ్ఞాపకాల ఉత్సవం చేసుకుంటాం
అనుకోని అతిధిలా యమభటులు వచ్చినా మంచిదే
మంచాల మూలుగుల గోస తప్పుద్ది
ఇంట్లో వాళ్ళు లోలోపల విసుక్కునే బాధ ఉండదు
కాలు చేయి సక్రమంగా ఆడినప్పుడే చస్తే
శరీరవయవాలనైనా చేయొచ్చు దానం
స్వీకర్తల ఆశీస్సులతో మరింత కాలం జీవించొచ్చు
