శ్రమయే దైవమంటా
శ్రమయే దైవమంటా
శ్రమయే దైవమంటూ
పచ్చని పైరే కోవెలంటూ
కదిలారు మహిళలు,
రేయిలో స్వప్నాలు పండించే చెమటకు పైరుగాలి రాగాలు
వినిపిస్తూ కదిలారు మహిళలు.
పలకరించు వానచినుకుకు
అరిటాకునే ఛత్రిగా చేసుకుంటూ,
జాగ్రత్తలు చెప్పేటి పొలంగట్ల మాటలతో
జీవనపాఠాలు నేర్చుకుంటూ,
పల్లెపదాల జానపదులకు
కొత్తబాణీలు కూర్చుతూ,
వెర్రితలల విజ్ఞానానికి
మెతుకువేదం చెప్పగా
కదిలారు పల్లెపడుచులు.
కీడుచేయు కలుపును
మనసు క్షేత్రంనుండి పెకిలించగా,
ప్రకృతి పులకింతకు సోయగకాంతులు దిద్దగా,
ధాన్యసిరుల రాసులతో
భూమాతాను మురిపించగా,
విరివనాల వందనాలను దరహాసంతో స్వీకరిస్తూ,
ఆశల తలపులకు
కొత్త ఉత్సాహం నింపుకుంటూ
పచ్చిమట్టినే
పసిడిముద్దగా భావిస్తూ
కదిలారు శ్రమజీవులు
పుడమితల్లి శోకపువ్రాత మార్చగా.
