వెలుగు పూలు రథం
వెలుగు పూలు రథం
చీకటి తెరలను కప్పుకొన్న
నిశ్శబ్ద తీరం నిద్ర పోవాలని
కనురెప్పలను మూసిన ప్రతిసారి
ఓ దుఃఖ కెరటం మనసుపై
కొరడా ఝుళిపిస్తుంది
ఉలిక్కిపడి లేచిన జ్ఞాపకం
ఓ విషాద గీతాన్ని
ఓ నిట్టూర్పు రాగాన్ని
నీలాకాశం నిండా పూసిన
నక్షత్రాల వెలుగు పూల స్వరంతో సవరించి
పగడపు తిన్నెలపై
అరుణవర్ణాన్ని రాల్చిన ఉషోదయాన్ని
గుండెకు హత్తుకొని
దూరపు కొండల వద్ద
తెరచాపనెత్తి కదులుతున్న నావను చూసిన
స్పూర్తితో సేదదీరుతుంది....
కాలం క్షణాల బిందువులను పోగేసుకొని
జీవనదమై ప్రవహించి
కొత్త పూల వంగాడలను
మనోతీరంపై వదలి నిష్కమిస్తుంది....
ఓ ఆశాలత మొలకెత్తి
చిరునవ్వుల పూల పందిరిలా అల్లుకొంటుంది
ఓ కాంక్ష వాసంత సౌరభమై
ఎడారి జీవన సౌందర్యాలను పలుకరిస్తుంది
ఓ అడుగు తడారని చెమ్మలపై
ఓదార్పు పూల కొమ్మలా నీడనివ్వలాని తపిస్తుంది
ఓ ఆశయం కొత్త దారిని తొలిచే
అగ్ని పూల రథమై పయనమవుతుంది
