తొలి ప్రేమ
తొలి ప్రేమ
నువ్వు గడప దగ్గర
బంతిపూల రాశిలా కూర్చుని
తలవంచుకొని
నా గుండెను మెలిపెడుతూ
జడనల్లుకుంటుంటే
ఎన్ని మార్లు లోలకంలా
అటూ ఇటూ తిరిగానో..
నీ ఇంటి ముందు
జాలిగా రాలిపడిన
వేపపూతనడుగు
తోటకు నువ్వొస్తావని
ఎండలో ఎంత ఘోర తపస్సు చేశానో
నా కాళ్ళ క్రింద
అగ్గిలా మండుతూ
ఆవిర్లు విడుస్తున్న
ఇసుక నడుగు
ఎవరో వస్తున్న అలికిడి విని
అదరి..
బెదరిన జింకలా
ఒక్క ఉదుటన
ఎన్ని మార్లు ఎగిరి దూకానో
ఎండిన వాగు ప్రక్క
చిక్కని తుమ్మ ముళ్ళ నడుగు
వేసవి సెలవులకు
ఊరంత ఆశతో నేవస్తే
మీ ఇంటి ముందు
పెండ్లి పందిరి చూసి
నీకోసం
నా చూపుల్ని శరపరంపరగా
అన్ని దిక్కులకు పంపి
నిష్ఫలుడనై
ఎంత దుఃఖించానో
నేనీదులాడే
తోట బావి నీళ్లనడుగు.

