తడిసిన చెమట చుక్కలు
తడిసిన చెమట చుక్కలు
తడిసిన చెమట చుక్కలు కారుస్తుంది తనువు
కాలం పిండి నటువంటి జ్ఞాపకాలతో
ఆ గాజు కళ్ళు మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ
యుగాన్ని దాటుతున్నానని సంతోషం కలిగించే..
వయసులో యుగళ గీతాలు ఆలపిస్తే
నడివయసులో బాధ్యత భుజాలపై తాండవం చేసే
ముడతలు పడ్డ ఛాయలతో చీకటి వ్యాపిస్తే
రోగాల పోరుతో విషాద గీతాలు వినిపించే..
పలచనైన రక్తం పాడె పైకి పాకుతుంటే
వణుకుతున్న శరీరం వంకర్లు పోతూ నడుస్తుంటే
మూడవ కాలు పొందక నడుము విరిగితే
శ్మశానములో చితాభస్మం తనువంతా కప్పబడే.
కడుపు వెన్నుతట్టి కట్టెలా మారింది తనువు
వెంటిలేటర్ పై దేహం ఎన్నో ప్రశ్నలకు సమాధానం
అంపశయ్యపై శస్త్రచికిత్సల కాలం సాగుతుంటే
అవయవాల ఆదాయంలో బేరసారాలు సాగుతున్నాయి.
అంతుచిక్కని కాలపు నీడలో ఆరబెట్టిన దేహాలు
అసుర సంధ్యలో చీకటి ఒప్పందాలు సాగుతుంటే
ఔషధాలన్నీ విషయంగా మార్చుకునే ప్రయత్నంలో
లేని రోగాలకు చికిత్సలు జరుగుతున్న కాలం...
కన్నీళ్ళతో సాగనంపే మనుషులు కనబడలేదు
ప్రతి దాంట్లో నటన చూపే ఉద్దండులు ఉద్భవిస్తుంటే
కన్నీటి చుక్కలను లెక్కలు వేస్తున్న సమాజంలో
వయస్సును మోయలేక తనువులను తుంచుతున్నారు..
