"తారతమ్యాల తడక"
"తారతమ్యాల తడక"
ఓ ఈశ్వరా...
రాయిని శిల గా మల్చి నిను దేవుడిని చేసెలే శిల్పి!
ఆ శిల్పి అంటరాని వాడాయే!!
గర్భగుడి కట్టి నీకు నీడనిచ్చెలే తాపీ మేస్త్రి!
ఆ తాపీ మేస్త్రికి కాసింత నీడ కరువాయే!!
మాసిన బట్టలుతికి నిను శుభ్రం చేసేలే చాకలి!
ఆ చాకలి మలినపడిన వాడయే!!
డోలూ సన్నాయితో నిను మేల్కొలిపేలే మంగలి!
ఆ మంగలికి నిను తాకే అదృష్టం లేకపోయే!!
పల్లకి చేసి నిను ఊరంతా తిప్పేలే వండ్రంగి!
ఆ వడ్రంగికి నిను మోసే అర్హత లేదాయే!!
ఎవడు వచ్చెను బంగారపు గర్భం చీల్చుకుని,
ఎవడు పోయెను వజ్రాల పాడి కట్టుకుని.
తాగే నీరు, పారే నెత్తురు, నిల్చున్న నేల అందరికీ సమమైనప్పుడు,
ప్రభువేవడు? బానిసెవడు??
ధనికెవడు? పేదేవడు??
నీ భక్తులు!
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదోయి..!!
మరి, ఏవేవో కులవృత్తుల నుండి గూడు కట్టిన ఈ కులగజ్జి తారతమ్యాల తప్పుల తడకలన్నీ నీ సృష్టేనంటావా?
ఆ తప్పుల తడకలన్నింటిలో,
నువ్వున్నావంటూ ఒప్పుకుంటావో ?
లేక, నే లేనని తప్పుకుంటావో ??
నీకే ఎరుక ఓ పరమేశ్వరా!!
- సత్య పవన్✍️
