"సమయానికి లేదోయ్ తిరోగమనం..!"
"సమయానికి లేదోయ్ తిరోగమనం..!"
నింగిని ఆవహించిన నడిరేయి చీకువాలైనా,
ఆ చీకువాలును చీల్చే ఉషోదయపు భానుడి కిరణాలైనా..!
పొద్దస్తమాను కార్యకర్మములతో అలసిన నీ దేహామైనా,
ఆ దేహాన్ని సేద తీర్చే నడిరేయి జాబిలి కౌముదైనా..!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
ఎగిరెగిరి పడుతూ తీరాన్ని చేరే కెరటమైనా,
ఆ కెరటం శాంతించి, అణిగిమణిగి ఒడ్డును తాకే అలలైనా..!
ఎగిసెగిసి పడుతూ గమ్యాన్ని చేరే అధికులైనా,
ఆ అధికులను అంకితత్వముతో జయించి లక్ష్యాన్ని చేరే అల్పులైనా...!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
ప్రళయాన్ని సృష్టించే పెను పవనాలైనా,
ఆ పవనాలకు కారణమై ప్రకృతిని ఆహ్లాదపరిచే పిల్ల గాలులైనా..!
అపాయాన్ని కలిగించే ఆందోళనలైనా,
ఆ ఆందోళన విరమింప ఉపాయాన్ని కల్పించే ఆలోచనలైనా..!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
ప్రజ్వరిల్లుతూ దహించి వేసే ఉజ్జ్వలాగ్నిశిఖలైనా
ఆ శిఖలతో వెలుతురు పంచి గమ్యాన్ని చూపే లాంతరైనా..!
బంధాలను కాల్చేసే ఆగ్రహ జ్వాలలైనా,
ఆ ఆగ్రహ జ్వాలను చల్లార్చి సత్సంభదాలను ఏర్పరిచే చిరునవ్వులైనా..!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
అస్తిరత్వంతో భూమి కంపింప చేయు భయ ప్రకంపనలైనా
అస్థిరత్వాన్ని ఒడ్డుకొని అవిరామంగా వంగి తిరిగే భూ భ్రమణాక్షమైనా..!
అస్పష్టతతో మదిలో కంపనాలు కలిగించే తలంపులైనా,
ఆ తలంపులు తట్టుకుని నిరంతంగా కొట్టుకునే నీ ఎద స్పందనలైనా..!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
పంచభూతాలే సమయ పాలన అనుసరిస్తున్నప్పుడు,
ఆ పంచభూతాల్లో ఓ చిన్న అణువైన మనం, సమయ పాలన అనుకరించకపోతే ఎలా?
ఒంటరిపాటు ఘిరాయించి ఏకాకిలా మిగిలున్న నువ్వైనా,
ఆనగానుంటూ దన్నుగా నిలిచిన మరువరాని చెలిమైనా..!!
కొంత సమయం వరకే,
ఎందుకంటే, ఆ సమయం వెళ్ళిపోతుంది...!!!
ఆ సమయానికి లేదోయ్ తిరోగమనం...!!!!
ఈ సమయం ఎంత కటినమైనది అంటే,
కోరుకున్నది అనుకున్న సమయానికి జరగనివ్వదని.
అనుకున్నదయ్యే సమయానికి కోరుకున్నది దక్కనివ్వదని అనుకుంటారు.
పగలు - రాతిరికి, పుట్టుక - చావుకి ఉన్నట్టే,
శాంతికి - అశాంతికి, జయానికి - అపజయానికి ఇలా ప్రతీ పయనానికి ఒక సమయమంటూ వస్తుందని
చెప్పుడు మాటలు వింటూ...
శ్రమ విడిచి అదృష్టం వైపు చూస్తూ...
ఉన్న సమయాన్ని కాస్తా వృధా చేసుకుంటుంటే మీకంటే మూర్ఖులు ఎవరుంటారు...?
అసలు జీవితమనే ఒక అద్భుత ప్రయాణాన్ని నడిపే ఇంధనం సమయమనే వాస్తవాన్ని గ్రహించరెందుకు...??
సమయమనే ఇంధనాన్ని సరిగా ఉపయోగించకోకపోతే జీవితమనే ప్రయాణమనేది సాఫీగా సాగునా...???
దీనికి గల కారణం...
సమయం మనతో ఆడే అటంటారా.?
లేక, సమయానికి మనమిచ్చే ప్రాముఖ్యతంటారా.?
ఒకసారి మీరే ఆలోచించండి !!
గీతలో కృష్ణుడన్నట్టు
ఈ సమయం ...
సంతోషమైనా... దుఖమైనా... తాత్కాలికమే..!
ఎందుకంటే, అవి కలిగే ఈ సమయం వెళ్ళిపోతుంది..!!
- సత్య పవన్✍️✍️✍️
