సమస్తం
సమస్తం
నేను నీకు ఏమిస్తిని..నీవిస్తివి సమస్తం..!
అడగాలనుకునే లోపు..వడ్డిస్తివి సమస్తం..!
కరుణకు అర్థం చెప్పే..మరోమాట ఏదోయి..
ఎందుకులే కళ్ళతోనె..కురిపిస్తివి సమస్తం..!
లేఖ ఒకటి వ్రాయాలని..వెతికితినే మాటలను..
ప్రేమభాష సోయగాలు..అందిస్తివి సమస్తం..!
నీ తలపుల కొమ్మలలో..కోకిల నేనైతినె..
చెలిమిరాగ సుధలేవో..పొంగిస్తివి సమస్తం..!
చైత్రవీణ తనువైనది..నవనాడులు తంత్రులే..
నృత్యనాట్య రహస్యాలు..వెలిగిస్తివి సమస్తం..!
నాలోపల ఉంటూనే..నన్ను మాయచేసేవు..
నేను నాది గొడవలేవొ..ఉడికిస్తివి సమస్తం..!

