సెల్యూట్
సెల్యూట్


సెల్యూట్!!!
అభినందన్ జీ...
మొలకెత్తుతున్న విత్తులన్నీ
ముకుళించిన చేతులతో
విధేయపూర్వక నమస్కార చిహ్నాల ప్రతీకలై
నీ క్షేమ స్థైర్య ధైర్య విజయ కార్యానికి
గౌరవ వందనాలు చేస్తున్నాయి.
నామసార్ధకత తో కూడిన
జన్మసార్ధకత ఈ అఖిల భారతావనిలో
కోట్ల మాతృహృదయాలకు
నీవు నిలువెత్తు స్ఫూర్తి ప్రదాత.
తమకడుపున భావితరపు బిడ్డలు
నీ మూర్తిమత్వంతో జన్మించాలని
కోరుకునే మార్గదర్శకత్వపు పటిమ నీది.
ప్రత్యర్ధులచేత చిక్కినా,
నీ అకుంఠిత
దేశభక్తి ధీరత్వపు వీచిక ఒక్కటి చాలు
వారి చర్మరంధ్రాల విస్ఫోటనానికి.
నీ చాకచక్యం,సమయస్ఫూర్తి ల
కవచకుండలాల దానానికై
లక్షలాది నీ సహోదరులు
వీరరక్తపు శరీరాలతో
నీరాకకై ఎదురు చూస్తున్నారు.
నీ ఆగమన శబ్ద సంగీత తరంగాలు
భరతమాత పెదవుల లాస్యమంజీరాలు.
వెన్ను విరుచుకుని రెపరేపలాడే
మువ్వన్నెల పతాకపు ధర్మచక్రానివీవు.
తరతరాలకు జాతి గౌరవాన్ని
చరిత్ర పుటల్లో పాఠమై
నిలచిన మరో చరిత్రుడవునీవు.
వందనం అభినందనా...
నీనామధేయ చందనం...!!!
..............