రహస్యస్వర్గలిపి
రహస్యస్వర్గలిపి
వేదిస్తున్న వెచ్చని చలి
సెగలు పుట్టే నెత్తురు లోంచి
ఈ భూమ్మీద నీవు ఉన్నా వన్న
ఆనందం ముందు
నా ముందు నువ్వు లేవన్న దుఃఖం పటాపంచలైపోయింది
నిన్ను ఊహిస్తూ
ప్రేమిస్తా
నిన్ను ప్రేమిస్తూ
నన్ను ఉహించుకుంటా
స్పర్శకు అతీతమైన సరసంలో
ఒంటి మీద నూలు పోగు లేని
మనిద్దరం
వెన్నెల రాత్రులను స్వప్నిద్దాం
నీ రూపు రేఖలను తలచుకుంటూ
నీ నుదురు మీద పెడుతున్న
వెచ్చని ముద్దు
నిత్యం
నిన్ను తాకుతుంది కదూ
ఏకాంతం గా
నీ ఎంగిలి ని రుచి చూస్తున్నా
నీ మధురమైన స్వరాన్ని పదేపదే వింటున్నా
కౌగిలి కి అందని
నీ ఒళ్ళో
ముద్దుల చప్పుడు ను
ఏ లోకం వినకుండా నిశ్శబ్దం గా
మన ఇద్దరి చెవుల్లో మార్మోగిద్దాం
నీ కురులలో నా చేతి వెళ్ళు
నా గుండెల మీద నీ పాద ముద్రలు
మన మనసులు రాస్తున్న రహస్య సరస లిపిని
మనిద్దరి మధ్య ఉన్న దూరం లో
దారులన్నీంటి మీద లిఖిద్దాం
నన్ను గుర్తు తెచ్చుకుంటూ నువ్వు
నిన్ను గుర్తు తెచ్చుకుంటూ నేను
మన ఆలోచనల్లో మనం తరచూ కలుసుకుందాం
ప్రతీ క్షణం పక్కపక్కనే ఉంటూ పరవశించి పోదాం
స్ఖలనం లేని సుఖంలో స్వర్గాలను అధిరోహిద్దాం

