పరిమళం
పరిమళం
ఎప్పటిదో రంగుల లేఖ ..
తెమ్మెర తాకిడితో
ఎగిరొచ్చి మనసుపై వాలింది..
భావ పారిజాతాల పరిమళాలు
గుప్పుమన్నాయి..
నీలి సంద్రాల లోతుల్లో
మునిగి తేలింది..
నికార్సయిన నిజాయితీ
బల్ల మీద రెప రెప లాడింది..
అచ్చం నాలానే పూసిన పూవొకటి
లేఖని ముద్దాడి జారిపోయింది..
రెక్కలు కట్టిన క్షణాల దొంతర్లలో..
అల్లాల్లాడే రెప్పల కాటుక నుసి
జారి నిరీక్షణలా తిరుగుతోంది..
మనసునుండి జారే మౌనాలన్ని
గాలుల వంతెనపై తారట్లాడి
మనసుని గుచ్చుకుంటున్నాయి..
మోహo ఆవరించిన కనులకి
చీకటిలోనూ మెరుపుల సౌరభం
విందు చేస్తోంది..
లోలోన గుబులు రేపే అనిద్రాపూరిత
ఘడియలన్ని కలగలిసి అందమైన
వాక్య లతల్లో ఇమిడి పోతున్నాయి..
ఎన్నో దూరాల చీకటిని మోసిన మనసుకి
చుక్కల వానల్లో తడిచే చంద్రుడు తారస పడ్డాడు..
నిన్ను నిర్వచిoచడానికి పదాల సాయాన్ని
కోరుతూ.. అల్లికల అక్షరమై మరులు పోతాను..
నీ దూరాన్ని లెక్కించే కొలమానాలు ఎరుగని
కవితల్లో అసంపూర్ణ వాక్యంలా వెను తిరుగుతాను..
రేపటి పొద్దుకి దారిచ్చే చీకటిలో నీకై
నింగిలో వెండి పుష్పాలతో నిన్ను
అభిషేకిస్తూ.. ఒరిగిపోతాను..
నిర్వచనాలకి అందని పూలతోటల్లో..
జలతారు మంచు ముత్యాల నడుమ
నీ పరిమళాలను ఆస్వాదిస్తాను..
నువ్విక్కడే నాలోనే ఉంటే..
ఎక్కడెక్కడో వెతికిన వెర్రి వాడ్ని..
విడదీయలేని ప్రేమల్లో మునిగాక..
శిఖరాన్ని చేరుకున్న అహమిప్పుడు
శిరోభారాల బరువుతో మూల్గుతూ..
నీ పాదాక్రాంతమైంది..
నిన్ను చేరుకున్న దారులన్నీ సుగంధ
సుకుమార.. బృందావనాలుగా
తోస్తున్నాయి..
అర్ధనిమీలితమైన మనసుతో నిన్ను
కనుగొన్నప్పుడు..
ఎటు చూసినా భావ రంజిత పరిమళాలు..
అనేక వర్ణాల పూదోటలు సాక్షాత్కరించాయి..
మనసునే వరించిన ప్రేమ.. పూల పరిమళమై
అల్లుకుని మాటలెరుగని ఏకాంతంలో పడేసి..
భారమైన ఊపిరి పాటల్ని వినిపించింది..
వ్యక్తావ్యక్త తరంగమైన ఎద వేదికలో
అవ్యక్తాల కవితలు పురుడోసుకుని
నిరుపమాన నృత్యాభినయాన్ని కావించాయి..
నిను గన్న కళ్ళకు.. నీ చేయందుకున్న మనసుకు
శూన్యంలోనూ వేవేల ఇంద్రచాపాల వర్ణాలు
ఉక్కిరి బిక్కిరి చేశాయి..

