ప్రేమ కాంతి
ప్రేమ కాంతి
ప్రేమకాంతి వాన'లోన..పడుతున్నది గ్రోలుచుందు..!
మౌనసుధా వాహినినై..ఎద ఎదలో నిండుచుందు..!
ఈ బంతులు చేమంతులు..గులాబీలు రాలేనా..
తెంచబడే పూలఘోష..ఎన్నాళ్ళని పాడుచుందు..!
ఆరగించు వారెవరో..చూడాలని తలచలేను..
అక్షరాల పరమాన్నం..చెలిమిమీర పంచుచుందు..!
ఎవరినేమి అనజాలను..అందరిలో నీవు కలవె..
పొగడపూల దండలనే..ఏర్చికూర్చి వేయుచుందు..!
ఎంచగాను వేగిరపడు..మాటలతో పనేంలేదు..
నీ చెదరని చిరునవ్వే..అనువాదం చేయుచుందు..!
నీవే నేనుగ ఉన్నది..ఉన్నట్లుగ చెప్పనిమ్ము..
రుచికే రుచియౌ దానికి..రూపమేదొ చెక్కుచుందు..!
