ప్రేమ దీపం
ప్రేమ దీపం
మా అమ్మకు వంటగదే
అత్యంత ప్రీతిపాత్రమైన స్థానం
పొగ్గొట్టమే తన తొలి నేస్తం
గరిటెపట్టి వండితే అన్నపు మెతుకులు
పూలరాశిలా సంబరపడతాయి
ఏనాడు పుస్తకాల ముఖం చూడకున్నా
మనుషుల మనస్తత్వాలను
చదివిన మనిషిగా జీవితంలో
లోకజ్ఞానమెరిగి బతకడం నేర్చింది
మా ఇష్టాలనే తన ఇష్టాలుగా
మార్చుకుని ప్రేమదీపమై
మా ఇంట వెలుగును పంచి
మా బతుకుల్లో సంతోషానికి అర్థం తానై నిలిచింది
పచ్చకాగితాల కోసం
ప్రాకులాడే స్వార్థం మధ్య
ఉన్నంతలో పంచుకుని తినే గుణాన్ని
అలవర్చుకున్నా అన్నపూర్ణగా
తన పేరును సార్థకం చేసుకుంది
పారబట్టిన మట్టి చేతులతో శ్రమించి
అక్షరాన్ని భిక్షగా ప్రసాదించి
కలాన్ని కానుకగా అందించి
మా వెన్నంట ధైర్యమై నిలబడింది
త్యాగానికి తెగింపుకు ముందుండే
అమ్మకు మేమెన్నటికీ తన ఒడిలో
ఒదిగిపోయే చంటిబిడ్డలమే
రుణం తీర్చలేని ఆ హృదయ ప్రేమకు
ఆద్యంతం కట్టు బానిసలమే!
