పోలి స్వర్గం
పోలి స్వర్గం
అత్తయగు మాలి
పోలిని విడిచి తక్కిన కోడళ్ళతో కూడి
ఆర్భాటముగ చేసె కార్తీక స్నానము
కార్తీక దీప దానము
అత్తా తోడి కోడళ్ళు
సంబరముగా కృష్ణ ఒడ్డుకు పోయిరి
ఇంటి పనులకు బందీగా
పోలి ఒంటిగా మిగిలిపోయె
అందరూ చేయు కార్తీక వ్రతము
తాను చేయలేకపోతినని చింతించి
ఇంటి కుండలోని నీటితోనే కార్తీక స్నానము చేసె
తన చిరుగు వస్త్రమును చింపె
దానిని ఒత్తిగా చేసె
కవ్వమునకంటిన వెన్న తీసి
దానిని ఒత్తికి రాసి
కార్తీక దీపముగా వెలిగించె
హే పుండరీకాక్ష
హే గోవిందా
నా శక్తి కొలది చేసిన పూజను స్వీకరించమని
మనసారా మాధవుని మ్రొక్కి
కండ్ల నీరు నింపె
ఆమె భక్తిని గాంచి పొంగె కార్తీక దామోదరుడు
పోలిని బొందితో వైకుంఠము చేర్చమని ఆదేశించె
బొందితో వైకుంఠము చేరు పోలిన చూసి
అచ్చెరువొందిరట జనము
ఏమిది ఏమిది
ఏ పుణ్యము చేసె పోలియని బుగ్గలు నొక్కుకునిరి
తాను ఆడంబరాలకు లొంగి మొహమాటపడనని
నిజమైన భక్తితో నన్ను నమ్మి మ్రొక్కిన
నే వారి స్థితిని గాంచి
నా భక్తులుగా స్వీకరించెదనని
పలికె పద్మనాభుడు
హంగు ఆర్భాటాల కన్నా
లేశమైననూ నిజమైన భక్తి చాలునని
అది భగవంతుని అనుగ్రహం కలిగించునని
నిరూపించిన పోలి కథకు గౌరవం
ఈ పోలి స్వర్గం