పైన నీలి తెర కింద ధూళిపార
పైన నీలి తెర కింద ధూళిపార
నేల నుంచి నింగికి చూపుల బాణాలేస్తే
సూరీడు రాల్చే వెలుతురు సుమాలు పెద్దదిక్కు
భూమి కడుపెండినా
భూచర్మం మాడి మసిబొగ్గయినా
హరిత సంపదతో తులతూగినా
నింగి నేలకు మధ్యన ఓజోన్ పొర, మబ్బులు మరెన్నో చేయూత
భూమి రాత్రికాటుక పూసుకుంటే
పొద్దంతా కళ్ళముందున్నవి కనిపించకపోవచ్చు
ఆకాశం ఒంటిపై దగదగలాడే వజ్రాల నగలెన్నో
హారం మధ్య చందమామ మెరుపులు
వాటి ఊరేగింపులు ఉల్లాసాలు
భారీ టెలిస్కోప్ నుంచి చూపుల తూటాలేస్తే
చంద్రుని పైకి దారి దొరికింది
అంగారకుని అడ్రస్ లభించింది
సోపతి రాకపోకలు సాగుతున్నాయి
పల్లెలు పల్లీల్లా ఒలువబడనప్పుడు
మేతకు రాకపోకల పశువుల ధూళి వేళలుండేవి
అవసరాల మీటలు నొక్కిన కొద్దీ
విజ్ఞానం విశ్వవ్యాప్తమై పరిమళించింది
వస్తువులు, వాహనాలు పెరిగాయి విచ్చలవిడిగా
నేలపై కాలుష్య ధూళి పొరలు పైకి పైపైకి చేరి
మట్టికుండ లాంటి ఓజోన్ పొరకు చిల్లులు
ఆకాశం నీలితెర మాటేమో కానీ
కింద కాలుష్య పొరలు చప్పరిస్తున్నాయి ఆరోగ్యాలు
నింగికి నేలకు సత్సంబంధాల ముడి వీడనప్పుడే
భూమిపై అన్నింటికి ఆయుష్షు మేలు
