STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పాత ఇల్లు

పాత ఇల్లు

1 min
1


ఇల్లు పాతదే, తండ్రులు తాతలు కట్టిందే
మట్టి మమతల వాసన వేస్తున్న గత వైభవం
చెక్కుచెదరని జ్ఞాపకాల గుట్ట
ఏ గోడను, తలుపును, గడపను తట్టి చూసినా
తనువెల్లా స్పందనల కంపనలు, ప్రకంపనలు
పుట్టుకలు, పెళ్లిళ్లు, మరణాలు అన్నీ
గుండెల్లో పదిలపరుచుకున్న ఆల్బమ్ లే
నాలుక కింద పదిలంగా దాచుకున్న సంగతులే 

బొడ్డు కోసి పదిలంగా పడుకోబెట్టిన బాల్యం
తల్లిపాలు తాగి పక్క తడిపినా చూపిన ప్రేమ
సంకకెక్కించుకొని ఇచ్చిన నాన్న భరోసా
ఇంటిల్లిపాది అందించిన మమతల బలం
అన్నీ సొంతం చేసుకున్న నడక, నడత
బాల్యాన్ని బంగారుమయం చేయకున్నా 
నిటారుగా నిలబెట్టిన చేయూతలు 
యవ్వనం నోట్లో ప్రేమ మిఠాయి పెట్టిన ఘటనలు
ఒకటొకటి కళ్ళ ముందు కదలాడేవే 

గడప దాటితే ఇరువైపులా నీడనిచ్చిన వాకిలి
ఎన్ని హుందాతనాలను నిలబెట్టుకున్నదో
ఎన్ని స్నేహాల వారధిగా నిలిచిందో
కష్టాలు, కన్నీళ్ళకు అండగా ధైర్యం చెప్పిందో
పిల్లలాటలు, పెద్దల ముచ్చట్లు అన్నింటికీ వేదిక
ఎండాకాలం ఎందరిని నిద్రపుచ్చిందో చల్లగా 

ఇంటిల్లిపాది చరిత్ర దానికి తెలిసినంత
తెలియదు వేరెవరికి
నోరు విప్పి చెప్పకపోవచ్చు కానీ
మొగురాలు, గోడలు, గదులు, తనబ్బీలు, కిటికీలు
కుర్చీలు, బల్లలు, పెద్దపీట, మంచాలు,
దేన్ని తడిమినా పొరలు పొరలుగా విచ్చుకుంటది గతం
వంటింట్లో కట్టెల పొయ్యి, చిట్టు పొయ్యి
ఎన్ని రుచులను వండి వార్చాయో 

అది చల్లటి నీడనిచ్చిన పెంకుటిల్లే
కోతుల ఆటకు తల్లడిల్లిన పైకప్పు
వర్షాలకు ఎన్ని ఊర్పులను తట్టుకున్నదో
ఎన్నో జీవితాలను నిలబెట్టింది
ఎన్ని దశాబ్దాలను చీర కుచ్చిల్లలా మడత పెట్టుకున్నది
ఎందరి నిద్రలకు కలల పాన్పు వేసింది
నాటి పల్లెల పండుగలన్నీ ఊరేగింపులైందక్కడే
ఇల్లు పాతదే చిరకాల స్మృతులక్కడే


Rate this content
Log in

Similar telugu poem from Classics