ఓ అమ్మ కధ
ఓ అమ్మ కధ
అమ్మ రేపటి తన బతుకు గురించి
ఒక్క క్షణం ఆలోచించలేదు
తొలి పొద్దు తూరుపున ఉదయించే
సూర్యుడు మలి సందే పడమర
అస్తమిస్తాడని తెలుసుకోలేని పిచ్చిది అమ్మ
ఒకనాడు అందరికి తల్లి
వేరులాంటి అమ్మ తన నీడన
చేరిన గువ్వ పిల్లలకు బతకటం
నేర్పింది,ఆ ఆనందంలో తన
గురించి ఆలోచించటం మరిచి
పోయింది వెర్రి అమ్మ
అందుకే నేడు కూకటి వేళ్ళతో
పెకిలించ బడింది అమ్మ
కూడు గుడ్డ నీడ ఇదే జీవితం
అనుకున్న అమ్మ మనసిప్పుడు
గడిచిన గతం తలుచుకుంటు
ఆలోచనలతో దయ్యాల
నిలయంగా మారింది
అమ్మ చేతి గోరుముద్దలు తిని
పెరిగిన ఎన్నో చిట్టి రూపాలు
నేడు అవహేళనతో మరణ
మృదంగం మోగిస్తూ అమ్మకు
బతుకు భయం నేర్పిస్తున్నాయి
ఎందరికో వెన్ను తట్టిన అమ్మకిపుడు
పలకరింపులే యమ పాశాలయ్యాయి
పిడికెడు మెతుకులు కోసం తూరుపు
లోగిలి వైపు హృదయం దహించేలా
దీనంగా చూసే చూపులిపుడు అమ్మవి
కోర్కెల కొమ్మకు విరబూసిన
అమ్మ రంగురంగుల ఆశలు
హరివిల్లులై ఎగిసి చివరకు
మనసు వికలమై కన్నీటి దారలలో
కొట్టుకు పోయాయి అమ్మ ఆశలు
మనసులో వికశించిన మల్లెల
పరిమళాలు,గుభాళించే వేళ
హృదయం మండటెండగా
మారి మల్లెల లోని తెల్లదనం
వాడి రాలిపోయింది
రేపటిని తలుచుకొని క్షణక్షణం
ఉలిక్కిపడుతుంది అమాయకపు అమ్మ
చిక్కని చీకటిలో కీచురాళ్ళ
రొదలు నిశ్శబ్ధాన్ని చేదిస్తుంటే
చల్లగా వీచే గాలుల సవళ్లు
సైతం అమ్మకు మృత్యు దేవత
పద ధ్వనులుగా వినిపిస్తున్నాయి
గుండె భయంతో రెపరెప
కొట్టుకుంటుంటే శ్మశాన వైరాగ్యంతో
నిర్జీవంగా బతుకుతుంది అమ్మ
ఒకప్పుడు తన రెక్కల చాటున
ఒదిగిన తన వారు ప్రేమతో
తనకోసం వడివడిగా వస్తారని...
కట్టుకున్నవాడు కరుణతో వచ్చి
కౌగిలిలో సేదదీరుస్తాడని...
కన్నపేగు కదిలి వచ్చి ఆర్తిగా అమ్మా
అంటూ అల్లుకుపోతారని....
అమ్మ నీడన పెరిగిన చిరుమొక్కలు
వటవృక్షాలై నీడనిస్తాయని...
రాని వారికోసం ఆశగా మసక బారిన
కళ్ళతో గుమ్మం వైపు ఎదురు చూస్తూ
ఎప్పుడో ఓ క్షణాన రాలిపోతుంది పిచ్చి అమ్మ
