నువ్వు నేను
నువ్వు నేను
ఇరువురిగా ఒక నువ్వు, ఒక నేను
అయినా నువ్వే నేను, నేనే నువ్వు
మన ఇద్దరి సంగమంతో మనం
ఏడడుగుల బంధంతో మమేకం
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన తనువులు
ఆలుమగలుగా పెనవేసుకున్న క్షణాలు
వైవాహిక జీవితానికి అచ్చొచ్చిన గడియలు
రెండు గుండెలను కలిపిన సంతోషాలు
బతుకులు బంధంగా మారిన రోజు
ఒకే బతుకుగా బతుకుతున్న రివాజు
ఆశలు, ఆశయాలు అన్నీ మిళితం
రేపటి తరానికి ఆదర్శంగా సమ్మిళితం
ఒకే మాట, ఓకే బాట,ఒకే చోట
ఏదిఏమైనా, ఏదిచేసినా ఒకే మనసు
పదములు వేరైనా పలుకు ఒకటే
పాదాలు వేరైనా చేరే గమ్యం ఒకటే
కలలు కన్న ఊసులు, చేసుకున్న బాసలు
ఆత్మల ఐక్యతతో కలసిన ఇరు మనసులు
ఆజన్మాంతం తోడునీడగా ఒకరికొకరు
కష్టసుఖాల్లో బంధాన్ని విడదీయలేరు
సంసారంలో సరిగమలున్నా, లేకున్నా
కష్టాలెన్నీ కమ్ముకున్నా, కన్నీళ్లు ఎన్నున్నా
నీలినీడలు నిలువెల్లా ముసురుకున్నా
ఒక్కటై అన్నిటినీ అధిగమిస్తూ పంచుకున్నా
నలుగురిలో ప్రతి నోటా వారిరువురి పేరేనట
వారు పొరపచ్చాల్లేని జంటగా ప్రతీతట
ఈగోల గోలలేని వారు ఇగురంగా బతుకునట
వైషమ్యాలు, వైరాగ్యాలు లేని వెలుగులట !
