నల్ల గులాబీలు
నల్ల గులాబీలు
నలుపంటే పడదా నీకు
నువ్వు వంశీ సినిమాల్లో హీరోయిన్లా నల్లటి స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటావు అనుకున్నానే
నాకు నలుపు షర్ట్ గిఫ్ట్ ఇచ్చావ్ మరి
తెలీకుండానే ఇచ్చావ్
చూడు నిన్నూ నన్నూ నలుపే కలిపింది
నాకైతే నలుపు చాలా ఇష్టం
ఆకాశం మొత్తం నీలంగా ఉన్నప్పటి కన్నా
నల్లటి మేఘాలు కాస్త కమ్ముకుంటే
ఆ దృశ్యం అపూర్వం అనరూ
ఏ కాస్త వెన్నెల కనిపించినా
ఆ నల్లటి రాత్రి కవితావేశం ఆవహించదూ
ఇంకా నల్లటి మిరియాలు పొంగలి తినేప్పుడు పంటి కింద పడితే ఆ ఘాటు అద్భుతం అవదూ
నలుపు నీ చెక్కిలి మీద దిష్టి చుక్క
నలుపు అనంతానంత అంతరిక్షపు గుట్టు
నలుపు నీ జుట్టుకు ఆకర్షణ మంత్రం
అందుకే ప్రియా
కష్టపడి పెంచాను నల్ల గులాబీలు
ఇక నా అభిరుచులపై చెప్పకుండా పితూరీలు
ఏలుకో నా మానస సరోవరాలు

