నిస్స్వప్న
నిస్స్వప్న
నిస్స్వప్న రాత్రులిపుడు నన్ను చెరబడుతున్నాయి
ఏ ఆలోచనలూ కురవని నిద్రలోకి నడిచెళ్లిపోతున్న నాతోటి కొన్ని సమస్యలు విడిపోతున్నాయి
ఏమీ పట్టడం లేదు మనసుకు
మదువును తాగిన మైకంలా అంతా శూన్యం
ఏ రేపటి భీకర యుద్దాల ప్రశక్తీ లేదు లోలోపల
ఇప్పుడంతా జరుగుతున్న నాటక వీక్షణం
తప్పొప్పుల ప్రశ్నలేవీ వేధించడం లేదు
ప్రస్తుతానికి అనుభూతిని ఆస్వాదించడం
రెక్కల గుర్రాలేవీ రానక్కరలేదు కదూ
ఎవ్వరికోసం ఎక్కడినుంచీ
నక్షత్ర మండలాలేవీ నడవక్కరలేదు కదూ
చీకటి చచ్చిన బతుకులో
వెలుగులు ఏలుతున్న కళ్ళలో
ఆశించడం నచ్చట్లేదు
అందుకే అనుభవించడానికి పూనుకున్నాను
ఎదురుచూపుల పొడ అస్సలు గిట్టట్లేదు
చూపులకు కళ్లెం వేయడం మానేశాను
షెహభాష్....
అంతరాత్మా....
ఇంతలా నన్నర్ధం చేసుకుని నాలో మిగిలిపోయావ్
పారాహుషార్....
అద్దంలోని ప్రతిబింబమా....
ఛీ కొట్టే చోటును నాలో మిగల్చక నన్ను నన్నుగానే చూపిస్తున్నావ్
నజరానాలు....
నయవంచకతెరుగని నేనా....
లోకానికి దాసోహమౌతూ నాలో ఇంకా బతికున్నావ్....
