నిశ్శబ్దంగా
నిశ్శబ్దంగా
కవితకు, కవిత్వానికి ఎన్నో మూలాలు
కవిత కానిదేది, కవిత్వం పుట్టనిదెక్కడ
శబ్దం, నిశ్శబ్దం నుండి జాలువారే కవితలెన్నో
మనసు భావోద్వేగాల ఊటలే కవిత్వాలన్నీ
ఏకాకి మదిలో ఎకాఎకిన ఎన్నెన్నో భావాలు
ఒంటరితనంలో ఒనగూరే మది విస్ఫోటనలు
నిశ్శబ్దంగా ఎవరితో చెప్పలేని కొన్ని ముచ్చట్లు
కవితలుగా మలిచి స్వాంతన పొందే అచ్చట్లు
నిజంగా నిశ్శబ్దానికి నిలకడ కాస్త ఎక్కువ
ఆలోచించి, చివరకు సాగే కవన పయనం
ఓపిగ్గా, ఒద్దికగా ఒకింత రచనా సమయం
నిశ్శబ్దంగా పలికే భావాలతో నిబద్ధ కావ్యం
మదిలో మెల్లగా మసలే మనోభావాలు
ఒక్కొక్కటి అక్షర తూనిరంలోని అమ్ములు
మాటలు లేకున్నా భావాలు ఉప్పొంగుతాయి
కాగితంపై కవనాల పవనాలు ఊగుతాయి
ఒంటరితనంలో నిశ్శబ్దం కూడ ఒక నేస్తం
గాయాల వేదనలకు లేపనంగా హస్తం
గతాన్ని తడిమి, తడిమి వెంటాడే తత్వం
మెల్లగా అక్షర రూపం దాల్చే నిశ్శబ్ద కవిత్వం
పెదాలు పలుకకున్నా మనసుతోనే మాట
నిశ్శబ్ద స్వరంతో చేవ్రాలు పలికే తన నోట
గట్టిగా అరవలేని ప్రశ్నల పరంపరల వరుస
కవిత్వంగా ఒలికే ధిక్కారపు స్వరపు భరోసా
ఎవరికి కనిపించని అజ్ఞాత కవుల దొంతర
నిశ్శబ్దంగా కలం పేరుతో కవితల పరంపర
ప్రజల కోసం, ప్రగతి కోసం నిశ్శబ్ద సేవాతత్పరం
నిశ్శబ్దంగా రాసిన కవితలు సమాజహితం !!
