నిన్నటి రాగమే
నిన్నటి రాగమే
పూల పుప్పొడులనుఅద్దుకున్న
తుమ్మెదల ఝంకారాల సందళ్ళతో
సన్న సన్నగా పరిమళ గంధాలు
వీచే పిల్ల తెమ్మెరల గిలిగింతలతో
ఆమని పూసిన విరుల అందాల
ఆరబోతల అలరింపులతో
కువ కువలాడే కలకూజితాల
పలకరింపులపల్లవితో
అవని పరవశమైన పరువాల
పడుచులా పచ్చదనo తో తుళ్ళిపోతోంది
శుక, పికాలు మామిడి గుబురుల్లో
వసంత గీతాల ఊయలూగుతున్నాయి
శిశిరoలో మౌనమై మూగవోయిన అవని
వసంతాగమనంలో ఒళ్ళు మరచిన కేరింతల బాల్యమైంది
వాసంతానికి మురిపించే వన్నెలెక్కువే
అందుకే ప్రకృతి తనని హత్తుకు పోతుంది
శిశిరానికి గంభీరపు హుందా తనమెక్కువే
అందుకేనేమో ప్రకృతి తనను తాను ఒలుచుకుంటుంది
శిశిరానికి వాసంతానికి మధ్య సంధికాలం ఒకటుంది
అటు రాలిన ఆకుల విషాదాన్ని భరించలేక
ఇటు నవ పల్లవాల పురిటి నొప్పుల నోర్వలేక పడుతున్న వేదనను ఏకకాలంలోచవి చూస్తూ
వసంతo లో హాయిగా పాడుకున్న కోయిల
తరలి వెళ్లిన వసంతం మళ్ళీ తనదరికి రాదా అని
హాయిగా నిన్నటి రాగమే పాడుతోంది కోయిల
మావి పల్లకిలో ఆశల సరాగాలేన్నోతీస్తూ ఆనంద అమృతత్వాన్ని రాగాలకు అద్దు కుంటూ...

