నీవస్త వని
నీవస్త వని
ఇంకా నీకోసం రెండు కళ్ళు ఎదురుచూపులు
నీవస్తావని దారి పొడుగునా విచ్చుకున్నాయి
అప్పుడెప్పుడో పలకరించి వెళ్లావు
పువ్వుల్లా విచ్చుకున్న అనుభూతి కలిగింది..
గుండె గుప్పెట్లో ఇంకా ఆ శబ్దం వినపస్తుంది
పరిసరాల్లో ఆ ధూళి కనిపిస్తుంది
నువ్వు ఇష్టంగా విసిరిన చిరునవ్వు
ఇంకా ఆ దారి వెంటనే పరిగెడుతుంది...
ఆ దారి మొత్తం పరుచుకుంది నీ జ్ఞాపకం
పక్షులన్నీ పడిగాపులు కాస్తున్నట్లు
నింగిలోని దారి మౌనంగా కూర్చుంది
నువ్వు వెళ్లే చోటులో ఊహల రెక్కలు విప్పాలని...
దారి పొడవునా నీ దృశ్యాలు వెంటాడే
చెట్లన్నీ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ
నీ అందాలనే వర్ణించుకుంటూ పెరిగాయి
నీ ముని వేళ్ళ స్పర్శతో మురిసిపోయాయట...
పచ్చని హారము లాంటి సౌందర్యం
మెరుపులాంటి ముఖంలో ఆనందం
మొలకల చిరునవ్వుల గుర్తుచేస్తున్నాయి
ముఖం తిప్పుకోకుండా వెంటాడుతున్నాయి..
దారి పొడవునా అంతరాత్మ ప్రశ్నిస్తోంది
కనుపాపల్లో నీ రూపం తిరుగుతూనే ఉంది
నీకోసం ప్రతి రోజు ఎదురు చూస్తూనే
వస్తావని ధ్యాసతో మైలురాయిలా నిలిచింది...

