నీది కన్నీరు
నీది కన్నీరు
నది కన్నీరది,
జారి జారి, వరదగా మారిందది
జనజీవితాలను ముంచేత్తి నదది!
ఎన్నో బతుకులకు తీరని వ్యధను మిగిల్చిందది.
కొంపా గోడు, గొడ్డు, గోదాం ను తుడిచిపెట్టినదది!
పరుగులు దీస్తూ,పారే నదికి
ఉరకలు వేస్తూ వూగే మదికి
కళ్లెం వేసి ఆపుట,ఎవరి తరం?
స్వేచ్ఛగా జారే నది ప్రవాహపు హద్దుల్లో
అడ్డు అదుపులేక,చొరబడి పోతే
కట్టలు తెగిన నది క్రోధం, శాంతం మరచి
కలబడి పోదా?
లయబద్దంగా, పరవళ్లు తొక్కే నదీ నదాలకు
ఆగ్రహం వస్తే, జనపదాలన్నీ
జల మయం కావా?
వరదప్రవాహపు నీళ్లలో కొట్టుకుపోవా?
జనజీవనం అతలాకుతలం అయిపోదా?
అడిగేవాడు, ఆపేవాడెవడు లేడని
కరకట్టలను,,కన్ను మిన్ను గానక, స్వార్ధంతో,
ఊళ్ళగా ఇళ్లగా దురాక్రమిస్తూ,
లోతట్టుల్లో, తట్టా బుట్టలు తో కాపురాలు చేసేస్తుంటే
ఆహ్లాదాల నది మదితట్టుగోగలదా?
నేరం ఆ నదిది కాదు
విజ్ఞత మరచి, వీధికెక్కిన,చొరబాట్ల
మానవ తప్పిదాల విశ్రుంఖలపు,
వికృత విన్యాసాలకు,
జనమంతా జాగృతమై
జనజీవన హితానికి, ప్రకృతి పరిరక్షణే
ప్రధమ కర్తవ్యం అని ప్రతిన బూనాలని
ప్రకృతి నేర్పిన గుణపాఠం!
