నేటి భారతం
నేటి భారతం
నా భారతదేశం...
అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు పుట్టినిల్లు !
ఎందరో రాజులను, కవులను, ఋషులను, సంఘసంస్కర్తలను, స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది.
అంతేనా ?
అనేక ఔషధాలు, విజ్ఞానాన్ని, నాగరికతలను ఈ ప్రపంచానికి అందించింది.
వీటన్నింటినీ తన పొత్తి కడుపులో పదిలంగా దాచుకుని ప్రపంచ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నా ఈ భారతావని ...
మన తాతల కాలం నుండి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశంగా మిగిలిపోవడానికి గల కారణాలు ...
నా ఈ "నేటి భారతం !" అనే కవితా ద్వారా....
రైతుల కన్నీటితో తడిచిన పంట సేద్యాలను,
కార్మికుల స్వేదాలతో నిర్మించిన దేశభ్యున్నతినే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
విస్మరించిన సైనికుల పోరాటాలను
గతించిన సమర యోధుల త్యాగాల ఫలితాలనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
విధేయత లోపించిన విద్యార్థులతో
గౌరవం పొందని గురువులనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
సంస్కారం కోల్పోయిన సంతానంతో
పున్నామ నరకానికి పయనమైన తల్లిదండ్రులనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
కులాల కుంపట్లు రేపే కార్చిచ్చులను,
మతాల మధ్య రగిలే విద్వేషాలనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
వర్ణాల వివక్షతో మెలిగే జనులను,
ప్రాంతాల వేర్పాటుతో జరిగే ప్రజలనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
లంచాలు మరిగే ప్రభుత్వ కార్యాలయాలను,
అంచెలుగా ఎదిగే రాజకీయ నాయకులనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
బలవంతుడిని బలంగా తీర్చే రాజ్యాంగలను
బలహీనుడిని బానిసలా మార్చే చట్టాలనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
రామబాణం నిలువరించలేని అన్యాయాలను
గీతోపదేశం నియంత్రించలేని అఘాయిత్యాలనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
బట్టలు ఊడుతున్న మగువలను
నెత్తురు పారుతున్న రహదారులనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
రూపాయి కోసం ప్రాకులాడే నిరుపేదలను,
రుణాలు ఎగ్గొట్టి పారిపోయే పారిశ్రామికులనే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
నాయకత్వపు లేత మొగ్గలపై
పేరుకుపోయిన రాజకీయమనే రొచ్చును
స్వార్థమనే ఉచ్చులో కూరుకుపోయిన
సేవా భావపు గుణాన్నే
నిన్నటి స్వేచ్చా స్వతంత్రమందామా ?
రేపటి భావీ భారతమందామా ??
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వాక్యానికి ఐక్యతేది ?
బానిసత్వాన్ని పోగొట్టుకోవాలని పిలుపునిచ్చిన అంబేద్కర్ ఆశయాలకు విలువేది ?
స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటి చెప్పిన తిలక్ పదాలకు అర్ధమేది ?
దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది ? అన్న నేతాజీ మాటలు గుర్తున్నాయా ?
ఇకనైనా మేలుకో...
ఓ భారతీయుడా ?
లే...
లే...
ఐక్యతనే పిడికిలితో బద్దలు కొట్టు కులపు గోడలను
సమైక్యతనే అగ్గితో కడిగేసేయ్ మతమనే చిత్తు కాగితాన్ని
పాలిస్తేనే పాలకుడంటే ఎలా ?
నడిపిస్తేనే నాయకుడవుతాడని గుర్తుపెట్టుకో.. !
మట్టి మట్టి ఏర్పడితే దేశం కాదోయ్,
మనిషి మనిషి కలిస్తేనే దేశమన్న విషయాన్ని మరిచిపోకోయ్...!!
-mr.satya's_writings