నేను నేనుగా లేను
నేను నేనుగా లేను
రకరకాల నవ్వులు అలంకరించుకున్నాను
ఎవరిలానో ఉండాలని..
పనిని బట్టి పులుముకున్న నవ్వు ..
సత్యశోధనకు దొరకదు
పుస్తకాలలోని హావభావాలు
ఇతరుల మస్తిస్కాల్లోని ఆలోచనలు
మెదడు పరాన్నజీవి
హృదయం అద్దెకొరకు
నేను లేను
వ్యక్తిత్వ వికాసం ఎలా
విజయానికి చాలా మెట్లు
ఎక్కే వారే అందరూ..
నా ఆనందం అమ్మివేయబడింది
స్వేచ్చ కంచె వేసుకుంది
నవ్వును చెరశాలలో బంధించారు ..
నా ప్రేమకు పెళ్లి చేసేశారు
కన్నీటికి జాలి లేదు
ఏ సందర్భమైనా ఒకటే స్పందన
కాలం యవ్వనాన్ని దోచేసింది
ఆకులు రాలే సన్నివేశాన్ని చూడలేను
అందరూ చెప్పేవారే
వినేవారి కోసమీ నిరీక్షణ
సలహాలు ఉచితం
సహాయం ఖరీదైంది
ఊరినుంచి ..నావారి నుంచి ..
మనసు నుంచి.. మమత నుంచి ..
నేను వలస పోయాను ..

