నాకో కల కావాలి
నాకో కల కావాలి
నాకిప్పుడో కల కావాలి..
అర్జంట్ గా నేనిప్పుడో కలను కనాలి..
ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అనాధ కునుకు అలా వచ్చినప్పుడు
విధ్వంసమైన అస్పష్ట జీవిత దృశ్యాలు..
ఉలిక్కిపడేలా చేస్తాయి..
పూరి గుడిసె పై కమ్ముకున్న పేదగాలి
రక్తంలో చేరిన దరిద్రానికి
మలాము రాయలేకపోతోంది..
జాతి యావత్తు దగాపడ్డప్పుడు పిడికిల్లోని ఆకాంక్షలు ..
రెక్కలు చిరిగిన పక్షులవుతాయి..
భద్రత కరువైన జీవితాలన్నీ
ఉద్యమాల ఉద్రేకాల గాలిపటాలై
వేలాడుతున్నాయి..
కళ్ళు మూస్తే చాలు..
కుళ్ళిపోయిన ఆశలు, ఆశయాల
కంకాళాలు కలవరపెడుతుంటాయి..
సర్రున జారిపడ్డ చుక్కలా..
ఏదో తీపి నిద్ర అలవోకగా తాకుతూ
అలా అలా వెళ్ళినప్పుడు కాసింత
సుఖస్వప్నాల్ని పలవరిస్తాను..
ఒక్క పాలబొట్టు కూడా రాని అమ్మ రొమ్ములాంటి..
పచ్చి నిజంతో రాత్రుళ్ళు రాబందులవుతాయి..
చీకటి వెలుగుల త్రిశంకు సందుల్లో
పట్టాల రెక్కల కొనలకు
యువతరం ఉరేసుకుంటోంది..
వాగ్దానాల కంపులో నగ్నమయ్యే నాయకులు..
ఓటు అంచులకు జీవితాల్ని పణంగా పెట్టిన జనాలు..
వాలిపోయిన అంగాల్లాంటి నీరసమైన చట్టాలు..
మెల్లిమెల్లిగా చైతన్యానికి చెదలు
పట్టిస్తున్నాయి..
కలలు కరువై కథలు పేరుకుంటున్నాయి..
ఇప్పుడు మనిషంటే ప్రాణంలేని
ఓ గుర్తింపు కార్డు..
సర్కారీ గోదాం లో దుమ్ముపట్టిన పాత ఫైలు..
వడ్డీలను మోస్తున్న ఓ
ప్రామిసరి నోటు..
కల కలగా మారిన తెల్లారని
మిడ్ నైటు..
అయినా.. నాకో కల కావాలి..
పొద్దు పొడుపుకు దీపం చూపించే
ఒక కలను కనాలనుంది..
కన్నీళ్లకు రంగులద్దే కలల లోకాన్ని నిర్మించాలనుంది..!!
