ముసురు
ముసురు
ఆకాశాన మేఘపుత్రుమ్పు ఒకటి తొంగి చూసింది
చూసింది ఊరుకోక కన్ను గీటింది!
మెరుపుగా
గీటిన మరుక్షణం ఆక్రమించింది ఆకసాన్ని పూర్తిగా
పూర్తయిన ప్రణయక్రీడా ఫలిత స్వేదమే ఈ చిరుజల్లు !
తలనెత్తి చూసిన రైతన్న కనులలో
అనంత వెలుగు వెన్నెలలా
అమంద కందానంతో అల్లిబిల్లి తిరిగాడు
వివశుడై
వర్షం కురుస్తూంది..
కురుస్తూనే ఉంది...
ముసురు పట్టింది ముద్దినాలుగా
కట్టుబడిలోనున్న వంతెన కూలిపోయింది..
కట్టుబడి లోపమో
కాంట్రాక్టర్ల ఆశా మోహమో
ఏలికల కమీషన్ల దాహమో
పసిపాపను చాప చుట్టినట్టు గుడ్డలో చుట్టి
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో
మారుస్తూంది కృషీవలుని ఆలి
పాప తడవకుండా
పిల్లి పిల్లలను మార్చినట్టు !
తడిసిన గుడిసె నిట్రాడు వంగిపోయింది
వృద్ధాప్యంతో....
ఏ క్షణం విరిగిపోతుందో
గుడిసె కూలిపోతుందో
ఆమె కళ్ళలో భయం !
అతని మోములో నిస్సహాయత!
ఆ భవనంలో షరాబు...
భవ్య మోహన ఆనందం
చల్ల దనానికి సలాం చేస్తూ
స్వెట్టర్లలో దేహం దాచుకుని
గవాక్షం గోళాన్ని చూపుతుంటే
వేడి వేడి పల్లీలను
ఒకటొకటిగా ఆరగిస్తూ....
ఒకరికి ఖేదం
ఒకరికి మోదం
ఒకరికి విషాదం
మరొకరికి వినోదం...

